12, డిసెంబర్ 2017, మంగళవారం

త్రిపదలు...!!

1.  వలపులతో వల వేశా
ప్రేమైనా ప్రాణమైనా
నీతోనే నేనని...!!

2.    కల"వరమెా"
కలకలమెా
తెలియని భావమిది...!!

3.  ఒక్క క్షణం చాలదూ
నీ జ్ఞాపకాలలో
నేనున్నానని తెలియడానికి...!!

4.  పాద ముద్రలు
పద ముద్రితాలై
మదినిండా పరుచుకున్నాయి...!!

5.  అక్షరం వర్షిస్తోంది
పద భావాల బంధాలతో
మది ప్రవాహానికి రూపమిస్తూ....!!

6.  నైరాశ్యం వీడనంటోంది
నాతో నీవు లేవని
తెలిసిందేమెా మరి...!!

7.  మనోగతమెరుకని
గతం జ్ఞాపకమైందని
మనసుకి అవగతమైనందుకేమెా...!!

8.   నీ నిష్క్రమణం తెలిపింది
భావాల్లో జీవాన్ని నింపి
నీవెప్పుడూ నాతోనేనంటూ....!!

9.    నిత్యం స్మరిస్తూనే ఉన్నా
వసి వాడని
మన చెలిమిని...!!

10.    అలరిస్తోంది
అల్లరి చెలిమి
నిత్య నూతనంగా...!!

11.  మమత
వెదుకుతుంది
మనసున్న ఆత్మీయుల కోసం...!!

12.   అడగకుండానే
అన్నీ తానైన అమ్మ
తన కోసమంటూ ఏమి దాచుకోలేదు...!!

13.   మరణం
తెలిసినా తెలియనట్లుండే
జీవన గమ్యం...!!

14.   శిథిలాక్షరాన్నైనా
శిలాక్షరమై పోవాలని
చిరకాలముండి పోవాలని చిన్న కోరిక...!!

15.   అక్షరం ఆప్త మిత్రుడే
అలసిన మదికి
ఆలంబనగా....!!

16.  చక్కనైన అక్షరాలు
ముచ్చటగా భావాల్లో ఒదిగిపోతూ
మురిపెంగా నీ పేరే రాస్తూ... !!

17.   గురుతెరగని గుండెకు
మనసెరిగిన మౌనానికి
మనోజ్ఞమే జ్ఞాపకాల చేవ్రాలు...!!

18.   ఆత్మానందం మెుదలైంది
అనుభవసారంలో పండిన
జీవితపు చివరి అంకంలో....!!

19.   అలికిడిలో అలజడి
మది పలికిన నీ గురుతుల
గమకాల గాంధర్వ గానం...!!

20.   విధిని ధిక్కరించి
విధాతకు సవాలుగా
విధివంచిత విజయకేతనం... !!

21.   విషాదం వలసెళ్ళింది
నాలో నిండిన
నీ చెలిమి సవ్వడికి...!!

22.  ఏ కన్నుల్లో మెరవాలో
కలల విరుపు
మనసు తెలుపుతూ... !!

23.   మనసు రాల్చిన కన్నీళ్లని
అక్షరాలుగా అలంకరిస్తూ
అసూయాద్వేషాలకు అతీతంగా...!!

24.   తడీయారని స్వప్నాలన్నీ
గుండె గొంతుని వినిపిస్తున్న
వేదనల స్వరాలే...!!

25.   రెప్ప పడని
క్షణాలే అన్నీ
కలల దారులకడ్డుపడుతూ...!!

26.   మనసుని ఏమార్చి
దుఃఖాన్ని దారి మళ్ళించి
కన్నీళ్ళపై గెలుపు ఈ అక్షరాలదే...!!

27.  కన్నీరు కడలిగా
మారిన క్షణాలన్నీ
కలగా మిగిలిపోతే...!!

28.   కలలూ కావాలి
కలత పడిన
మదిని సముదాయించడానికి..!!

29.   వేకువపొద్దు వేళకు
కలల వరాలన్నీ
కనుల ఎదుట సాక్షాత్కారమే...!!

30.  అక్షరాలను అల్లేస్తూ
పదం పదానికీ కొత్తదనమే
భావాలతో నెయ్యాన్ని కోరుతూ...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner