8, నవంబర్ 2025, శనివారం

జీవన మంజూష నవంబరు25


 నేస్తం,

         రోజు ఎలా వుంటుందో మనకు తెలియదు. అంతెందుకు క్షణాలను కూడా మనం లెక్క కట్టలేము. క్షణం ఇలా వుంది, మరుక్షణం ఎలా వుండబోతోందో తెలియని మన జీవితాలకు ప్రతిది ప్రశ్నార్థకమే! పరుగెత్తి పోతున్న కాలంలో కనుమరుగౌతున్న గతాలు, జ్ఞాపకాలు బోలెడు. గతమే లేని కొన్ని జీవితాలకు జ్ఞాపకాలు గురుతే లేవన్నది పచ్చి నిజం. ఇది డిజిటల్ యుగమని మనం కూడా డిజిటలైజ్ అయిపోతున్నామని సంబరపడదాం.

         కొన్ని పరిస్థితులు మనిషిలో మార్పుకు దోహదపడతాయి అనుకోవడం సహజమే, కాని మార్పు కూడా నటనే అయిపోతోందిప్పుడు. అవసరాలకు అనువుగా మనిషి ఊసరవెల్లిలా మారడం చాలా సాధారణమైన విషయంగా మారిపోయింది ఇప్పుడు. మనిషి మాటల్లో, చేతల్లో, నడవడిలో ఎక్కడ, ఎలా చూసినా సహజత్వం లోపించి కృత్రిమత్వమే సహజ లక్షణం అయిపోయింది. మనిషి మేధస్సు గగనాన్ని దాటేస్తోందని సంతోషపడాలేమో

            మనం చెప్పేదే అందరు వినాలి, మనకు చెప్పేంత స్థాయి మరొకరికి లేదు అని మనం అనుకోవడం మన అహంభావం. అందరు అన్ని విషయాల్లోనూ తెలివిగా వుండలేరు, అలాగని తెలివితక్కువ వారు కాదు. ప్రతివొక్కరిలో అంతర్లీనంగా ఏదోక ప్రతిభ దాగునే వుంటుంది. సమయాన్ని, పరిస్థితులను బట్టి అది వెలుగులోనికి వస్తుంది. పదవో, అధికారమో, పేరు, ప్రతిష్టలో ఇలా నలుగురికి తెలిసే సందర్భాలు వచ్చాయని మనమేదో మహా మేధావులమని మనమనుకుంటే సరిపోతుందా! కాలం కలిసొస్తే దరిద్రుడు కూడా కుబేరుడైపోడూ!

             జీవితంలో మనం చెప్పాల్సినవి కొన్నుంటే, మనం వినాల్సినవి కూడా కొన్నుంటాయి. బతకడానికి, జీవించడానికి చాలా తేడా వుంటుంది. మనకేంటి మన దగ్గర చాలా డబ్బుంది. మనం చాలా రిచ్(గొప్ప)గా బతికేస్తున్నామని చాలామంది సంబరపడిపోతారు. వీళ్ళలో కొందరు ఎంగిలిచేత్తో కాకిని కూడా విదిలించరు. పూట తిండి గడవడానికి కష్టంగా వున్నవారు, తమకున్నదాంట్లోనే తమ చుట్టూ వున్న ప్రాణికోటికి కూడా ఆకలి తీరుస్తారు. మీరే ఆలోచించండి వీరిద్దరిలో ఎవరు బాగా బతుకుతున్నట్టు?

              బంధం అనుబంధంగా మారడానికి, ఆత్మీయంగా అల్లుకుపోవడానికి మనమే కారణం. మన అవసరాలకు బంధాలను తారుమారు చేస్తూ, అనుబంధాలకు ఆత్మీయత తేనెలు పైపైన పూస్తూ ఎన్ని రోజులు మన నటనను కొనసాగించగలం చెప్పండి? అందరం రోజు అటూఇటూగా పోయేవాళ్ళమే కదా, కనీసం కాస్తయినా నిజాయితీగా మనతో మనమయినా వుండాలి కదా! దూరాన్ని దూరం చేయడం మానేసి, దూరాన్నే దగ్గరతనం అనుకుంటూ బతికేయడం మన సహజగుణమై పోయింది. మనం ఏదిస్తే అదే తిరిగి వస్తుందన్నన్యూటన్ మూడవ సూత్రాన్నిమరిస్తే ఎలా! రెండిళ్ళ మధ్య దూరం ఒకటే కదా! సరైన దారి ఎంచుకోవడంలోనే విజ్ఞత, వివేకం బయటపడతాయి. మనిషిగా పుట్టినందుకు కాస్తయినా మానవత్వంతో బతుకుదాం..!




            

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner