26, డిసెంబర్ 2017, మంగళవారం

ద్విపదలు...!!

1.   చీకటిలోనూ వెలుతురే
మదినిండుగా నీ జ్ఞాపకాల తారకలతో...!!

2.  చీకటి విస్తరణ స్వల్పమే
లెక్కకందని వెలుగు చుక్కల్లో ....!!

3.  తొలగుతాయి ముసుగులు
నాటకాన్ని బట్టబయలుచేస్తూ....!!

4.   నీడనై నీతోనే ఉంటా
చీకటివెన్నెలతో స్నేహం మనదని....!!

5.  మానసానికెప్పుడూ పురిటినొప్పులే నిన్నారేపుల్ని తలచుకుంటూ ఈరోజులో బతికేస్తూ... !!

6.   శబ్దమూ సడి చేయకుంది
నీ మౌనానికి భయపడేమెా...!!

7.   చైతన్యానికి చిరునామా నువ్వు
మౌనం మనసు పారేసుకుందందుకే....!!

8.  మాటల కోసమే ఈ అగచాట్లన్నీ
మనసులో మౌనాన్ని వెలుపలికి తేవడానికి....!!

9.   నీతోనే నేనంటుంది
చెలిమి సంబంధమది....!!

10.  తారలు తళుకుమంటున్నాయి
ఙాబిల్లినొదిలి పోతున్న రాహుకేతువులను చూసి...!!

11.   మనసంతా మురిపాలే
నీ మౌనపు అలికిడి తాకిడికి...!!

12.   గెలుపుకు బాసట
అక్షరమిచ్చిన ధైర్యమే...!!

13.   ఏకాంతం ఏకపక్షమైంది
ఎద నిండా నీవున్నావని తెలిసేమెా....!!

14.   రాహిత్యం ఎక్కువైనందుకేమెా
సాహిత్యం చిక్కబడుతోంది....!!

15.   కలల కన్నీరు జాలువారింది
కాలాన్ని సవాలు చేస్తూ కలం రాస్తున్న అక్షరాల్లో....!!

16.   వెన్నెల వల వేసింది
చీకటి చుట్టానికి చిక్కనీయక...!!

17.  చీకటిలో వెన్నెల కురిపిస్తున్నా
వెతల కన్నీళ్ళకు సంబరాలందిస్తూ...!!

18.  విషాదానికి వీడ్కోలిచ్చేస్తూ
నిన్నటిని సాగనంపడమే....!!

19.  అంతరిక్షమూ అరిచేతికి అందింది
నీ సాన్నిహిత్యానికి దాసోహమై...!!

20.  జీవిత సజీవ చిత్రాలే అన్నీ
కాలం చేతిలో చిత్రవిచిత్ర రూపాల్లో....!!

21.   భారమూ బాంధవ్యమైంది
నీ ఆప్యాయత అక్షరాలుగా అల్లుకుపోతుంటే...!!

22.  పరిమళిస్తుంటే పారిజాతాలనుకున్నా
నీ స్నేహపు సుమగంధాలని తెలియక...!!

23.  తీర్చుతున్నా నీ అలుకని
చెలిమి చిరునవ్వుల సాక్షిగా

24.  మనసు మౌనిగా మారింది
అక్షరాలు మాటలు నేర్చాయని...!!

25.  నేనంటే చైతన్యమే
విషాదాన్ని సైతం సంతసంగా మార్చేస్తూ... !!

26.   తోడుగా వస్తున్న జ్ఞాపకాలు
గతాన్ని వాస్తవంలో చూపిస్తూ...!!

27.   అక్షరాలకూ ఆనందమైందట
నీలో నన్ను చూసిన క్షణాల్లో....!!

28.   కోరికలన్నీ క్షణికాలేనట
మన మనసులు అక్షరాలకు అంకితమైయ్యాక...!!

29.   అక్షరాలన్నీ రాతలకే పరిమితం
మనసు మూగదనాన్ని బయటేస్తూ...!!

30.   కొన్ని స్వగతాలింతే
మనసుని దాచేస్తూ....!!

1 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

sam చెప్పారు...

dear sir good telugu information and good telugu articles
Telugu Cinema News

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner