రాము కోలా గారికి, ప్రతిధ్వని పత్రిక వారికి మనఃపూర్వక ధన్యవాదాలు..
19, నవంబర్ 2022, శనివారం
8, నవంబర్ 2022, మంగళవారం
ఏక్ తారలు..!!
1. బాధ్యతలెరుగని బంధాలే అన్నీ_పేరేదైతేనేం..!!
1. మనిషెప్పుడూ నిత్య సంచారే_కాలంతో పరుగిడుతూ..!!
3. మాటేం చేయగలదు_మనసుని చుట్టేయడం తప్ప..!!
4. మనసు తెలిసింది_కనుచూపు చేవ్రాలులో..!!
5. బంధం బలపడిందట_నమ్మిన మనసుకు దాసోహమంటూ..!!
6. మథనం మనసుది_అక్షరం ఊతమైందంతే..!!
7. మనసుకెంత మమకారమో_నువ్వు విదిల్చిన గురుతులను తడుముతూ..!!
8. తలపుల తక్కెడకు తూకమేయగలమా_మానని గాయాలనూ దాచే మదితో..!!
9. అనుభవాలే జీవితమయ్యాయి_కాలంతో జత కట్టాక..!!
10. ఆసరా అవసరమే ఎప్పటికైనా_అది కలమా కాలమా అన్నది విధిరాత..!!
11. కాలాన్ని కలంలోనికి వంపేసా_నాలోని నిన్ను కాదనదని..!!
12. కథలన్నీ కాలానికెరుకే_ముడి విప్పే మాటే కరువంటూ..!!
13. మనసంతా ఖాళీ_కొన్ని గురుతులంటూ వెళ్లిపోయాక..!!
14. నన్ను నేను కోల్పోయా_బాధ్యతల్లేని బంధాలకు చిక్కుకుని..!!
15. ఓటమే గెలుపు_మనదనుకున్న అనుబంధాల నడుమ..!!
16. ముక్తాయింపు అవసరమైంది_మనసును సముదాయించడానికి..!!
17. జీవితాన్ని ఆస్వాదిస్తున్నా_శూన్యాన్ని నింపేయాలని..!!
18. దారులెన్నున్నా గమ్యం ఒకటే_అది బ్రహ్మమయినా పరబ్రహ్మమయినా..!!
19. దగ్గరతనమెక్కడుంది_దూరమే దగ్గరౌతుంటేనూ..!!
20. పరుగాపిన జీవితాలకు తెలుసు_తప్పుటడుగుల మూల్యమెంతో..!!
21. మనసుకు తెలుసు_స్థిరత్వం విలువెంతో..!!
22. నిజ జీవిత కథనాలే అన్నీ_మది ఒంపిన అక్షర కవనాలుగా..!!
23. బాధ బంధువే_పంచుకునే బంధాన్ని పరిచయం చేస్తుంది..!!
24. అమ్మ స్పర్శే అనునిత్యం_ఆత్మీయతను పంచే అక్షరాల్లో..!!
25. ఆత్మాభిమానమెక్కువే నా మనసుకు_పడిన చోటే లేవాలనుకుంటూ..!!
26. తెలిసిన బంధమే_తెలియని జన్మల అనుబంధమై..!!
27. ఎన్ని అనుభవాలను దాచుకుందో మనసు_నిత్యం అక్షరాలతో సంభాషిస్తున్నా..!!
28. ప్రతి క్షణాన్ని పలకరిస్తున్నా_నీ చిరునామా తెలుపుతాయేమోనని..!!
29. ఒడుపు తెలిస్తేనే విజయం_గాలివాటం ఎటువైపు వీచినా..!!
30. మనోసంద్రం ఆకాశనేత్రమైంది_ఒంటరితనానికి ఊరటగా..!!
5, నవంబర్ 2022, శనివారం
జీవన మంజూష నవంబర్ 22
ఈ నెల నవమల్లెతీగలో నా వ్యాసాన్ని ప్రచురించిన సాహితీ యాజమాన్యానికి మనఃపూర్వక ధన్యవాదాలు.
నేస్తం,
కవి, కళాకారుడు అనేవాడు ఎక్కడినుండో ఊడిపడడు. వాడు సమాజంలో ఒక భాగమే. వాడికి సొంత అభిప్రాయాలు, ఇష్టాలు ఉంటాయి. వ్యక్తిగా మనకంటూ స్పందన లేనప్పుడు కవి కాదు కదా దేవుడు కూడా ఎవరినీ చైతన్య పరచలేడు. ఇది వాస్తవం.
సంఘాలకు, ఉద్యమాలకు నాయకులమని చెప్పుకుని బతికేటప్పుడు, ఆ నాయకత్వం అంటే ఏమిటో, ఏమి చేయాలో తెలియకుండానే నాయకులయ్యారా! మెుదటి అడుగు ఎప్పుడూ ఒంటరే అన్న సత్యం మరిస్తే ఎలా! దిశా నిర్దేశం చేయాల్సిన నాయకులు వ్యక్తిగత దూషణలు చేయడం సబబేనా! మీ సమస్యలకు మరెవరో స్పందించాలనే ముందు, కనీసం సమాజంలో మరే ఇతర సమస్యలకయినా మీ స్పందన తెలిపారా మీరెప్పుడయినా! ఒకరిని విమర్శించే ముందు మనమేంటన్నది చూసుకోవాలి.
అందరికి ఇదో ఊతపదమయిపోయింది. “ కవులు, కళాకారులు మాకు స్పందన తెలుపడం లేదు.” మీ దృష్టిలో కవి, కళాకారుడు మనిషి కాదా! వాడికంటూ స్వతంత్ర భావాలు ఉండకూడదా! సమాజంలో సమస్యలను మన కోణంలోనే వాడూ చూడాలనుకోవడం న్యాయమేనా! మన సమస్యకు ముందు మనం స్పందించాలి. మన సమస్యను నలుగురికి అర్థమయ్యేలా చేయడం, దానికి పరిష్కారం ఆలోచించడం మన పని. ఇతరులు మనతో వస్తారా రారా అన్నది తర్వాత విషయం. వ్యవస్థలో లోపాలన్నవి సహజం. వాటిని దాటుకుంటూ పోవడంలో విజ్ఞత చూపడం మనిషి నైజాన్నిబట్టి ఉంటుంది. మన చేతికున్న ఐదు వేళ్ళే ఒకేలా లేనప్పుడు అందరి అభిప్రాయాలు, ఇష్టాలు ఒకేలా ఎలా ఉంటాయి? సమాజమంటేనే భిన్న సంస్కృతుల సమ్మేళనం. వివిధ వృత్తులు, రకరకాల జీవన విధానాలు అన్నీ కలగలిపి ఉంటాయి. కవికయినా, మరెవరికయినా తన మనసు స్పందనే ముఖ్యం. తాను తీసుకునే వస్తువు అది సమాజంలో సమస్య కావచ్చు, మరొకటి కావచ్చు. ఏదైనా తన మనసుకు అనుగుణంగానే తన స్పందన తెలియబరుస్తాడు. కవయినా, కళాకారుడయినా ముందు ఈ సమాజంలో మనిషి. వాడిని మీకనుగుణంగా నడుచుకోవాలని అనుకోకండి. వాడికంటూ వాడి సొంత దారి ఉంటుంది. ఆ దారికి అడ్డు రాకండి. వాడి పని వాడిని చేసుకోనీయండి దయచేసి.
ముసిరిన మబ్బులు..!!
కాలం విసిరెళ్లిన క్షణాలు కొన్ని
ఆకాశం అంచులకు వ్రేలాడుతున్నాయి
జ్ఞాపకాల తేనెబొట్లు అరకొరగా రాలుతుంటే
పట్టి దోసిట్లో దాచుకోవాలన్న తాపత్రయం కొందరిది
బంధాల రాదారి ఇరుకుగా మారి
దారి తప్పిన అనుబంధాలు చెల్లాచెదురయ్యాయి
పేగుపాశాల పలకరింపులు సుదూరమైనా
ఆశల అమ్మదనం ఆర్తిగా జోల పాడుతూనేవుంది
తెంచుకోలేని ముడుల వల మన జీవితమైనా
చిక్కుల చుక్కల్లో చందమామను వెదుకుతూనే ఉంటామిలా..!!