నేస్తం,
ఏ క్షణం ఎవరిదో తెలియని జీవితాలివి. మనం తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసిపెట్టి వుంటుందని మన పెద్దలు చెప్పిన మాటని మనమీనాడు మర్చిపోయాం. మంచి జరిగితే మన ప్రతాపమేనని, చెడు జరిగితే మనమీద ఓర్వలేనితనమని అనుకుంటూ మనల్ని మనం మోసం చేసుకుంటూ, ఎదుటివారిని అయోమయంలో పడేసి మహ చక్కగా బతికేస్తున్నాం. నిజంగా మనమెలా బతుకుతున్నామన్నది మనకు తెలియదంటారా!
క్షణాల ఈ జీవితానికే ఇంత మిడిసిపాటు పడుతున్న మన అహంకారం చివరికి మనకిచ్చేదేమిటో మనకెవరికయినా తెలుసా! ఎవరమయినా చివరికి చేరే చివరి మజిలి అదేనని తెలిసి కూడా మనమెందుకో మన అహాన్ని వదులుకోలేక పోతున్నాం. వచనాలు, ప్రవచనాలు వినేవారుంటే బోలెడు వల్లించేస్తాం, కాని వాటిలో మనం పాటించేవి ఎన్నంటే? మన దగ్గర సమాధానముందా!
గొప్పోళ్ల చావు కూడా పెళ్లిలాంటిదన్న నిజాన్ని ఏనాడో చెప్పారు మన కవులు. ఇక ఇప్పటి విషయానికొస్తే రోగమయినా, రొష్టయినా పదిమందికి తెలియాలంటే అవి కూడా పేరు, ప్రతిష్టలున్న వారికే రావాలని అర్థమయ్యింది. మన గొప్ప మనం చెప్పుకోవడం కాదు. నలుగురూ చెప్పుకున్నప్పుడే దాని విలువ. ఒకరికి మంచి చేయకున్నా పర్వాలేదు, కాని ఏ ఒక్కరికి చెడు చేయకూడదన్న తలంపు వుంటే చాలు. మనం ఈ సమాజానికి మేలు చేసినట్లే.
మనమీ సృష్టిలోనికి రాకమునుపు నుండి మన పుట్టుకకు నాంది పడటం, వచ్చింది మెుదలు జరిగే పరిణామక్రమాలన్నింటికి మన కర్మ ఫలితాలే కారణం. మన ద్వారా జరిగే మంచి చెడులకు కారణాలు వెదుకుతూ, మన సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. ఏదైనా భగవదనుగ్రహమని మనం తెలుసుకున్న క్షణమే మన జన్మకు సార్థకత. మనం నిమిత్తమాత్రులమని భగవద్గీతలో శ్రీకృష్ణలవారు చెప్పింది అక్షరసత్యం. ఈ అక్షరసత్యం అనుభవమైనప్పుడే మనిషికి మనసుతో అనుసంధానం ఏర్పడుతుంది. సుఖదుఃఖాలను సమ దృష్టితో చూడగలుగుతారు. తాను సమాధాన పడటమే కాకుండా పదిమందిని సమాధాన పరచగలుగుతారు. లక్షణం బావుంటే లక్ష్యం చేరడం సుళువని అవగతమవుతుంది.
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
చాలా రోజులకు మంచి రచనని చదివాను 👌
ధన్యవాదాలండి
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి