" నా అక్షరాలు" కవితల పంటలు పండించే అక్షరవిత్తులు ...!!
తెలుగు సాహిత్యంలో వైవిధ్యమైన రచనలు చేస్తూ విశ్వపుత్రిక హైకూలు, ఏకత్వ జ్ఞానం, ఆకాశంలో అర్ధభాగం, నా ఆత్మ కళలు, ధరిత్రి విలాపం అనే ఐదు పుస్తకాలు, విశ్వకవి రవీంద్రుని గీతాంజలిని అపూర్వగానంగా తెలుగు అనువాదం చేసిన డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్ (విశ్వపుత్రిక) రాసిన ఆరవ పుస్తకం "నా అక్షరాలు" కవితా సంపుటి సమీక్ష ఈ వారం గోదావరి సాహిత్యంలో మీ కోసం.
"నా అక్షరాలు" చూడగానే కాస్త తెలుగు సాహిత్యం తెలిసిన అందరికి ముందుగా గుర్తు వచ్చే పేరు బాలగంగాధర తిలక్ రాసిన "అమృతం కురిసిన రాత్రి"లోని నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అన్న మాటలు. ఈ కవితా సంపుటిలో విజయలక్ష్మి పండిట్ రాసిన మొదటి కవిత నా అక్షరాలు లో ప్రణవనాదం ఓంకారం నుండి ఉద్భవించిన నాద తరంగాలే నటరాజ కాలి అందియల మువ్వల సవ్వడులై, అనంత ఆనందలోకాల అంచులు తాకే కాలం పడవలంటూ మొదలుపెట్టి సూర్య కిరణాల స్పర్శతో వికసించే తామరలు, పున్నమి చంద్రికలు, సముద్రపు ఒడిలో ఓలలాడే అల్లరి పిల్లలు, ముత్యాల వాన చినుకుల అందాలు, సప్త వర్ణాల సీతాకోకచిలుకలు, ఆకాశంలో హాయిగా, స్వేచ్ఛగా ఎగిరే గువ్వల రెక్కల చప్పుళ్ళు, ప్రభాతాన మ్రోగే గుడి గంటల చప్పుడు, నాన్న దాచి ఇచ్చే ప్రేమ పలుకుల తాయిలాలు, అమ్మ చేతి గోరుముద్దలు, పసిబిడ్డల కేరింతలు అంటూ సమస్త ప్రకృతిలో మమేకమైన మనసాక్షరాలను అద్భుతంగా అందించారు. నా తనం కవితలో ఆమె ఎంచుకున్న కలం పేరు గురించిన వివరణ కవితాత్మకంగా చెప్పారు. నా పుస్తకాల అలమరాలో ఆమె దాచుకున్న పుస్తక నేస్తాలు తానేమిటో చెప్తాయి అంటూ పుస్తకాలతో తన చెలిమి చిరకాలఅనుబంధమని బాల్యం నుంచి దాచుకున్న నవరత్నాలని మురిపెంగా చెప్పడం చాలా బావుంది. ఆమె ఒక శాంతి సందేశంలో ఆమె ఒక శిఖరం అంటూ పడతి ఓరిమిని, ఔన్నత్యాన్ని చాటుతూ ఆమె లేని జగతి శూన్యమని మహిళ విలువను చెప్పడం బావుంది. అక్షర మానవుణ్ణిలో జీవితమే సాహిత్యం , అక్షరమయం, అన్ని సాహిత్యపు అనుబంధాలతో మమేకం, అందుకే నేను అక్షర మానవుణ్ణి అంటారు. భూమాతలో సమస్త జీవుల జీవ బీజ ప్రదాత, మూర్తీభవించిన అమ్మదనం మన భూమాత అంటూ గొప్పగా చెప్తారు. భావజలధిలో అంతర్నేత్రంలో తెలుగు అమ్మభాషగా నిలిచి తన భావాలకు ఊతమివ్వడం, కవితా నా కవితలో కవితా జననాన్ని, రేపటి ఇనుడులో సందె సూరీడు కబుర్లను మధురంగా వినిపిస్తూ చీకటి చెంతకు చేరడాన్ని, ఈ.. క్షణంలో కవిలో ఊపిరి పోసుకునే కవితాభావాలను అన్ని కాలాలకు అన్వయించడం, వికసించ వెరసే మొగ్గలో చితికిపోతున్న పసితనపు భయాన్ని, మృగ్యమౌతున్న మానవత్వాన్ని బాగా చెప్పారు. నీవు ఒంటరివి కాదులో ఒంటరితనానికి స్నేహం ఎవరో, ఆకాశం, భూమి అన్ని తోడేనని, అక్షర బలహీనతలో మంచి పుస్తకాలను చదవడం తన బలం, బలహీనత అని, నా పంచేంద్రియాలే నేనులో పంచేంద్రియాలే మనిషి, మనిషే పంచేద్రియాలని, జీవ బీజాలులో దశాబ్దం వెంటాడిన తన కలలకు అక్షర రూపం ఈ కవితని తన ఆలోచనలను పంచుకోవడం, ఆ మామిడిచెట్టు ఏడుస్తూందిలో జరుగుతున్నా అక్రమాలకు సాక్షిభూతమైన మామిడిచెట్టు మనసు రోదనను మనిషి మారణకాండకు మూగబోయి దేవునికి విన్నవించుకోవడం, రైతు ఆత్మనివేదనలో రైతు రోదనను, బరువు బాల్యంలో ఇప్పటి కార్పొరేట్ల చదువులను, అక్షరాలను పాతిపెట్టకు, అక్షర సముద్రం, నా భాషంటే కవితలలో మనిషి మనుగడకు బాట వేసిన అక్షరాలను పాతిపెట్టవద్దంటూ, అక్షర సేద్యం చేయమని చెప్తూ, తెలుగు భాష అమ్మ భాషని నొక్కి వక్కాణించారు. అరుణోదయం, ఆకుపచ్చని యవ్వనంలలో ప్రకృతి అందాలను, చైతన్యాన్ని చూపించారు. అనంత అద్భుత శక్తి ప్రేమని ప్రేమలేని క్షణం ఏదని ప్రశ్నించారు. నవ్వింది ఆకాశం, యుద్ద భూమి, మిథునం, ఇప్పటికిప్పుడు కవితై, అలిగాయి నా ఆలోచనలు, నిర్లక్ష్యం పడగ నీడల్లో, బాపు గీసిన చిత్రపటాలు, అమృత ఘడియలు, నేను సాక్షినై, సహజత్వం, ఆకు సంవేదన వంటి కవితల్లో ప్రతి చిన్న అనుభూతిని అక్షరాలతో బంధించి జీవిస్తావు అక్షరాలై అని అంతులేని కాలచక్ర కథనాన్ని వినిపిస్తూ, చరాస్తులు, మేము కూడా జవాబు దొరకని ప్రశ్నగా మిగలక కళాత్మక జీవితంలో నీ విజయలక్ష్మిని సొంతం చేసుకొమ్మని ఆ ఆ లు కార్చాయి కన్నీళ్ళ ఆనంద భాష్పాలు. అమ్మకానికి ఆడబిడ్డ అంటూ పసిబిడ్డల చీకటి బతుకుల వెలుగు కోణాలను, ఒక భావనలో భారతదేశపు గొప్పదనాన్ని అందంగా తనదైన శైలిలో అక్షరీకరించారు. సామాజిక అంశాలను, తన ఊహలకు ఆకృతులను, విభిన్న కవితా వస్తువులలో "నా అక్షరాలు" కవితా సంపుటి పరిపూర్ణతను అందుకుంది. చక్కని అక్షర భావాలను అందించిన విజయలక్ష్మి పండిట్ కు హృదయపూర్వక అభినందనలు.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి