కవితను ప్రచురించిన నవ మల్లెతీగ సాహితీ సంపాదక వర్గానికి, యాజమాన్యానికి మనఃపూర్వక ధన్యవాదాలు.
కవిత రాసిన వెంటనే తన విశ్లేషణను రాసి పంపిన విజయకు ప్రేమపూర్వక ధన్యవాదాలు…
మూల్యాంకనం..!!
లెక్కలు చూడాల్సిన పద్దులు
చాలా మిగిలిపోయాయి
బంధాలను తూకం వేయడానికి
తక్కెడ సహకరించడం లేదు
మనిషికి మనసుకి మధ్యన
కనబడని సన్నని తెర
గాలివాటానికి కొట్టుకుపోతున్న
మమకారపు పేగుపాశాలు
సుడిగుండాల చక్రవలయంలో
మాయమైపోతున్న మనిషితనం
నా నీ ల నడుమ నడుస్తున్న
జీవితపు ఆటే ఇది
పెద్దరికపు పసితనాలన్నీ
ఘనమైన వృద్దాశ్రమాల లోపలే
అహానికి ఆధిపత్యానికి
తలొంచక తప్పని జీవనచిత్రాలే
చిత్తరువులుగా చిరనవ్వులొలకబోస్తూ
యాంత్రికతకు అలవాటు పడుతున్న కాలమిది
గతానికి భవిష్యత్తుకి సమన్వయం చేయడానికి
చరిత్రకు ఏ మూల్యాంకం సరిపోతుందిప్పుడు?
మీ కవితలకి విశ్లేషణ అని కాదు కానీ మీ భావాన్ని ఒడిసి పట్టుకోవటం చాలా కష్టం మంజూమేడం. పదం చదవటానికి తేలికగా ఉన్నా లోతైన భావంతో ఉంటుంది.ఎందుకో ఈ మూల్యాంకనం కవిత మళ్ళీ బాగా నచ్చింది. తప్పేమైనా రాస్తే శిష్యురాలిని తిట్టకండి.అసలే మీకు తిట్లు కూడా బాగా వచ్చు.కూసంత ప్రయత్నం చేస్తున్నా మరి.....
మూల్యాంకనం..!!
"లెక్కలు చూడాల్సిన పద్దులు
చాలా మిగిలిపోయాయి"
కొన్ని పద్దుల లెక్కలంతే లెక్కకందవు.మింగుడుపడని బాధ్యతల హెచ్చవేతలుగానో ,కలతల కూడివేతలుగానో, కలహాల తీసివేతలుగానో ,ఎంత మూల్యం చెల్లించినా పెరుగుతూ పోయే భారాల వడ్డీ, చక్రవడ్డీలలాగా జీవిత చదరంగంలో మిగిలిపోతాయలా.వాటికి లెక్కలువేస్తూ వెళ్ళటం అంటే, జీవితపు నిమిషాలన్నింటినీ శూన్యంగా చేసేసుకుంటూ వెళ్ళటమన్నట్టే...
"బంధాలను తూకం వేయడానికి
తక్కెడ సహకరించడం లేదు"
సరైన ప్రేమలు ,ఆప్యాయతలు, ఆలంబనలు లేని బంధాలతో జీవితం ఎప్పడూ అస్తవ్యస్తమే.నెపాలు, లోపాలు వెతికే బంధాలలో సమతుల్యత ఎక్కడ దొరుకుతుంది అసలు.ఏ తారాజుతో కొలుస్తాము మనము మనల్ని మనంగా పొందే బంధాలసలే లేని ఈ రోజులలో.స్వార్థం, సంకుచితం బంధాలకు సంకెళ్ళయి బలం పెంచుకుంటూ భారాలవుతున్నాయి.బంధాలు పలుచనై జీవితపు తక్కెడ ఒరిగిపోతుందో పక్కకి.
"మనిషికి మనసుకి మధ్యన
కనబడని సన్నని తెర"
మనసు చాలా మాయావి అండీ.ఒకరకంగా ఈ మనసు మంచిగా ఉండటం కూడా మంచిది కాదసలు.మనిషిని ఆడించేసేది మనసే.మనసు కట్టడీ చేసుకోవటం తప్పనిసరే.మనిషిగా మసులుకోవాలంటే మనసుతో ముడిపడటం అనివార్యం.మనిషిగా బతకటం కన్నా మనసున్న మనిషిగా బతకటం తెలిస్తే అది విజ్ఞతే మరి.ఆ చిన్న మర్మాన్ని కనుక్కోవటం మసులుకోవటం మనిషికి చేతనవ్వాలి.చూడగలగాలి.అప్పుడే బంధాల మధ్య ఏర్పడిన అరమరికల తెరలు అడ్డుతొలగిపోతాయి.
"గాలివాటానికి కొట్టుకుపోతున్న
మమకారపు పేగుపాశాలు"
ఏ బంధం ఎంతవరకంటే నా బాగు నేను నీ బాగు నువ్వు చూసుకునేంత వరకు...ఈ రోజులలో.ప్రేమలు ఆప్యాయతలు అంగట్లో కొనుక్కోనే వస్తువులే ఎవరో అన్నట్లు. ఎటువైపు పోతున్నాయో మమకారాలన్నీ. ఒక ఇంటిలో వారి మధ్యే సక్యతలు కరువు బరువు.కన్నపేగు బంధాలన్నీ కన్నీరిచ్చే చెరువులే ఈ రోజుల్లో. ఎందరికో నచ్చే మనస్తత్వాలు, ఆచరణలు, పంచే మమతలు పేగుబంధాలకు పాశాలకు వర్తించవేమిటో మరి.నచ్చరెందుకో. గాలికెగిరిపోయే పటాలలాగా అగమ్యం అయోమయం అతుకులమయమైన బంధాలుఅన్నీ.
"సుడిగుండాల చక్రవలయంలో
మాయమైపోతున్న మనిషితనం"
జీవితం సప్తసాగరగీతం.వెలుగునీడల....అని అన్నట్టుగా బాధలు, బాధ్యతలు, ఆనందాలు, సుఖాలు, దుఃఖాలు లేనివారెవరు.సంద్రాన్నీదాలంటే నడకొస్తే చాలదు.ఈత రావాలి.ఎదీరయ్యే అలలనే కాదు సుడిగుండాలను నేర్పుతో తప్పుకోగలగాలి.అప్పుడే చావో రేవో తేలేది.నీకే అన్నీ బాధలన్నట్లు ఉద్వేగాలతో ఉద్రేకాలతో నిన్ను నీలోని మనిషితనాన్ని కోల్పోనక్కరలేదు.నిన్ను నువ్వు తెలుసుకుంటే నీకెదురయే ప్రతి పరీక్షలో విజేత నీవే.నీ అస్తిత్వం ఎప్పుడూ మార్చుకోకూడదు .మనిషిగా పుట్టిన ఏ మనిషి కారాదు కదా ఇంకో ఏ క్రూర జీవి.
"నా నీ ల నడుమ నడుస్తున్న
జీవితపు ఆటే ఇది"
అంతులేని కధలే అన్ని జీవితాలు.గెలుపోటములు నాణానికి బొమ్మాబొరుసులు లాంటివి.ఈరోజు నాది రేపు నీది.ఏదీ శాశ్వతం కాదు. ఏ రాకడైనా పోకడైనా నీకు నాకు ఒక్కటే.ఈ విచక్షణ తెలుసుకుంటే జీవిత పరమార్థం తెలుసుకున్నట్లే. అందరమూ ఆడితీరాల్సిన విధాత ఆట ఈ జీవితం. నీది నాది అనే తారతమ్యం కూడనిదే.మననుకునే బంధాలతో నడిచే జీవితం ఎంతో బాగుంటుంది. నీ నా భేధం అంటే అది ఓటమికై ఆడే ఆటే మరి.
"పెద్దరికపు పసితనాలన్నీ
ఘనమైన వృద్దాశ్రమాల లోపలే"
బాల్యం ఓ రంగుల కల వృద్ధాప్యం మరో బాల్యం.చేయి పట్టి నడిపించిన ఆ చేతులు వణుకుతూ ఓ చేయి ఆసరా కోసం చూస్తే విదిలించేసే రోజులివి.మనం పోసిన ,ప్రాణంగా పెంచిన పాశాలు అశనిపాతాలై అలుముకుంటున్న బంధాలు మనవి.రెక్కలొచ్చాక ఎగిరిన పక్షులకి ఎదిగిన గూడుతో ఎదగనిచ్చిన తల్లి తండ్రి మమతలతో పనిలేదన్నట్లు....మనిషి జీవనం హీనమైపోతుంది కన్నవారి యోగక్షేమాలపట్ల ఏమాత్రం బాధ్యత లేకుండా.పెద్దరికాలన్నీ పనికిరాని మకిలిపెట్టెలే.భోషాణాలని తెలిసేదెప్పటికో.ఆలంబనంతా ఆశ్రమాలకి పంపేటందుకేనేమో.వేలకువేలు పోసి ఉంచేటి ఖరీదైన ఒంటరితనపు గదులలోని సౌఖ్యాలు, మేమున్నామంటూ ఒరిగిన భుజంపై వేసే ఓ చల్లని ఆత్మీయ స్పర్శ లో, ఓ చేతి ముద్దలో, ఓ తీయటి పలకరింపులోనే ఉందని ఎప్పటికి తెలుస్తుందో మరి ఈ ఆధునిక కుసంతానానికి.
"అహానికి ఆధిపత్యానికి
తలొంచక తప్పని జీవనచిత్రాలే"
ఒరిగినా ఎదగగలిగే స్ధైర్యం కొందరిది.ఎదగగలిగినా ఒరిగిపోక తప్పని వ్యధ ఇంకొందరిది.నేను అన్న ఆధిపత్య భావన, నాకిందంతే అనే అజమాయిషీ తనం కొందరికి పుట్టుకతో వచ్చే గొప్ప గుచ్చే లక్షణాలైతే,విలువలెరిగిన విచక్షణ కలిగిన నైజం ఇంకొందరిది.అహంకారం పొరలు కమ్మితే కనుల ముందు ఏ బంధమైనా బొమ్మలాటే.ఆ కొందరికి.భారమైనా బాధ్యతెపుడూ తలనెత్తుకొనే భరోసానే ఇంకొందరికి.పరిస్థితులకు తలొగ్గుతూ ,బలహీనతలకు తానొగ్గక సమర్దించుకుంటూ సాగుతూ వెళ్ళాల్సిన జీవితం ఇది.ఎన్నో అనుభవాల రంగులను పూసుకున్న కాన్వాసు చిత్రం జీవితం.
"చిత్తరువులుగా చిరనవ్వులొలకబోస్తూ
యాంత్రికతకు అలవాటు పడుతున్న కాలమిది"
నిజానికి, నిజాయితీకీ ,బంధాలకు, అనుబంధాలకు విలువ దాదాపు పడిపోతున్న కలికాలమిది.బాధలెన్నో అందరి జీవితాలలోనూ.బాధ్యతెరిగిన వారికి బాధలన్నీ తప్పక భరించాల్సిన తీపి భారాలు.అందుకే చిరునవ్వు ల వెనుక దాగిన చాలామంది చింతలు ఎవరికీ తెలియవు.అసలలా చిరునవ్వు తో బాధలను ఎదుర్కోవటం సమాధానపరుచుకోవటం ఒక సాధన ఒక యోగమే.కాలంతో వెళ్ళే జీవనాలివి.అలవాటు పడక తప్పనివే ముఖానికి పులుముకునే కృత్రిమ నవ్వులు.
"గతానికి భవిష్యత్తుకి సమన్వయం చేయడానికి
చరిత్రకు ఏ మూల్యాంకం సరిపోతుందిప్పుడు?"
గతమో గాయం ఎందరికో.గాయం మానినా గురుతులలాగే ఉంటాయి. గతాన్ని నెమరువేసుకుంటూ గడపనూలేము ఆ గాయాలతోనే పోరాడనూలేమూ.రేపటికై గమనం పయనం తప్పనిసరి. గతకాలపు పాఠాలకు గుణపాఠాలను లాభనష్టాలను బేరీజు వేసుకుంటూ వెడితే రేపటిని ఎప్పటికీ చూడలేము ఎవ్వరమూ.ఎందుకంటే ఏ లెక్కలు కూడా నుదుటి రాతలకూ ఆ విధాత లెక్కలకు సరిపోవు కనుక.
చక్కటి కవిత మంజూమేడం. ఇది నా మనసు స్పందన అంతే.అభినందనలండీ మీ అలతి పదాల అనంతభావాలల్లికకు.
_మీ విజయ.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి