26, ఫిబ్రవరి 2023, ఆదివారం

ఏక్ తారలు..!!

​1.  ఒంటరినన్న ఆలోచనే లేదు_నా ఏకాంతం నువ్వయ్యాక..!!

2.  కాలానికి కట్టు బానిసలమే అందరం_కర్మ ఫలితాలకు సాక్ష్యాలుగా..!!

3.  ఏ’కాంత’మది_సాగరంతో సహవాసం చేస్తూ..!!

4.  ప్రేమంటే ప్రేమే_ప్రేమించే ప్రేమకై ప్రేమతో😊..!!

5.  భావాలదేముంది మబ్బుల్లా ఆవరిస్తుంటాయి_ఏకాంతాన్ని ఒంటరిగా రమ్మంటే..!!

6.  జీవనతపమాచరించక తప్పదు_బంధాల బాధ్యత మనదనుకున్నాక..!!

7.  అలల అల్లరి తీరానికెరుకే_సంద్రం లోగుట్టును దాచేస్తూ..!!

8.  ఆదమరపున దొర్లిన పొరబాటది_నువ్వున్న క్షణాల్లో మిగిలిపోయి..!!

9.  అనుభవ సారాలే ఇవి_కాలాన్ని కలంలో ఒంపేస్తూ..!!

10.  కలబోతల వడపోతలివి_మనసు చెక్కుతున్న మౌనారక్షరాలుగా..!!

11.  శూన్యమెప్పుడూ నాకు చుట్టమే_నా ఏకాంతానికి రక్షణగా..!!

12.  మరిపిస్తుందనుకున్నా_మనసుని ఏమార్చలేదని తెలియక..!!

13.  ఏ (బంధమైతేనేం)రాళ్లయితేనేం_కలిసిమెలిసి కలివిడిగా ఉన్నప్పుడు..!!

14.  గళం విప్పిన కలం_కాలాన్ని ప్రశ్నిస్తూ..!!

15.  కాలానిది స్థితప్రజ్ఞత_క(కా)లాల కలల కనికట్టు ఏదైనా..!!

16.  రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు_రేపన్నది ఉందని మరిస్తే..!!

17.  అమ్మెప్పుడూ అసంపూర్ణ మహాకావ్యమే_ఎంత రాసినా ముగింపు లేక..!!

18.  మనసు కన్నీళ్లు కనబడవు_గుండె చప్పుడు వినబడినంతసేపూ..!!

19.  అప్పుడప్పుడూ కొన్ని పూరింతలు బావుంటాయి_ఖాళీలను సమాధానపరుస్తూ..!!

20.  నిశ్శబ్దంలోనే అన్నీనూ_శూన్యంలో చేరువైన చుట్టాలై..!!

21.  మూడు ముళ్లు వేయించుకున్నది ఆలి కాదు_వలలో వేసుకున్నదే పట్టపురాణట..!!

22.  ఆకళింపు చేసుకుంటున్నా అనుభవాలను_ఏ అడుగుల తడబాటుకు మూల్యమిదని..!!

23.  ఎన్నని లెక్కలేయనూ_చేజారిన క్షణాల విలువ తెలుపడానికి..!!

24.  మరణం మహా సున్నితమైనది_రెప్పపాటుకు తలొగ్గుతూ..!!

25.  ఆత్మకు అవకాశమేది?_మనిషిగా మనం మనలేనప్పుడు..!!

26.  కోల్పోయిన క్షణాల లెక్కలెన్నో_అనుబంధాల ఆత్మార్పణలో..!!

27.   ఎన్నెన్ని వాక్యాలు రాయాలో_అంతరంగాన్ని ఆలపించడానికి..!!

28.  తడబడుతోంది అక్షరం_మనిషి తప్పుటడుగులను ఆపలేక..!!

29.  అపనమ్మకం అక్కున జేరింది_ఇచ్చి పుచ్చుకున్న మాటలు మౌనమయ్యాక..!!

30.  భారాన్ని బట్వాడా చేసాను_మనసు నుండి అక్షరాలు అందుకుంటాయని..!!

15, ఫిబ్రవరి 2023, బుధవారం

తెలుసుకునేదెప్పుడో..!!

అవ్యక్తం..!!


వక్రీకరణల

వ్యక్తీకరణలే మన విజయమనుకుంటున్నాం


అభిజాత్యాలన్ని

మనని కాదని సరిపెట్టుకుంటే ఎలా?


భావానిదేముంది

మాటకారులమని మనమనుకుంటే చాలదు


వంకర భాషే

మన రాజభాషని విర్రవీగితే ఫలితమేంటో!


సంకర బుద్ధులతో

శునకానందం పొందుతుంటే భవితేమిటో!


కూల్చివేతల 

కుహనా రాజకీయాల్లో మనదే ముందంజ


పేర్ల మార్పుతోనే మన పనితీరు 

ప్రపంచ ఖ్యాతినొందుతోందని సంబరాలు చేసుకుందామా!


మన వృద్ధి ఏ దిశగా వెళుతోందో

మనకు తెలియకున్నా విశ్వ విదితమని తెలుసుకునేదెప్పుడో..!!

7, ఫిబ్రవరి 2023, మంగళవారం

త్రిపదలు..!!

రాయడానికి కాగితం కలం ఉంటే సరిపోవు

అక్షరాల్లో జీవం నింపే 

నీతో ముడిబడిన గతమో భవితో ఉండాలిగా..!!


2, ఫిబ్రవరి 2023, గురువారం

జీవన మంజూష పిబ్రవరి23

నేస్తం,

          బంధాలు మనకు తెలియకుండానే ఏర్పడిపోతాయి. బంధం అనుబంధంగా మారాలంటేనే పెట్టిపుట్టాలి. మనం మారాలన్నా, మనల్ని మనం మార్చుకోవాలన్నా అంత తొందరగా ఇష్టపడం. మార్పు మంచికైనా, చెడుకైనా కావచ్చు. అది అనుబంధం మీద మనకున్న మమకారాన్ని బట్టి వుంటుంది. దీనికి వయసుతో పని వుండదు. అర్థం చేసుకునే మనసుంటే చాలు. అప్పుడు బంధం అనుబంధంగా రూపాంతరం చెందడంలో తేడా మనకు స్పష్టంగా తెలుస్తుంది

            మనిషి మనుగడకు బంధాలు, అనుబంధాలు ప్రాణాధారమే, కాని ఇప్పటి పరిస్థితులలో డబ్బే అన్నింటికీ ముడి సరుకుగా మారిపోతోంది. మానవ సంబంధాలన్ని ఆర్థిక అనుబంధాలుగా మారిపోయాయనడం సబబే. మనిషి, మాటా, నడవడి వగైరా వగైరాలన్నీ మన అవసరాలకు అనువుగా మార్చేసుకుని ఆధునిక అనుబంధాలను మన తరువాతి తరాలకు ఆర్థిక అనుబంధాలుగా అప్పజెబుతున్నామనడంలో నిజమెంతో మన అందరికి తెలుసు.

              ఒకప్పటి సంతోషాలు, సంబరాలు ఇప్పుడు అంతర్జాల అనుబంధాలకు మారిపోయాయి. మంచైనా, చెడైనా వాట్సప్, వీడియో కాల్ ద్వారానే పిలుపులు , పలకరింతలుగా మారిపోయాయి. విజ్ఞానం మనిషిని అందలాలు ఎక్కించడం ఏమోకాని, విపరీత పరిణామాలకు దారి తీస్తోందిప్పుడు. మాటా మంచి అన్ని వాట్సప్, సెల్ ఫోన్లు లేదా ఇతర మాధ్యమాల ద్వారానే.జరుగుతున్నాయి. ముఖతః అన్నది అగమ్యగోచరమే అయిపోతుంది రానురానూ.

                మారుతున్న కాలంతో మనమూ మారక తప్పదని సరిపెట్టుకుంటూ బతికేయడమే అవుతోందిప్పుడు. మనుష్యుల మధ్యన అనుబంధమయినా ధన సంబంధమే అని ఒప్పుకోక తప్పని పరిస్థితి. మారుతున్న మానవ మేథస్సు రకంగా తరువాతి తరాల తలరాతలను మార్చుతుందన్నది ప్రశ్నార్థకమే. అనుబంధాలను వదిలించుకుంటూ కాదు కాదు విదిలించుకుంటూ అంతరిక్షానికి పయనించడమే మన పురోగతి అనుకుంటే..నిజమే! మనమూ పురోగతిలోనే పయనిస్తున్నామని సంతోషించేద్దాం..!!



సత్యం..!!

అనిశ్చితి నుండి

నిశ్చలస్థితికి పయనం


గాలివాటంగా సాగే

జీవితపు గాలిపటం


నాతో నాకు

సహవాసం అనునిత్యం


ఖాళీలను పూరించాలంటే

అవగాహన అవసరం


మూల్యం చెల్లించాలంటే

బతుకో బంధమో తెలుసుకోవడం ముఖ్యం


ఏతావాతా ఎటుపోవాలన్నా

ఏదోవొక దారి ఎంచుకోక తప్పదన్నది సత్యం..!!

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner