16, డిసెంబర్ 2017, శనివారం

ద్విపదలు..!!

1.   అంబరాన్నంటుతున్నాయి సంబరాలు
లెక్కబెట్టలేని చుక్కల్లో నువ్వు ఎక్కడో...!!

2.  మనసు ఇంకిపోయినా
మానసంలో జీవమున్నట్లుంది...!!

3.   వేకువ వంత పాడింది
చీకటి చుట్టానికి వీడ్కోలిమ్మంటూ...!!

4.  వెతలన్నీ వెలుపలికి రానంటున్నాయి
గుండె గూడు చిన్నబోతుందేమెానని..!!

5.   భావాలకూ గాయాలే
అక్షరశరాలు సంధిస్తుంటే...!!

6.  గుండె గుప్పెడే
మనసుకోటలో బందీగా...!!

7.  కదిలించిన నాదం నీవేగా
గాయమై మిగిలిన అక్షరగేయాలుగా....!!

8.   అసౌకర్యమే మిగిలింది
నీ మది గూడు ఇరుకై...!!

9.   ఆత్రమెక్కువలే మాయ బుద్దికి
చివరిపేజి త్వరగా చదివేయాలని..!!

10.   పరమపద సోపానమే అయ్యింది
విషపు కోరలకు చిక్కకుండా విజయానికి చేరువ కావడానికి...!!

11.  మెలకువలోనూ కలతలే
నీ వలకు చిక్కిన నేరానికి...!!

12.  భాషకు అందనిది
భావమైన బాధేనేమెా...!!

13.   అక్షరానికి అపజయమన్నదే లేదు
అవాంతరాలు ఎన్ని ఎదురైనా...!!

14.  పాట పల్లవి కుదిరాయి
స్వర సమ్మిళితమే ఆలస్యమింక...!!

15.   పదము కలపడమూ సంతోషమే
నువ్వు నేనైన క్షణాల్లో..!!

16.  పన్నాగాన్ని ప్రేమనకు
భ్రమలో ఉంచి బజారున  పడేస్తారు...!!

17.  ఆత్మీయంగా అల్లుకున్న అక్షరాలు
భావ చౌర్యపు కోరల్లో...!!

18.   మనసే కల్లోల సాగరం
ఆటుపోట్ల అలజడుల అంతరంగంలో...!!

19.   విజయం వరించిందిగా
శూన్యాన్ని వెలివేస్తూ...!!

20.  పట్టి తెచ్చాను గెలుపుని
జీవితానికి కొత్త అర్ధానిస్తూ...!!

21.  అపజయాలే గీటురాళ్ళు
విజయానికి కొలబద్దలై...!!

22.  అజాగ్రత్త పనికిరాదు
అనునయింపులు అవసరార్ధమేమెా...!!

23.   కొందరికి అంతర్జాలమే జీవితం
ఇతరుల మనసులు కుళ్ళబొడుస్తూ...!!

24.  అపశృతులని సవరించడమే
తీపిజ్ఞాపకాల స్వరాలకై...!!

25.   అహం అడ్డుగా నిలుస్తుంది
గమ్యాలను చేరే క్రమంలో...!!

26.  రేపటిని ఆహ్వానించు
ముగిసిన నిన్నల్ని జ్ఞాపకంగా మార్చి...!!

27.   మనసుకు సున్నితత్వమెక్కువ
ముళ్ళు పూలు ఒకేలా చూడడటంలో...!!

28.   దానవత్వానికి సమాధానం
దైవత్వమని తెలుసుకోవాలి...!!

29.    వేకువ కోసం వెదుకుతోంది
చీకటిపొద్దుల్లో చితికిన మనసు....!!

30.   వెలుగడుగు దూరమే
అడ్డంకులను అధిగమించాలంతే...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner