27, డిసెంబర్ 2017, బుధవారం

జీవన 'మంజూ'ష (5)..!!

నేస్తం,
       అహం అనేది ఎలా ఉంటుంది అని చెప్పడానికి మనచుట్టూ ఉన్న కొందరిని చూస్తుంటే అహానికి అర్ధం తేటతెల్లంగా తెలిసిపోతుంది. నేను అని అనడంలోనే అహం రూపం తెలిసిపోతుంది. ఆత్మాభిమానం మనలో ఉంటే అది ఎదుటివారిని చిన్నబుచ్చదు. అదే అహంకారమనుకోండి ఎదుటివారి లోపాలు ఎట్టి చూపడమే లక్ష్యంగా ఉంటుంది. మన గత అనుభవాలు, ఎదురు దెబ్బలు, కష్టాలు, కన్నీళ్లు ఏమి గుర్తుండవు. నిన్ను పొగిడేవాడెప్పుడూ నీకు మంచి మిత్రుడు కాలేడు, అలా అని తిట్టేవాళ్ళందరూ నీ శత్రువులూ కాదు. ఎప్పుడయినా మన క్షేమం కోసం ఆలోచించేవారు ఆత్మీయులుగా ఉండిపోతారు.
         డబ్బు అనేది అప్పుడు, ఇప్పుడు , ఎప్పుడూ మనలోని అహానికి కారణం అవుతోంది. మన చేతి నిండా డబ్బుంటే గతంలో మనకి సాయపడిన ఏ బంధము గుర్తుకే ఉండటం లేదు. ఒకప్పుడు నచ్చినవారు ఇప్పుడు నచ్చడం లేదు. మన అవసరానికి మంచి చెడు విచక్షణ మరిచిపోతున్నాం. పెద్దలు అన్నట్లు బంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే కాకుండా, వ్యాపార సంబంధాలుగా, నాటకీయంగా రూపాంతరాలు చెందుతున్నాయి. మన స్వార్ధం కోసం అమ్మానాన్న, సోదర సోదరీ, స్నేహం, భార్యాభర్తల, పిల్లల అనుబంధాలన్నీ అస్తవ్యస్తంగా మార్చేసి డబ్బే లోకంగా బతికేస్తున్న ఎందరిలోనో మనమూ ఒకరిగా మిగిలిపోతున్నాము.
        అవసరానికి డబ్బు ప్రతి ఒక్కరికి కావాలి కానీ ఆ డబ్బే అవసరంగా మార్చేసుకున్న నేటి మన జీవితాలు ఏమి కోల్పోతున్నాయో కూడా తెలుసుకోలేని దుస్థితిలో మనం కొట్టుకుపోతున్నాం. ఆత్మీయ పలకరింపులు కోల్పోతున్నాం, బంధాలను విచ్చిన్నం చేసుకుంటున్నాం, జీవితపు విలువలు నష్టపోతున్నాం, మానవత్వాన్ని మర్చిపోతున్నాం. ఇలా చెప్పుకుంటూ పొతే బోలెడు... చివరాఖరికి మనల్ని మనమే కోల్పోతున్నామని మనకు తెలియకుండానే మన జీవితం ముగిసిపోయేలా చేసుకుంటున్నాం. నీతులు ఒకరికి చెప్పకుండా ముందు మనం ఎంత వరకు పాటిస్తున్నామని బేరీజు వేసుకుంటే మన తరువాతి తరాలకు కొన్ని అయినా మానవతా విలువలు మిగిల్చిన వాళ్ళం అవుతాము. ఎదుటి మనిషి వెనుకనున్న డబ్బుకు విలువ ఇవ్వకుండా వ్యక్తిత్వానికి విలువ ఇవ్వడం మొదలైతే మన సమాజంలో ఓ మంచి మార్పుకు బీజం పడినట్లే....!!
ఇప్పటికి ఈ ముచ్చట్లకు సశేషం.

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner