15, డిసెంబర్ 2017, శుక్రవారం

తెలుగుభాషా వికాసం..!!

      భాష లేనిదే జాతిలేదు అన్నది ఎంత నిజమంటే ఈనాడు తెలుగుజాతి ప్రాంతీయత కోసం విడిపోయినా అందరు తెలుగువారే అన్నంత నిజం. లిపి లేకుండా భాష లేదు. మాండలికాలను మమేకం చేసుకున్న భాష మన తెలుగు భాష. తెలుగు సంస్కృతులను, సంప్రదాయాలను ప్రతిబింబించేది మన తెలుగు భాష. భాతరదేశంలో ఎక్కువగా మాట్లాడే ద్రవిడ భాష తెలుగు. త్రిలింగ అనే పదం నుండి పుట్టింది తెలుగు అని, తేనే వంటిది తెనుగు అని నానుడి. క్రీ.పూ. మొదటి శకంలో శాతవాహన రాజులు సృష్టించిన "గాధాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత్ పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి, తెలుగు భాష మాట్లాడేవారు, శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణ, గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారై ఉంటారని నిర్ణయించవచ్చు. తెలుగు అజంత భాష. అనగా దాదాపు ప్రతి పదము ఒక అచ్చుతో అంతము అవుతుంది. దీన్ని గమనించే 15వ శతాబ్దములో వెనీసుకు చెందిన వర్తకుడు నికొలో డా కాంటి భారతదేశం గుండా ప్రయాణిస్తూ, తెలుగు భాషలోని పదములు ఇటాలియన్ భాష వలె అజంతాలు (అచ్చు అంతమున కలిగి ) గా ఉండటం గమనించి తెలుగును ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్‌గా వ్యవహరించారు.

   అజ్ఞాత యుగం,.ఆది యుగం నుండి ఆధునిక యుగం వరకు మనిషి మనుగడలో పరిణామక్రమాలున్నట్లే భాషలోనూ మార్పులు చోటుకున్నాయి. ఎన్నో కష్టనష్టాలకోర్చి తెలుగుభాషకు ప్రాచీన హోదానైతే తీసుకురాగలిగారు కానీ తెలుగుభాష మనుగడకు ఏర్పడుతున్న ముప్పును తప్పించలేక పోతున్నారు. తెలుగుకు ప్రాచీన హోదా వచ్చిన సంతోషం లేకుండా అంతరించి పోతున్న తెలుగు అక్షరాలను కాపాడుకునే ప్రయత్నంలో తెలుగు భాషాభిమానులు వివిధ సాహితీ ప్రక్రియలను అందుబాటులోనికి తెస్తూ తాము చేసే పనికి ప్రభుత్వ సహకారం అందక పలు ఇబ్బందులకు గురౌతున్నారు. ప్రాచీన హోదాకు కేంద్రం నుండి వచ్చే నిధులన్నీ అక్రమంగా తరలించబడుతున్నాయి. దానిలో కాస్తయినా తెలుగుభాషను బ్రతికించడానికి ఉపయోగిస్తే బావుంటుంది. 
      తెలుగు భాష మీద మమకారం ఎంతగా ఉంటే  తెలుగుభాషా వికాసం అంతగా జరుగుతుంది. అమ్మ పాలు బిడ్డకు ఎంత అవసమో అమ్మభాష మీద కూడా మమకారం కూడా అంతే అవసరం. అక్షరాలూ, పదాలు, నుడికారాలు, పద పొందికలు, సొగసులు  చెప్పుకుంటూపొతే చాలా ఉంటాయి భాషలో.  అంతరించిపోతున్న తెలుగుభాషలోని అందాలను మన తరువాతి తరాలకు అందించాలంటే తెలుగుభాషను వినేటట్లు చేయడం ముఖ్యం. మనకున్న ఎన్నో సాహితీ ప్రక్రియలు, నృత్య రీతులు అందుకు దోహదపడతాయి. రూపకాలు, పాటలు, వినసొంపైన  తేలిక పదాల పద్యాలు పిల్లలకు వినిపించి నేర్పించడం ద్వారా తెలుగుభాషపై ఇష్టాన్ని పెంపొందించవచ్చు.
     బిడ్డకు తల్లికి మధ్య భాష అవసరం లేకపోవచ్చు, స్పర్శ ద్వారా అనుభూతులను పంచుకుంటారు తల్లిబిడ్డలు. అమ్మపాడే జోలపాట ప్రతి బిడ్డకు అమృతతుల్యమే. పాటలో స్వరాలూ, సంగీతము బిడ్డకు అవసరం లేదు, అమ్మ గొంతు ఎలా ఉన్నా ఆ గొంతులోని మాధుర్యం బిడ్డకు అద్భుతంగా ఉంటుంది. అలానే మన తెలుగుభాషలో ఎన్ని  ప్రాంతీయతలున్నా అన్ని జనరంజకాలే.  జోలపాటలు, లాలిపాటలు, జనపదాలు, జానపదాలు, లొల్లాయి పాటలు, పల్లె పదాలు ఇలా అన్ని తెలుగు వెలుగులే.  ప్రాంతాలను బట్టి భాష యాస మారుతుంది కానీ అక్షరాలు ఒక్కటే. ప్రాంతాన్ని బట్టి ప్రతి యాసకు ఓ సొగసుంటుంది. మాండలికాలకు మకుటంగా మన తెలుగు భాష నిలిచింది.

తెలుగును సాధారణంగా ఒకపదముతో మరొకటి కలిసి చేరి పోయే భాషగా గుర్తిస్తారు. ఇందులో ఒక నామవాచకానికి దాని ఉపయోగాన్ని బట్టి ప్రత్యేకమైన అక్షరాలు చేర్చబడతాయి. వ్యాకరణపరంగా, తెలుగులో కర్త, కర్మ, క్రియ, ఒక పద్ధతి ప్రకారం, ఒకదాని తర్వాత మరొకటి వాక్యంలో వాడబడతాయి.

మాండలికాలు

తెలుగుకు నాలుగు ప్రధానమైన మాండలిక భాషలున్నాయి.
  1. సాగరాంధ్ర భాష : కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలలోని భాషను కోస్తా మాండలికం లేదా సాగరాంధ్ర మాండలికం అంటారు.
  2. రాయలసీమ భాష : చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల ప్రాంతపు భాషను రాయలసీమ మాండలికం అంటారు.
  3. తెలంగాణ భాష : తెలంగాణ ప్రాంతపు భాషను తెలంగాణ మాండలికం అంటారు.
  4. కళింగాంధ్ర భాష : విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల భాషను కళింగాంధ్ర మాండలికం అంటారు.
మన ప్రాంతాలలోనే కాకుండా తెలుగును ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా వాడుతున్నారు. భాషలన్నింటికీ మూలం దేవభాష సంస్కృతం. దీని నుండి పుట్టిన భాషలన్నీ పదాలను కలుపుకుంటాయి. అందుకే ఇతర భాషల్లోని పదాలు మన తెలుగు భాషలో చాలా వరకు చేరిపోయాయి.  సుసంపన్నమయినదిగా, సుమధురమైనదిగా తేనెలొలుకు తెలుగు భాష దేశభాషలందు తెలుగులెస్స అని అందరితో కీర్తించబడుతున్నది. 





   

 
        

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner