ఎందుకో ఈమధ్యన పదే పదే నాకు "గురువింద గింజ" సామెత గుర్తుకు వస్తోంది. అది అనుబంధాల్లోనూ, సాహిత్యంలోనూ సమపాళ్ళుగా కనబడుతోంది. విశాలమైన ఈ సాహితీ ప్రపంచంలో నా రాతలు గొప్పని నేను అనుకుంటూ మరొకరికి అవార్డులు, రివార్డులు వచ్చాయని ఒప్పుకోలేక, అవి ఇవ్వడంలో లోపాలు జరిగాయని గగ్గోలు పెడుతూ, అస్సలు అవి రాతలే కాదు, వాటిలో ఏమి లేదు అంటూ ఎదుటివారిని చిన్నబుచ్చే మాటలు మాట్లాడటం బాగా ఎక్కువై పోయింది. అదే మన రాతలకి ఓ పురస్కారం వచ్చిందనుకోండి, మనంత గొప్పవాళ్ళు లేరని మిగిలిన ఏ ఒక్కరి రాతల్లోనూ అసలు ఏ విషయము, లక్షణమూ లేదని, ఇదిగో రాతలంటే నా రాతల్లా ఉండాలని, అసలు నా రాతలకు తిరుగే లేదని ప్రతిభకు పట్టం కట్టారని చెప్పుకుంటాం. చాలావరకు ఈ పురస్కారాలు అనేవి కొందరి చేతుల్లో ఉండిపోయాయి అన్నది ఎవరు కాదనలేని సత్యం. వారి భజనపరులకే పట్టం కడుతున్నారన్నది నిర్వివాదాంశం.
ఇక బంధాల విషయానికి వస్తే ఏ బంధమైనా కలకాలం నిలబడేది నమ్మకమైన ప్రేమాభిమానాల మధ్యన. ఈరోజుల్లో రక్త సంబంధాలు కూడా దూరమైపోతున్నాయి అంటే దానికి కారణం ఆ బంధాల మధ్యన గూడు కట్టుకున్న అహాలదే ముఖ్య పాత్ర. కనీసం కాకులకున్న నైతికత మనలో లోపించడమే కారణమేమో. నేను, నా ఇల్లు, నా అమ్మాబాబు అన్న చట్రంలో ఉండిపోతూ మరొకరి ఆపేక్షను ఆశించడం ఎంత వరకు సమంజసం? మనం మన అన్న నలుగురు కాదు కనీసం ఒక్కరి క్షేమ సమాచారాలు అడగము కాని మన కోసం నలుగురు రావాలి అనుకుంటే ఎలా సరిపోతుంది. మన అవసరాలకు వాడుకుని కనీసం వాళ్ళు కష్టంలో ఉంటే వెళ్లము సరికదా ఒక్క ఫోన్ చేసి ఎలా ఉన్నారని అడగడానికి నోరు రాదు కాదు కాదు తీరిక ఉండదు. నలుగురికి నీతులు వల్లిస్తాము, మన అంత భక్తిపరులు ఈ ప్రపంచంలోనే లేరనుకుంటూ వినేవాళ్ళుండాలి కానీ అబ్బో తెగ సూక్తులు ఆ పుస్తకాల్లోవి, ఈ భారతంలోవి అంటూ క్షణం ఖాళీ లేకుండా వినిపిస్తూనే ఉంటాం. ఒక్క మాట మనం ఎదుటివారిని అనడానికి మనకున్న అర్హత ఏమిటి అన్నది ఆలోచించుకుంటే మనకే తెలుస్తుంది మనమెంత నిజాయితీపరులం అన్నది. మనల్ని మనం సమర్ధించుకోవాలి కాస్తయినా నిజాయితీగా. మన మనస్సాక్షిని చంపేసుకుంటే రేపు మనం పోయినరోజు మనల్ని మోసే ఆ నలుగురు కూడా దొరకరు. బంధాలయినా, సాహిత్యపు పరిమళాలయినా కలకాలం నిలవాలంటే నైతిక విలువలనేవి మనం నేర్చుకోవాలి. అప్పుడే ఏదైనా కలకాలం నిలబడుతుంది.
ఈ ముచ్చట్లకు ఇప్పటికి సశేషం....
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి