1, మే 2018, మంగళవారం

ఏక్ తారలు...!!

1.  కలయికెప్పుడూ కరచాలనమే_మాటలు పంచుకునే మనసుల మధ్యన....!!

2.   కాలానికి కొరుకుడు పడనిదే_మనోధైర్యం మనదైనప్పుడు....!!

3.  ఓటమికి చెప్పిన వీడ్కోలే_ఆ నవ్వుల కాంతులు...!!

4.  దాయలేని స్నేహమే మనది_అక్షరాల్లో నెమలీకలను తలపుకు తెస్తూ..!!

5.   విరించి విదిల్చిన అక్షరాలే_మనల్ని చేరిన ఈ తలరాతలు....!!

6.   చెరగని రాతలే ఇవి_విధాత గీసిన బతుకు చిత్రాలు మనవని తెల్పుతూ...!!

7.  అక్షరాలకెంత ఆరాటమెా_కలంలో చేరి కాలంతో పరిగెట్టాలని....!!

8.   కాలానికి తప్పదు_ కలం విసిరిన కలలను కన్నీళ్ళను మెాయక...!!

9.  కలవరాలన్నీ కనుమాయమే_మౌనం మనసు విప్పాక...!!

10.   శబ్దమూ సద్దుచేయకుంది_మౌనాన్ని నీ మాటల్లో వినాలనేమెా...!!

11.   కలతలన్నీ కన్నీళ్ళుగా జారిపోయాయి_ఏకాంతంతో స్నేహమయ్యాక....!!

12.  కన్నీళ్ళు వాపోతున్నాయి_కాలానికి భారమౌతున్నామని...!!

13.  భారమయినా తప్పని బతుకులు_కాలం కక్ష కట్టినప్పుడు...!!

14.   కాలం విస్తుబోతోంది_కలం చేస్తున్న కనికట్టుకి...!!

15.   మరపు లేపనాన్ని అద్దింది కాలం_గాయపడిన హృదయానికి....!!

16.  కొన్ని జ్ఞాపకాలు దొరికాయిక్కడ_పారేసుకున్న గతానివేమెా..!!

17.  దొరికిన గవ్వల్లో అన్నీ భద్రమే_ఒంపేసిన సంద్రపు హోరులో....!! 

18.   అక్షర వేగానికి కాలం తోడయ్యింది_బంధాలు భావాలకు తోడౌతుంటే..!!

19.  భావాలు మూగబోయాయి_మహానటికి నీరాజనాలర్పిస్తూ..!!

20.   ఓ మహా యజ్ఞం ముగిసింది_మగవాడి అహం అన్న చరిత్రను పునరావృతం చేస్తూ...!!

21.  మనిషిగా నవ్వడమూ ఓ వరమే_మనసు చచ్చిపోయినా...!!

22.  అక్షరానికెప్పుడూ అతిశయమే_అర్ధవంతంగా భావాల్లో ఇమిడిపోతానని...!!

23.   మాయమైనా మరలిపోనిదేమెా_మనసైన జ్ఞాపకం...!!

24.   శతఘ్నిలా మారిన స్వాతి చినుకు_కపట నాటకాలకు చెరమగీతం పాడుతూ...!!

25.  కొన్ని  స్నేహాలంతే_మనసుని సేదదీరుస్తూ...!!

26.  కాలం దాచేసిన జ్ఞాపకం_మళ్ళీ తిరిగొచ్చింది నీతో కలిసి...!!

27.   విడిచిపోదామనుకున్నా_వీడని జ్ఞాపకమై నువ్వుండిపోతావని తెలియక...!!

28.  అక్షరాలని హత్తుకుంటున్నా_ఆర్తిగా ఆదరిస్తున్నాయని...!!

29.   రెప్పచాటు స్వప్నమే మరి_రాబందుల తాకిడికందకుండా....!!

30.  అక్కున చేర్చుకునేది అక్షరమే_అన్ని అనుభూతులకు ఆసరానిస్తూ...!!

1 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Unknown చెప్పారు...

మనసు సమ్మోహన భరితమైనది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner