16, మే 2018, బుధవారం

వాకిలి తెరవని వాన సమీక్ష...!!

             నేను రాసిన సమీక్ష " వాకిలి తెరవని వాన " ను ప్రచురించిన గోదావరి యాజమాన్యానికి,  కత్తిమండ ప్రతాప్ గారికి నా మన:పూర్వక ధన్యవాదాలు...

            ప్రఖ్యాత కవి, విమర్శకులు కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి "వాకిలి తెరవని వాన" కవితా సంపుటికి ముందుగా హృదయపూర్వక అభినందనలు.
             వాకిలి తెరవని వాన కవితా సంపుటిలో మొదటి కవితే గుండెగూటిని కాపాడుకుంటూలో ఛిద్రమౌతున్న కుటుంబ అనుబంధాలను చూస్తూ తట్టుకోలేని గుండెకు ఓదార్పు లేపనాన్ని అద్దటంలో గెలుపుని ఆకాంక్షించడం బావుంది. ఏళ్ళ తరబడి ఎదురుచూస్తున్నా వాన బాలారిష్టాలు దాటి, కరి మబ్బుల్లో దూరి కనికరించకుండా కళ్ళలో కన్నీరై తిరుగాడుతూ కరువుకాటకాల కన్నీటిసీమలను కనికరించడం లేదని వాకిలి తెరవని వాన ఎప్పుడు కనికరిస్తుందోనని ఎదురుచూడటాన్ని ఎంత హృద్యంగా చెప్పారో. అందుకనేనేమో ఈ కవితా సంపుటికి వాకిలి తెరవని వాన అని పేరు పెట్టింది అనిపించింది. దాహాగ్ని శిఖల్లో, మాయ పొరల మాటున, శ్రమ చేతులైతే, సమస్యలు అరగదీస్తూ, రాతి కౌగిట్లో, ఊపిరాటలు ఆగిపోకముందే, అంతర్నేత్రం, సృజన సన్నిధి, విడ్డూరాలు, లోగుట్టు మొదలైన కవితల్లో తరిగిపోతున్న మానవతా విలువలను, అస్తవ్యస్తమౌతున్న సమాజపు  రీతిని, అక్రమాలను, అన్యాయాలను ఎండగట్టారు. పాటలో ఒక రాగం, ఒక తాళం, ఒక స్వరం, ఒక పల్లవి ఎలా పుడుతుందో సరికొత్తగా మనకు చెప్తారు. నీకు తెలీక పోవచ్చంటూ మనల్ని సందేహానికి గురి చేస్తారు. మలిగిపోతున్న మట్టి దివ్వెలులో రైతు మనసును చూపిస్తారు. జీవితం జోలపాట కాదంటూ శూన్యంలో మనిషి తన్ని తాను వెదుక్కోవడం కళ్ళకు కట్టినట్టుగా చెప్తారు. ఎలా మీరిలా ఉంటే ఎలా, ఇక ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకమే, నవ నాగరికమా ఎటు నీ పయనం వంటి కవితల్లో యువతను భవిత గురించి  ప్రశ్నించడం బావుంది. మౌనమే ఓ పెద్ద జ్ఞాని అంటూ అర్ధం చేసుకోవాలే గాని  మౌనంలోని భాషను, భావాన్ని తాత్వికతను చెప్తూ మౌన మహాకావ్యాన్ని ఆవిష్కరించడం భలే బావుంది .  అరువు బరువు కాకుండా, ఒక మానసాకాశం-రెండు పక్షులు, కొన్ని వాక్యాలే అంటూ వాక్యాల బలాన్ని, బలహీనతను చెప్పడం, లక్ష్యాలు అలక్ష్యాలైతే, కలాల సాములలో లక్ష్య  సాధన, కలం  గురించి, ఏరువాకకై ఎదురుచూస్తూ, ఊర్లు పేర్లు మాయమౌతున్నాయ్ కవితల్లో పల్లెలను మరచి కొత్తగా వస్తున్న మార్పులు, రెండు పూలు కవితలో కర్షకుడిని, కవిని సమాజానికి రెండు కళ్ళని చెప్పిన తీరు ఆకట్టుకుంది.  దేన్నీ మోయలేనివాడు ప్రజా ద్రోహి అని, ఓ సారి ఆలోచిద్దాంలో కవి కలం నుండి రూపు దాల్చిన అక్షరం ఎందరి స్వప్నాలను సాకారం చేసిందో ఆలోచించమనడం, సైద్ధాంతిక గట్లు తెగాక, ఉగ్రవాదం కవితల్లో అహంకారపు అధికారాన్ని, జాతి విద్వేషాలను చూపిస్తారు. నా నమ్మకం, పిట్టై వాలిన వాక్యం, ఆలోచనా వెలుగులు, అక్షర స్వప్నం, ఒక్కసారైనా, మృత్యు జపం కవితల్లో కవి ఆశలను, ఆలోచనలను, వృద్ధాప్యపు చేదు నిజాలను వెలికి తీయడం., వెండిపూల వాన, తాండవమాడాల్సిందే, కర్షక హర్షాన్ని కోరుతూ, మాయమైపోతున్న నేస్తం వంటి కవితల్లో ఊహలను, వాస్తవాలను, ఇకనైనా కవులు అంటూ ఆర్ధిక వివక్షను ఎండగట్టే కవిత్వం రాయాలని, ఇదా ఆధునిక న్యాయంలో పర్యావరణ పరిరక్షణ గురించి చెప్పడం బావుంది.
      జ్ఞాపకాలు ఎంత పదునైన పనిముట్లో జ్ఞాపకాలు కవితలో చాలా బాగా చెప్పారు. అతని స్వగతాల వెనుకలో ఓ మనసు మధనం కనిపిస్తుంది. చైతన్యానికి చూపుడువ్రేలతడు, నమ్మకండి, ఒక వాక్యం పుట్టాలంటే, కణికలు, ఏకాకితనం, నీవు నీవుగా, పంజరం, పాఠాలు, జీవన మాధుర్యం, ఒక సారాంశం, మరణానంతర జీవితం  వంటి 108 కవితలతో జీవితపు దిశా నిర్ధేశాలను, సమాజపు ఆటుపోట్ల అవకతవకలను, ఒక్క రైతు సమస్యలనే కాకుండా ఓ మనిషి మనసును, మౌనపు భాష్యాన్ని, ఆశలను, ఆశయాలను, కష్టాలను, కన్నీళ్లను, సంతోషాలను, ఊహాలోకాన్ని, వ్యధాభరిత జీవితాన్ని ఇలా అన్ని దృక్కోణాలను కొండ్రెడ్డి మనకు ఈ " వాకిలి తెరవని వాన"  కవితా సంపుటిలో చక్కని భావాలతో, చిక్కని కవితలుగా అందించారు. "వాకిలి తెరవని వాన" లో జీవితపు అన్ని కోణాలను ఆవిష్కరించిన కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డికి మరోమారు అభినందనలు. 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner