13, డిసెంబర్ 2023, బుధవారం

కాటికి పోయే వయసులో కూడా..!!



నేస్తం, 

         మనుషుల మనస్తత్వాలు రకరకాలు. నేను రోజు మా కుక్కపిల్లని పొద్దున, సాయంత్రం పటమట లంకలో రెండు, మూడు రోడ్లు తిప్పుతుంటాను. సాయంత్రం పూట కింద పెట్టిన ఫోటోలోని రోడ్డు వైపు తీసుకెళ్తాను. ఆ ఇంటికి ఇవతల కరంట్ పోల్ వరకు తీసుకెళుతుంటాను. ఇంతకు ముందు కూడా చాలాసార్లు అక్కడ ఓ అవ్వ ఆమె ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకునేది. కుక్కల్ని రోడ్ల మీద తిప్పకూడదట. ఇంట్లోనే ఉంచుకోవాలట. రేపో మాపో పోయే ఈవిడకేమో పుల్లలు,  పుడకలు ఇలా అన్నీ రోడ్ల మీద పేర్చుకుని ఆక్రమించుకోవడం మంచి పనే. ఆమె బాబు వేసాడు కదా రోడ్డు.

          ఈరోజు సాయంకాలం మా రాజాలుని అటు తీసుకువెళ్ళా. కనీసం ఆ ఇంటి దరిదాపులకు కూడా తీసుకుపోలేదు. గబగబా వచ్చి తిట్ల దండకం మెుదలెట్టింది. ఏదో కుక్క ఆ పుల్లల మీద కరాబు చేసిందట. తెల్లవారు ఝామునే తీసుకువస్తారు లంజాకొడుకులు, వాళ్ళ ఇళ్ళలో కూర్చోబెట్టుకోవచ్చు కదా, అదీ ఇదీ అని ఆమె ఇష్టం వచ్చినట్టు వాగింది. నేను వింటూ మా రాజాలుని తీసుకుని వచ్చేసాను. అప్పుడు ఫోన్ తీసుకు వెళ్ళలేదు. మళ్లీ ఫోన్ తీసుకువెళ్ళాను ఆ మహాతల్లిని అందరికి చూపిద్దామని. ఆవిడ లేదు. పాపం ఆ ముసలాయన రోజూ కూర్చునే ఉంటారు కాని ఏమీ అనరు. ఎవరి కుక్కో అలా చేసిందని అన్ని తిట్లు తిట్టింది, కాని వీధి కుక్కలు బోలెడు ఉంటాయి రోడ్ల మీద. మరి ఆవిడ తిట్టిన తిట్లన్నీ ఆవిడకే తగులుతాయి కదా. వయసులో చాలా పెద్దావిడ. ఆవిడ రోడ్డు వేయలేదు కదా. ఆవిడ ఆక్రమించుకుంటే తప్పులేదు కాని కుక్కలు వాడుకోకూడదట రోడ్డు. కాటికి కాళ్లు చాపుకున్న మనకే ఇంత కాపీనం వుంటే, నిజంగా పుట్టగతులుండవు ఇలాంటి వాళ్ళకి.



11, డిసెంబర్ 2023, సోమవారం

అంతర్వాహిని పుస్తక సమీక్ష..!!


 ఈ రోజుల్లో ఎవరికి వారు తాము బావుంటే చాలు అనుకుంటారు. అలాంటి మానసిక స్థితిని దాటి మన అనుకున్న అందరు బావుండాలన్న సత్ సంకల్పంతో ముఖపుస్తక సమూహాల్లో అత్యంత ప్రాచుర్యాన్ని పొందిన “ తెలుగు సాహితీవనం “ తెలుగు సమూహం ప్రతిష్ఠాత్మకంగా ముద్రించిన కథా సంకలనం “ అంతర్వాహిని “. ఈ సమూహపు నిర్వాహకురాలు శాంతికృష్ణ గారి నిర్విరామ కృషికి నిదర్శనం ఈ సంకలనంలోని కథలు.


ఈ “ అంతర్వాహిని “ కథా సంకలనంలో కథల సంక్షిప్త వివరణ. 

మన సమాజంలో ఆడపిల్ల అనే వివక్షను అందమైన అనుభూతిగా మార్చుకోవడం ఎలానో “ అదే కథ” లో  నవీన్ చంద్ర హోతా చాలా చక్కగా చెప్పారు. 

“ అమ్మ వీలునామా “ కథలో అసలైన వీలునామా మనం చదవవచ్చు. కొడుకులైనా కూతుర్లైనా తల్లితండ్రుల బాధ్యతను సరిగా నిర్వర్తించనప్పుడు, వారి ఆస్తులపై ఎటువంటి హక్కు ఉండదని తెలియజెప్పిన కథ. చాలా గొప్పగా రాసారు వారణాసి భానుమూర్తి. 

“ ఆపద్బాంధవులు” కథ చదివిన తర్వాత నాకు ముందుగా గుర్తు వచ్చింది మాదిరెడ్డి సులోచన గారి “ ఈ దేశం మాకేమిచ్చింది” నవల. ఈ సమాజంలో ప్రతి ఒక్కరు స్వలాభం చూసుకోకుండా, మనమేం చేయగలం మన వంతుగా ఈ సమాజానికి అని ఆలోచిస్తే ఎంత బావుంటుందో డాక్టర్ డి ఎన్ వి రామశర్మ చక్కని సందేశాత్మక కథను అందించారు.

“ ఇకమాతు‌ “ తెలంగాణ మాండలికంలో రాసిన కథ. పెంపుడు జంతువుల మీద ప్రేమను, వదలలేని ఆప్యాయతను అద్భుతంగా రాసారు. ఎవరిని నొప్పించకుండా తన బర్రెను కాపాడుకున్న కథానాయకుని చతురత చాలా బావుంది.

మనం వదిలించుకుందామని ఎంత ప్రయత్నిస్తున్నా మన చుట్టూ ఉన్న సమాజం వదలని సమస్య కులం, మతం, మూఢాచార సంప్రదాయాలు, సినిమా రాజకీయాల గురించి “ ఇచ్చింగ్ “ కథలో చాలా బాగా ప్రస్తావించారు.

కులమతాలు, వరకట్నాల పట్ల మన మూర్ఖత్వం, మన ఆచార, వ్యవహారాలే గొప్పవన్న అహం వలన కలిగిన పరిణామాల గురించి “ ఎవరికి తెలుసు “ కథలో చక్కగా వివరించారు.

కంటేనే కాదు, పెంచినా అమ్మ అమ్మే అంటూ అమ్మతనం గొప్పదనాన్ని అద్ఫుతంగా చెప్పిన కథ “ కల గనలేదు”.

ఎదిగే వయస్సున్న పిల్లలకు తల్లిదండ్రులు చెప్పే జాగ్రత్తలు, వాటి విలువను తెలిపే కథ “ కొత్తగా రెక్కలొచ్చెనా? “

“ కుండెడు నీరు “ కథ చాలామందికి అనుభవమే. మంచి కథ.

జాలి,దయ ఉండే కొందరి మానవత్వం గురించి ఈ “ గూడు విడిచిన గుండె “ కథ. పక్షుల గూడు పడగొట్టలేని మనసున్న మనిషి కథ.

పుట్టింటి ప్రేమానురాగాలకు ఏదీ కొలమానం కాదని చెప్పిన కథ “ గుండె చప్పుళ్ళ “.

తర్కానికి, (మూఢ)నమ్మకానికి మధ్యన ఓ చిన్న మనసు సంఘర్షణను చాలా బాగా చెప్పారు “ పత్రం..పుష్పం..” కథలో.

“ పెళ్లి కూతురు “ కథ కొన్ని వాస్తవ సంఘటనలకు అద్దం పడుతుంది.అందరు తప్పక చదవాల్సిన కథ.

అతుకుల బ్రతుకుల జీవితాల్లో పుట్టినరోజు ప్రేమ కానుక ఎంత ప్రేమను, సంతోషాన్ని పంచుతుందో “ ప్రేమ కానుక “ కథలో మనం చదవవచ్చు.

మధ్య తరగతి జీవితాల్లో సాధారణ బహుమతి అనుకున్నది, ప్రపంచంలోనే అత్యంత విలువైనదిగా ఎలా మారిందో “ బామ్మ బహుమతి “ గురించి మనుమరాలు చెప్పిన కథ.

“ మట్టిబంధం “ ఎంత గట్టిదో తెలియజెప్పిన మనసు బంధం. ఈ కాలంలో మన బాధ్యతలను గుర్తు చేసిన కత.

“ మనుషులు -మెషిన్లు “ కథ యంత్రాల యాంత్రికతను, మనిషి మనుగడను గురించి వివరిస్తూ సహజత్వానికి, కృత్రిమత్వానికి తేడాను తెలుపుతూ, లాభనష్టాల తూకాన్ని తేల్చి చెప్పింది.

కొందరు ఇంటిలో పెద్దవారిని చులకన చేయడం, పిల్లలను గారాబంతో చెడగొడుతున్నారు అన్న అపోహలకు సమాధానమే ఈ “ మబ్బులు వీడిన ఆకాశం “ కథ.

కడుపున కనక పోయినా పెంచిన అమ్మ బుుణం తీర్చుకున్న ఓ కూతురి కథ “ మమతల పాల కడలి “.

చక్కని అనుబంధాల, ఆప్యాయతల సరదా కథ “ లేడిపిల్లలా..”.

అనాగరికులను నాగరికులుగా మార్చితే, మనిషిలోని మృగతత్వాన్ని కూడా ఒంటబట్టించుకున్న రాజకీయానికి ఏ జాతైనా ఒకటేనని తెలియజెప్పిన కథ “ వేట “.

సరదాగా చెప్పినా సర్ ప్రైజులతో, తలమునకలయ్యే పనులతో  సతమతమైన ఓ మనసు కథ “ వేళ కాని వేళ..త్వరపడి..” 

తమ తమ విధి నిర్వహణల నుండి విశ్రాంతి తీసుకున్న వారికి, వారి కుటుంబ సభ్యులకు ఎదురైన సమస్యల నుండి బయటపడే మార్గం చూపిన కథ “ వ్యాపకం “.

దిగువ మధ్యతరగతి బతుకుల్లో అప్పుడప్పుడు వచ్చే అల్ప సంతోషాలు కొబ్బరి పచ్చడి, సైన్సు రికార్డు బొమ్మలు చేతులు మారడాలు, ఇచ్చిపుచ్చుకోవడాలు పిల్లల మధ్యన. ఇలాంటి సంఘటనలను “ సైన్సు రికార్డు అనే చక్కని కథగా మలచడం చాలా బావుంది.

తొందరపాటు నిర్ణయాలు జీవితాన్ని ఎలా మార్చేస్తాయో అని చెప్పడానికి, చిన్న చిన్న కారణాలకు సర్దుకుపోవడంలో ఆనందాన్ని, భార్యాభర్తల మధ్యన అవగాహనను తెలిపే కథ స్టేట్మెంట్.


       “ అంతర్వాహిని “ కథా సంకలనంలోకి ప్రతి కథా మనలో ఎవరో ఒకరికి అనుభవమే. పేరున్న రచయితలు అని కాకుండా ప్రతి ఒక్కరు ఈ కథా సంకలనంలో తమ భాగస్వామ్యాన్ని పంచడం ముదావహం. ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు. ఇందరిని ఒక చోట చేర్చి, వారి భావాలను అందంగా పేర్చిన శాంతికృష్ణ గారికి హృదయపూర్వక అభినందనలు.

5, డిసెంబర్ 2023, మంగళవారం

జీవన మంజూష డిసెంబర్ 23


 నేస్తం,

         పంచుకోవడానికో, పెంచుకోవడానికో కాదు బంధాలు. నమ్మకమనే పునాది మీద బంధాలు ఏర్పడతాయి. అంతే కాని బంధాల మధ్యన కాలాన్ని లెక్కలేసుకోవు. మన మధ్యన వున్న బంధంలో అనుబంధం వుందా లేదా అని తరచి చూసుకోవాల్సిన పరిస్థితులు ఇప్పుడు ప్రతి చోటా కనిపిస్తున్నాయి. బంధమేదయినా డబ్బే ప్రధాన పాత్ర పోషిస్తోంది. బ్రతికుండగానే బంధాలను గాలికొదిలేసి, బాధ్యతలను విస్మరించి, మెుక్కుబడిగా ముద్ద పడేస్తున్న నేటి అనుబంధాలు మనవి

         తల్లిదండ్రులయినా పిల్లలను ప్రేమగా, బాధ్యతగానే పెంచుతారు కాని భారమని అనుకోరు. మరి అలాంటప్పుడు అపర వయసులో పెద్దలను ఎంతమంది పిల్లలు ప్రేమగా, బాధ్యతగా చూస్తున్నారిప్పుడు? ఈరోజు మనం ఖర్చు పెట్టేస్తే రేపటి రోజున మన పిల్లలు నలుగురిలో తక్కువగా కనబడతారేమోనని తిని తినకా పిల్లలకు ఆస్తులు కూడబెడితే, ఆస్తుల కోసమే బాధ్యతలు మోస్తున్న బిడ్డలున్న సమాజం మనది. మధ్యతరగతి బతుకులు మధ్యస్థంగా మిగులుతాయని చరిత్ర చెబుతోందిప్పుడు.

           తప్పొప్పులు మానవ జీవితాల్లో సహజం. కాని మన తప్పులకు ఎదుటివారిని బాధ్యులుగా చేయడం సమంజసం కాదు కదా. మన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు వాటి పర్యవసానాలు కూడా మనమే భరించాలి. అది బాధయినా, సంతోషమయినా మననిర్ణయానికి ఫలితం మాత్రమే. పెంపకాలు, పరిస్థితులు అందరివి ఒకేలా వుండవు. వారి వారి స్థితిగతులను బట్టి, చుట్టూ వున్న మనుష్యులను బట్టి, ఆలోచనలను బట్టి మనిషి ప్రవర్తన వుంటుంది. అదే మనిషి జీవితాన్ని శాసిస్తుంది

             సమస్యలను వద్దనుకుంటే సరిపోదు. వాటిని అధిగమించడం నేర్చుకోవాలి. సమస్య లేని జీవితాలు బహు అరుదు. సమస్యలను తట్టుకుని, సానుకూల దృక్పధంతో ఆలోచించే వారికి జీవితంలో గెలుపు సాధ్యమౌతుంది. ప్రతిక్షణం నిరాశ, నిస్పృహలతో వుండేవారికి జీవితంలో ప్రతిక్షణం భయానకంగానే వుంటుంది. సమస్యకు ఎదురు నిలవడం మెుదలు పెడితే ఎంతటి సమస్యయినా పరిష్కారమౌతుంది. ఆస్తులను మాత్రమే పంచుకుంటున్న మనం అనుబంధాలను కూడా కాసింత అక్కునజేర్చుకునే రోజు ఎప్పుడు వస్తుందో..!!


Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner