వ్యక్తిగత స్వేచ్ఛ లేని సమాజంలో మనం బతుకుతున్నామిప్పుడు. మాట్లాడే స్వేచ్ఛ కాని, తప్పుని ప్రశ్నించే హక్కు కాని లేని వ్యవస్థగా మారిపోయిన సమాజమిది. అధి’కారం, అహం’కారం మాత్రమే రాజ్యమేలుతున్న చోట మనిషి మనుగడే కాదు, వ్యవస్థ కూడా సర్వ నాశనమౌతుందనడానికి సాక్ష్యం మన ముందే వున్నా ఒప్పుకోలేని తెలివిగల మేధావులున్న ప్రాంతం మనది.
నువ్వు మాట్లాడాలంటే నాకు నచ్చినట్టు మాట్లాడు. నువ్వు సోషల్ మీడియాలో ఏదైనా రాయాలంటే నాకు నచ్చినట్టు రాయి. నువ్వు సినిమా తీయాలన్నా, డాక్యుమెంటరీ తీయాలన్నా, రీల్ చేయాలన్నా ఏదైనా సరే నీకంటూ స్వతంత్రత లేదు. ఇక్కడ ప్రతిదీ నాకు నచ్చినట్టే జరగాలి. లేదంటే కేసులు, కుళ్ళబొడవడాలు, ట్రోల్ చేయబడాలి వగైరా వగైరా చాలా జరుగుతాయి. ఆడ, మగ అన్న విచక్షణ కాని ముసలి, ముతక,పసిపిల్లలు, బంధుత్వాలు, రక్త సంబంధాలు అన్న ఆలోచన కాని ఏదీ మన మానిఫెస్టోలో ఉండదు. ఇదే ప్రజాస్వామ్యం. నచ్చితే వుండు లేదంటే దొ..య్. ఇదే మన అధికారభాష.
13న ఆన్ లైన్ లో ట్రెండ్ సెట్ మాల్ విజయవాడ లో స్క్రీన్1 లో 10.40 కి “రాజధాని FILES” సినిమా టికెట్లు బుక్ చేసుకుని, ఈరోజు సినిమాకి వెళితే సగం సినిమా వేసి ఆపేసారు. కోర్టు ఆర్డర్ వచ్చింది ఆపేయమని అని ఇంటర్వెల్ లో చెప్పారు. మేము ముందు స్నాక్స్ ఆర్డర్ కోసం వచ్చారనుకున్నాం. మేం సగం సినిమా చూసాం కదా, పూర్తిగా చూడనిదే వెళ్ళము అన్నాం. ముందు ఎంఆర్వో వచ్చి ఆపేయమన్నారు అన్నారు, కోర్ట్ ఆర్డర్ చూపించమన్నాం. సదరు ఎంఆర్వో అని చెప్పి తీసుకు వచ్చినాయన పటమట విఆర్వో గారట. ఆర్డర్ చూపించండి వెళిపోతామన్నాం. వాట్సప్ మెసేజ్ చూపించారు. మాకు ఆర్డర్ కాపి ప్రింట్ పేపర్ చూపించండి అంటే వారు బయటికి వెళ్ళారు తేవడానికి. 12.10 సినిమా ఆపేసారు. వీరు 1.10 కి కష్టపడి ఏవో సంతకాలు చేసిన ఆర్డర్ తెచ్చారు. ఈమధ్యలో కొసమెరుపుగా ఓ పోలీసాయన కూడా వచ్చి వారేదో చెప్పి, మీరు కేస్ వేసుకోండి అని, అక్కడే కాపలాగా నిలబడ్డారు. థియేటర్ వారిని జరిగినది రాసి సంతకం చేసి ఇవ్వమంటే వారు ఇవ్వలేదు. మెుత్తానికి సగం సినిమానే చూసాం.
ఈ సంఘటన చాలామందికి పెద్దగా ఏం అనిపించక పోవచ్చు. నా ఈ సగం జీవితంలో ఇప్పటి వరకు ఇలా థియేటర్ లో సగం సినిమా చూసిన రోజు లేదు. ఇక్కడ సినిమా ఆపగలరు. ఇంకెక్కడా ఆపలేరు కదా. జరిగిన నిజాలు చూడకపోయినా అందరికి గుర్తే వున్నాయి. సినిమా ఆపినంత మాత్రాన జరిగేది ఆపలేరన్న నిజం ఇప్పటికయినా తెలుసుకోండి సదరు పెద్దలు.
నిజాలను తెరకెక్కించడానికే కాదు ధైర్యముండాల్సింది. దానిని చూడాటానికి కూడా అంతకన్నా ఎక్కువ ధైర్యం కావాలి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మన ఘనత నెరగనివారు లేరు. అన్నానంటే అన్నానంటారు కానండి ఈ సినిమా చూడనివారు…!
సగం సినిమా చూసినా చాలా చాలా సంతోషమనిపించింది.అదే క్షణంలో జరిగినవి, జరుగుతున్నవి గుర్తుకువచ్చి బాధ కూడా వేసింది. రైతు లేనిదే ప్రపంచానికి ఆకలి తీరదు. కాని ఆ రైతుకు, రైతు కష్టానికి విలువ లేదు. మనమే కాదు, మన భవిష్యత్ తరాలు కోల్పోయినదేమిటో, కోల్పోతున్నదేమిటో మన మూసుకుపోయిన కళ్ళు తెరిపించడానికి చేసిన ఓ గొప్ప ప్రయత్నమిది. మేం చూడలేక పోయినా చూడగలిగిన అవకాశమున్న ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా “రాజధాని FILES”.
2000 సంవత్సరంలో నాకు తెలిసిన రవిశంకర్ గారు ఆబ్జెక్ట్ వన్ సిఈవో. అప్పట్లో జావా నేర్చుకోవడానికి అమీర్పేటలో వెళుతుండేదాన్ని. అప్పుడే “తెలుగు వన్” కు శ్రీకారం చుట్టారు. నేను అమెరికా వెళ్ళినప్పుడు, తర్వాత ఈ “ తెలుగు వన్” తెలియని వారు అక్కడ లేరంటే అతిశయోక్తి కాదు. మెున్నీమధ్యన మారుమోగిన హైటెక్ సిటీ విజయఢంకాలో వీరి మాటలు కూడా విన్నాను. ఇప్పుడు వీరి ప్రెస్ మీట్ కూడా చూసాను. వాస్తవాలు చెప్పారు. భానుగారు కూడా బాగా చెప్పారన్నీ. స్క్రీన్ ప్లే ఎంత బావుందంటే సినిమా చూసి తీరాల్సిందే. హాట్సాఫ్ భానుగారు.
“రాజధాని FILES” సినిమా మెదటి నుండి అద్భుతంగా తీసారు. భూమి విలువ, రైతు విలువను చెప్పిన సినిమా. ఇంతకు ముందు రైతుల గురించి చాలామంది చాలా సినిమాలు తీసారు. కమర్షియల్ గా గెలిచి వుండవచ్చు. సమస్యను చెప్పడం చాలామంది చేస్తారు. ఈ సినిమాలో సమస్యకు చెప్పిన పరిష్కారం చూడలేక పోయాను మన హైలీ రెస్పెక్టెడ్ వారి వల్ల. ఏదేమైనా సదరు హైలీ రెస్పెక్టెడ్ వారికి మనమే కాదు ఈ సినిమా యూనిట్ మెుత్తం కూడా థాంక్స్ చెప్పాలి. ఓ మంచి సినిమాతో బోణి చేసిన రవిశంకర్ గారికి, ఇంత మంచి సినిమా కు సహకరించిన సినిమా యూనిట్ అందరికి హృదయపూర్వక అభినందనలు.