25, మే 2018, శుక్రవారం

యద్దనపూడి సులోచనారాణికి అక్షరాంజలి....!!

                                    
    శతాబ్దాల తెలుగు సాహితీ చరిత్రలో రారాణి, నవలారాణి సులోచనారాణి అనడంలో అతిశయోక్తి లేదు. అక్షరాలతోనే అందరిని ఆకట్టుకున్న అద్భుత ప్రతిభాశాలి. కుటుంబ విలువలు, ఆప్యాయతలు, మధ్య తరగతి జీవితాలు, సమాజపు అంతరాలు, యువత కర్తవ్యం ఏమిటి, ఇలా మన చుట్టూనే ఉండే ఎన్నో జీవితాలను మన కళ్ళ ముందుకు తెచ్చి మనలో ఎన్నో ఆలోచనలను రేకెత్తించిన అక్షర బాంఢాగారం యద్దనపూడి సులోచనారాణి. 1939 ఏప్రియల్ రెండున కృష్ణా తీరాన కాజ గ్రామంలో పుట్టారు. మొదట్లో చిన్న కధలు రాసారు. తొలి నవల సెక్రెటరీతోనే ఓ కొత్త ఒరవడిని తెలుగు నవలా సాహిత్యంలో నెలకొల్పారు. 

     నా చిన్నప్పుడు ఏడేళ్ల వయసులో ఆంద్రజ్యోతిలో నే చదివిన మొదటి సీరియల్ రాధాకృష్ణ. అతి సాధారణ పల్లె జీవితాల నుంచి మొదలుపెట్టి ఓ కుటుంబంలో ప్రేమలు, ఆప్యాయతలు, అభిమానాలు, కోపాలు, ద్వేషాలు ఇలా అన్ని కోణాలను సమపాళ్లలో చూపించడం ఆమెకే చెల్లింది.  యుక్త వయసు అమ్మాయిల కలల రాకుమారుడు ఎలా ఉంటాడో, మధ్య తరగతి అమ్మాయి వ్యక్తిత్వం ఎలా ఉండాలో, బాధ్యతలను, బంధాలను ఎలా పంచుకోవాలో మనసులకు హత్తుకునే విధంగా చెప్పడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. నే చదివిన రాధాకృష్ణలో చిన్నప్పటి అల్లరి, ఆకతాయితనం, కల్మషం లేని పసితనపు చిలిపితనం  ఎలా ఉంటుందో రాధలోను, కృష్ణలోనూ మన చిన్నతనం కూడా ఇదేనేమో అన్నంతగా లీనమై పోతాం. చిన్ననాటి అనుబంధమే ఇరువురిలో ప్రేమగా రూపొంది మలుపులు తిరిగిన ఆ వలపు ఎలా ముగిసిందన్నది ఆ నవలను శోభన్ బాబు, జయప్రద జంటగా అదే పేరుతొ సినిమాగా తీయడం అది విజయాన్ని సొంతం చేసుకోవడంలోనే ఆమె నేర్పరితనం తెలుస్తుంది. అందరికి తెలిసిన ఆమె తొలి నవల సెక్రెటరీ సినిమాగా రూపొంది ఎంత టి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నది మనందరికీ తెలిసిందే. మరో నవల సినిమాగా మారిన అగ్నిపూలు ప్రేమ, పగ సమపాళ్లలో చూపిస్తూ ద్వేషాన్ని ప్రేమగా మార్చడం, అమెరికాలో పుట్టిన పిల్లల తీరుతెన్నులు అప్పటి రోజుల్లోనే మనకు సవివరంగా చూపించారు. నాకు బాగా నచ్చిన మరో నవల ఈ దేశం మాకేమిచ్చింది. దీనిలో మనకు సమాజం, దేశం ఏమిచ్చింది అని కాకుండా మనం ఈ దేశంలో పుట్టినందుకు మనం సమాజానికి కాని, దేశానికి కాని ఏమి చేశామని ప్రశ్నిచుకోమని చెప్పడంతో మనలో కర్తవ్యాన్ని మేల్కొల్పుతారు. ఆ రోజుల్లో ఒక నవల రెండు భాగాలుగా రావడం అనేది యద్దనపూడి గారి అక్షర విన్యాసం చేసిన మరో అద్భుతమని చెప్పాలి. సినిమాగా కూడా రూపొందించిన మీనా నవల రెండు భాగాలు మన అందరికి సుపరిచితమే. గిరిజా కళ్యాణం, జీవన తరంగాలు, ప్రేమలేఖలు, విచిత్రకుటుంబం, బంగారు కలలు, జై జవాన్, ఆత్మ గౌరవం వంటి సినిమాలుగా మారిన నవలలు ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయో మనందరికీ విదితమే. 
             ఋతురాగాలు టి వి సీరియల్ గురించి చెప్పనవసరం లేదు. రెండో భాగం కూడా రావడంతోనే ఆమె రచనా పఠిమ ఏమిటో మరోసారి తేటతెల్లం అవుతోంది. ఇప్పటికి తెలుగు నవలా లోకంలో ఆమె మకుటంలేని మహారాణి. ఆమె అక్షరాలు అజరామరం ఎప్పటికి. యద్దనపూడి నవలలు అన్ని చదవడం నాకు లభించిన అదృష్టమేమో. 
         21 మే 2018న అమెరికాలోని కాలిఫోర్నియాలో గుండెనొప్పితో మనందరికీ దూరమైనా, అక్షర రాణి యద్దనపూడి సులోచనారాణి మనందరికీ ఎప్పటికి కలలరాణిగా చిరంజీవే. ఆమె తెలుగు నవలలపై వేసిన ముద్ర చిరస్మరణీయమే. 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner