4, ఆగస్టు 2025, సోమవారం

జీవన మంజూష ఆగస్టు 25


 నేస్తం,

         ఎదుటివారిని చులకన చేయడం, కించపరచడమంత సులువైన పని కన్నా ప్రపంచంలో మరేది లేదని బాగా తెలుసు మనకి. నీతిసుధలు చెప్పడం మాత్రం మనకు బాగా ఇష్టం కూడానూ. “నేను, నాఅన్న మన అహంతో మరెవరు పోటి పడలేరు కూడానూ

         మన రాతలు ప్రపంచానికి అత్యంత విలువైనవి అని అనుకోవడం, అవి మాత్రమే సమాజానికి మేలుకొలుపులు, భగవద్గీత అన్నంతగా మనంఫీల్అవడంలో తప్పేం లేదు, కాకపోతే మనవి తప్ప మరెవరివి సమాజానికి, ప్రపంచానికి మార్గసూచికలు కావని అనుకోవడం మాత్రం సరికాదు

          ఎదుటివారిని అనేముందు మన రాతల్లో ఏముందో మనం తెలుసుకోవడం ముఖ్యం. చిన్న పదంలో ఎంత అర్థం, అంతరార్థం ఇమిడి వుంటుందో మనకూ తెలుసు కదా. అందరు శ్రీశ్రీలు, సిరివెన్నెలలు కాలేరు కదా. ఆరుద్రలు, ఆత్రేయలు కూడా వుంటారు. నాలుగు పదాలు చాలు నలుగురినీ ఆకర్షించడానికి. నలభై వాక్యాలు రాసినా వాటిలో అర్థం, పస లేనప్పుడు అవి దండగే

      అందరు పరిశ్రమలు చేసి సమాజానికి పనికివచ్చే రాతలు రాయలేరు కదా. వారి మానసికోల్లాసానికో, లేదా రాయాలన్న ఇష్టం, తపనతోనో రాస్తారు. సమాజాన్ని ఉద్ధరించాలన్న ఆలోచన కొందరికే వుంటుంది. కొందరిలో మనమున్నామా లేదా అన్నది తెలుసుకుని ఎదుటివారి రాతల గురించి మనమంటే బావుంటుంది. ప్రేమ, విరహం, వర్ణన వీటితోనే మనమేం ప్రపంచాన్ని ఉద్ధరించేయలేం కదా! మన అవార్డులు, రివార్డులు, రికార్డులతో సమాజానికి కాని ప్రపంచానికి కాని ఒరిగే ఉపయోగమేముంది

         మాట తూలడం, ఎదుటివారిని తక్కువ చేయడం మన సంస్కారం కాదు. ఎవరిలో గొప్పదనముందో గుర్తించే గొప్ప మనసు మనకుండాలి. అహం మనకుంటే ప్రపంచంలో కాకిగా మిగిలిపోయేది మనమే. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం మనకున్నట్లే అందరికి వుంటాయన్న సత్యాన్ని మరిస్తే ఎలా? దూరం, దగ్గర ఎవరికైనా ఒకటే కదా!

         అలంకారాలు, ఛందస్సులు, వ్యాకరణాలు వున్నవి మాత్రమే గొప్ప రాతలు కాదు. జనానికి చేరువయ్యే వాడుకభాష కూడా గొప్ప రాతే. “వాక్యం రసాత్మకం కావ్యంఅన్న గొప్ప మాట కన్నా మరో గీటురాయి భావాన్ని మోసే రాతకు లేదు. మనమెంత క్లిష్టమైన పదాలు రాసామని కాదు, ఎంతమందిని మన రాత కదిలించిందన్నది ముఖ్యం. మన గొప్పదనం ఎదుటివారి గొప్పతనాన్ని గుర్తించే క్రమంలో వుంటుందని ఎరిగితే అంతా మంచే కనబడుతుంది. మనమే గొప్ప అనుకుంటే..అవును మనమేగొప్ప”.




0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner