29, ఫిబ్రవరి 2024, గురువారం

కుటుంబం..!!

 


          వినడానికి పదం చాలా బావుంటుంది. కాని రోజుల్లో కుటుంబం అంటే మేము, మా పిల్లలు అన్నట్టుగా వున్నా, ఎవరి గదుల్లో వారు, ఎవరి పనుల్లో వారు మునిగి తేలుతున్నారు. భార్యాభర్తలు కూడా ఒకే గదిలో వున్నా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగానే ఆధునిక యుగంలో యంత్రాలకు అలవాటు పడి యాంత్రికంగానే మారిపోతున్నారు. మన ఇంటి గురించే మనం ఆలోచించ లేనప్పుడు ఇక సమాజం గురించి ఏం ఆలోచించగలం?

            మన అమ్మానాన్న మనల్ని పెంచకుండానే మనం రోజు స్థాయిలో ఉన్నామా! మనమీ స్థాయిలో ఉండటానికి మన తల్లిదండ్రులు ఎన్ని అవసరాలు మానుకున్నారో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో అని మనమో క్షణమయినా వారి గురించి ఆలోచించ గలుగుతున్నామా! మన ఉన్నతస్థాయికి వారు అడ్డంకి అని వారిని వీధులపాలు కొందరు, వృద్దాశ్రమాలకు కొందరు పంపేస్తుంటే, మరికొందరేమో బిడ్డల నిరాదరణ తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు

           మన తరం అటు అమ్మానాన్నలను చూడలేక, ఇటు పిల్లలకు దగ్గర కాలేక రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యారు. మా అమ్మాయి/అబ్బాయి అమెరికాలో ఉన్నారని గర్వంగా చెప్పుకోవడం తప్ప, బంధాలను, అనుబంధాలను మన చేతులారా మనమే దూరం చేసుకుంటున్నామని గ్రహించలేక పోతున్నాం. ఉమ్మడితనంలోని సంతోషాలను అనుభవించ లేక ఏకాకితనాలకు అలవాటు పడిపోయి ఇదే అద్భుత ప్రపంచమని భ్రమ పడుతున్నాం.

            మనం నేర్చుకున్న విలువలు మన తరువాతి తరాలకు పంచాలన్న ఆలోచన మనకు లేక పోవడం బాధాకరమే. అయినా మనమే మనిషితనాన్ని వదిలేసుకుంటున్నప్పుడు ఇక విలువలు, అనుబంధాలు, కుటుంబం అన్న పదాలు హాస్యాస్పదంగానే అనిపిస్తాయి. మనం మన పెద్దలకు ఇచ్చినదే రేపటి రోజున మన పిల్లలు మనకు ఇస్తారన్న విషయాన్ని గుర్తుంచుకుంటే కనీసం కొన్ని కుటుంబాలయినా నిలబడతాయి


             


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner