20, డిసెంబర్ 2017, బుధవారం

ఏక్ తారలు...!!

1.   హరించిన ప్రశాంతత ఎక్కడో మరి_పరిహాసమైన స్నేహ వలయంలో.. !!

2.  చెమరింతలన్నీ చేవ్రాలులయ్యాయి_అక్షరాలొంపిన భావాలతో.. !!

3.  ముంగిలి ముచ్చటగా ఉంది_గెలుపు ముగ్గు అలంకారంతో...!!

4.  ఒక రాగం వీనులవిందు చేసింది_అది నీ ఆత్మీయ సరాగమై...!!

5.  గుప్పెడుగుండె సంగతులివి_అంబరాన్నాక్రమించే అక్షరసుమాలతో...!!

6.  ధైర్యమూ అక్షరమే_అవాంతరాలను అధిగమింపజేస్తూ....!!

7.  సువిశాల ఆకాశం_హద్దుల పద్దులు లేని భావాలతో...!!

8.  గగననీతికో సవాల్_అవనిలోని ఇంతి...!!

9.  ఊసులన్నీ వినమంటున్నాయి_మనసు మౌనాన్ని....!!

10.  నిజమేనేమెా అనుకున్నా_నువ్వు తట్టి లేపే వరకు...!!

11.   మనసుకి మౌనం నేర్పిస్తున్నా_మాటలతో వేగలేక....!!

12.  అలంకరణ సాగుతూనే ఉంది_అక్షరాలకు అలుపన్నది లేకుండా...!!

13.   ఆలంబనగా నిలిచాయి అక్షరాలు_అమ్మలా అక్కున చేర్చుకుని...!!

14.    ఊహ వాస్తవమైంది_మౌనం వీడిన నీ స్నేహంతో...!!

15.   సహజ ప్రక్రియలే అన్నీ_సమానత్వాన్ని  సమూలంగా కోల్పోతూ.. !!

16.  శూన్యాన్నీ కొల్లగొట్టావుగా_నా మది ఖాళీలు పూరించడానికి.
.!!

17.   నేనే నీవుగా... చేరువ దూరము మనకేలా...!!

18.   జ్ఞాపకం తచ్చాడుతోంది_గతం వెంబడిస్తోంటే....!!

19.  రేపటిని ఆహ్వానించమంటోంది_గాయపు మరకలను మాయం చేస్తూ...!!

20.   మౌనమూ మరణసదృశమే_నీ మాటలు కరువైనప్పుడు...!!

21.  సన్నిహితానికి చలనమెందుకు_విశ్వాన్ని  ఒడిసిపట్టే నీ ప్రేముండగా ....!!

22.  ముల్లోకాలు ముంగిలి ముందే_ స్వచ్చమైన నీ ఆత్మీయతకు ఆభరణమై...!!

23.  ఇలకు అలుపట భ్రమణానికి_ఇంతి మెాము చంద్రబింబమైందని వగలుపోతూ....!!

24.  చీకటికి వెలుగుపూలే_అతివ నవ్వుల మెాము పూర్ణబింబమైనప్పుడు...!!

25.  ముంగిలి ముచ్చట పడుతోంది_ప్రేమ రంగవల్లుల పారవశ్యానికి...!!

26.  శూన్యమూ చుట్టమైంది_చెదిరిన మనసును సముదాయించలేక...!!

27.   పలకరింపుల పరిమళాలే...గాయాలకు లేపనాలౌతూ...!!

28.  అక్షరం పంచుకుంటానంటోంది_మది భారాన్ని తగ్గించుకోమంటూ..
!!

29.   నిన్నటి కథలో శేషాన్ని_రేపటి స్వప్నానికి ఊపిరిగా...!!

30.   నిశ్శబ్దమూ ఓ రాగమైంది_మౌనం నా నేస్తమైనందుకేమెా....!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner