28, మే 2013, మంగళవారం

ఈనాటి నవభారతం....!!

నీతి మాలిన రాజకీయాలు రాక్షసంగా రాజ్యమేలుతుంటే
రక్కసి కోరల్లో చిక్కిన న్యాయం బయటకు రాలేక
తల్లడిల్లి పోతుంటే....కళ్ళుండి గుడ్డిదైన లోకం

మాటలు మర్చిపోయి మూగనోము పడితే....!!

అబలల ఆర్తనాదాలు, అన్నార్తుల ఆకలి కేకలు
రోడ్డు పక్కన మురికి గుంటల్లో పసికందుల రోదనలు
అన్నదాత నీకోసమే అన్నీ అంటూ ఓట్లు దండుకుని
పండిన పంటకు తోడుగా ఋణ భారాన్ని
రైతన్నల పాలిట శాపంగా మార్చిన దళారీలు
ఆధునికత అంటూ అడ్డదారులు తొక్కుతున్న యువత
ఇదేనా ఈనాటి నవభారతం....!! మన జన భారతం ...!!
మతాల కుమ్ములాట...మమతానురాగాల అమ్మకాల చోటు
ధనానికి దాసోహమంటూ జీవితమే నటన....
ఇదీ మన భారతం....!! మన జీవితం....!!

26, మే 2013, ఆదివారం

మండుతున్న సూరీడు.....!!

సూరీడుకు కోపమొచ్చింది....!!
నిత్యావసరాలు తనకన్నా మండుతున్నాయని
తాగడానికి గుక్కెడు నీళ్ళు కరువవుతున్నాయని
కనిపించని కరంట్....బిల్లుల మంటతో పోలిస్తే
తననెక్కడ మర్చిపోతారోనని ఆవేశంలో
సూరీడయ్యకు పట్టరాని కోపమొచ్చి
మోమంతా ఎర్రబడి కోపమంతా 
తాపంలో చేర్చి....మండుతున్న 
మంటలకు తోడుగా చేర్చి....
యముని మహిషపు ఘంటల హోరుతో....
 హన్నా....!!
నాకన్నా పై పైకి వెళ్ళే వాళ్ళు లేరంటూ
తన ప్రతాపాన్ని జనాలపై చూపిస్తూ
యుగాలు మారినా...తరాలు మారినా
బలవంతుడిదే రాజ్యమంటూ
ఎప్పటికి మారని అంతరాల
తలరాత ఇదేనని....
పగలబడి నవ్వుతూ ఆకాశంలో
హాయిగా విహరిస్తున్నాడు చూసారా...!!

23, మే 2013, గురువారం

నీతోనే స...మస్తం....!!

చెలియలకట్టని చేరని స్నేహం
చెదరని గురుతుగా మిగిలితే....!!

చిందర వందరగా మిగిలిన
చీలికలలో ఎక్కడో దాగుంది....!!

సీకటిలో ఎలుగు సుక్క ఎక్కడో
కనుసూపు మేరలో చెమక్కుమంటే....!!
 నీ కన్నుల కాంతుల మెరుపేమో
నాకగుపిస్తోందని మోసపోతున్నానేమో....!!

ఎప్పటికప్పుడు మోసపోతూనే ఉన్నా
నీకోసమే అని ఆనందపడుతున్నా....!!
నే ఓడినా నీ గెలుపు కోసమేనని 
నీ గెలుపు నా గెలుపే అని...!!

గెలిచిన నీకు ఆ గెలుపే గుర్తుంది కాని....
దాని వెనుకనున్న మధనం....!!
నీకోసం ఓటమిని అలఓకగా అందుకున్న
నా మనసు కనిపించలేదు....!!

ఓటమినే చిరునామాగా
నీకోసం నే మార్చుకుంటే....!!
 గెలుపు అందలాలు సుళువుగా
నిను చేరాయని నువ్వనుకుంటున్నావు....!!

ఒక్కసారి తరచి చూడు
ఒక్కమారు నీ మనసుని అడిగి చూడు
నీకోసం ఎన్నిసార్లైనా మరణించి
మళ్ళి జీవించే నా మనసు
నీతోనే ఉందని చెప్తుందేమో....!!

22, మే 2013, బుధవారం

పుట్టినరోజు శుభాకాంక్షలు...!!


ఆప్యాయతను....అభిమానాన్ని.....కలబోసుకుని ప్రేమగా పలకరించే తమ్ముడు శివకు
ప్రేమపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు...
                                                            అక్క




21, మే 2013, మంగళవారం

తెలిసి తెలియని ఆ చెలిమి....!!

కనుల ఎదుట నీవుంటే
కవితలల్ల నాతరమా....!!
మనసు నిండా నీవుంటే
మరపు నా వశమా....!!
పదాల పల్లవే నీవైతే
పాటలెలా రాయను....!!
అష్టపదులు నీవెంట ఉంటే
ఇష్టపదులు నేనెక్కడతేను....!!
సుస్వరాల అలజడిలో
నీ స్వరమెలా గుర్తించను....!!
మరచిపోవాలని అనుకున్నా
నిన్ను మరచిపోగలనా...!!
తెలిసి తెలియని ఆ చెలిమి
జ్ఞాపకం ఎప్పటికి సరికొత్తదే....!!
నీకు గురుతు లేకపోయినా
నాకు జన్మంతా మధుర జ్ఞాపకమే....!!

17, మే 2013, శుక్రవారం

ఎక్కడో దాగున్నా....!!

నా అక్షరాల్లో ఒద్దికగా ఒదిగి పోయింది
అది నీతో ఉన్న నా జ్ఞాపకమే అనుకుంటా...!!
నా చుట్టూ పరుచుకున్న 
చిరుగుల అతుకులలో కనిపించకుండా
పోయిందేమో అనుకుంటే....!!
చిమ్మచీకటి  వెన్నెల చీర కట్టుకున్నట్టు
నన్ను చుట్టేసింది అదేనేమో....!!
చుక్కల వెలుగులో ఎక్కడో దూరంగా
ఓ చుక్క నావైపే వస్తున్నట్టు గా అనిపిస్తే...!!
రాలుతున్న ఆ నక్షత్రం నీ రాకను
కబురుగా నాకందించిందేమో....!!
అందుకేనేమో ఎక్కడో దాగున్నా 
నీ తలపు అంత బాగుంది ఇప్పటికీ....!!

16, మే 2013, గురువారం

మనసున్న మారాజులు....!!

బాధలో ఉన్నప్పుడు ఓ చిన్న ఓదార్పు
దిగులుగా గుబులుగా ఉన్నప్పుడు నాలుగు ధైర్య వచనాలు
మానసిక వేదనలో ఉన్నప్పుడు నీకు మేమున్నాము అన్న ఆసరా
ఇలా ప్రతి ఇబ్బందికి ఎవరికీ వారు "జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది" అని అనుకోకుండా సంతోషంలో ఉన్నప్పుడు పంచుకోవడానికి ఎవరూ లేకపోయినా....కష్టంలో ఉన్నప్పుడు నీకు నేనున్నాను అన్న ఆసరా ఎంతో మానసిక ధైర్యాన్ని, మనసుకి స్వాంతనని కలిగిస్తుంది. బాధ ఈ రోజు ఎక్కువగా ఉండొచ్చు...కాని రేపటి రోజున కాస్త కాస్త తగ్గుతూ పోతుంది....అంటే దాని తీవ్రత తగ్గుతు పోతుందని కాదు....పరుగెత్తి పోయే కాలం మరపు అనే మందుని కానుకగా మనకు ఇచ్చింది. దానితోపాటుగా ఎదుటి వారి కష్టానికి స్పందించే మనసులను కూడా అందించింది. అందుకే మన మనసులను నిద్ర పుచ్చకుండా కాస్త సహృదయంతో ఓ చిన్న మాటతోనో, వీలైతే వెళ్ళి ఓ ఆత్మీయ స్పర్శ తోనో తెలియపరిస్తే ఎంత పెద్ద కష్టమైనా చిన్నదిగా అనిపిస్తుంది. "అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకమని" ఓ కవి రాసిన పాటను నిజం చేయక మనసున్న మారాజులు అనిపించుకోండి. అంతే కాని ఆ...వాళ్ళకు కదా కష్టం వచ్చింది మనకు కాదుగా అని చూసి చూడనట్టు పోకండి.

14, మే 2013, మంగళవారం

ముక్కలైన హృదయం....!!

నీ ప్రేమ లేక ముక్కలైన హృదయం
మళ్ళి మళ్ళి తపిస్తోంది నీ కోసం....!!
లెక్కలేని ముక్కల చుక్కల్లో నీ రూపం
వెక్కిరిస్తూ ఏడిపిస్తుంటే....!!
ముక్కలైన హృదయాన్ని
ఊరడిస్తూ....దూరమైన నీ స్నేహం
మళ్ళి దారి తప్పి నా దగ్గర కొస్తుందేమోనని....!!
ముక్కలన్నీ ఏర్చి కూర్చి నీకోసమే
ఇప్పటికి ఎదురు చూస్తుందని ....
నీకోసమే తపిస్తోందని నీకెలా చెప్పేది....??

13, మే 2013, సోమవారం

ఇలా వచ్చి అలా వెళిపోతే....!!

రాకూడని....వేళ కాని వేళలో వచ్చావు
నువ్వు వస్తావని చెప్తున్నా....
నమ్మలేక ఎప్పుడో ఆలస్యంగా
వస్తావులే అనుకుంటే....!!

ఇంతలోనే.....
గబ గబా హోరు గాలితో వచ్చి
జల జలా ముత్యాల జల్లులు కురిపించి
గ్రీష్మ తాపాన్ని చల్లార్చి
మల్లెల మత్తులో ఉండగానే.....  
చల్లని పైరగాలి పిల్లతెమ్మెరలా
పలకరించి చటుక్కున మాయమయ్యావు.....!!

కాలం కాని కాలంలో
రాకూడని సమయంలో
అనుకోని అతిధిలా వచ్చి
ఆహ్లాదపు జల్లులు కురిపించి
అంతలోనే మాయమై పోతే...!!

నువ్వు వచ్చావనుకోవాలా....!!
వచ్చి వెళ్ళావనుకోవాలా....!!
ఇలా వచ్చి అలా వెళిపోతే....!!
ఎలా చెప్పు వర్ష తుషార నేస్తమా....!!

12, మే 2013, ఆదివారం

అమ్మ ప్రేమ....అమ్మ మనసు...!!


ఈ సృష్టిలో మారనిదేదైనా ఉంటే అదే అమ్మ ప్రేమ....అమ్మ మనసు...!!
ప్రతి ఒక్క అమ్మకు పాదాభివందనం....!!
అందరికి అమ్మలరోజు శుభాకాంక్షలు.... -;)

10, మే 2013, శుక్రవారం

తల్లడిల్లుతున్నఅమ్మ మనసు....!!

పేగు బంధం  పెనవేసుకుందంటే...!!
దాని చుట్టూ అందమైన
అల్లికలను పేర్చుకుంటే....!!
ఓర్వ లేని దైవం
పాశాన్ని పాశవికంగా లాగేసుకుంటే....!!
పెంచుకున్న మమతానుబందాలు
వెల వెల పోతుంటే....!!
తెగిపోయిన ఆ బంధం
అందనంత దూరంలో విల విలలాడుతూ
ఆ కన్నీటితో..... 
ఆకాశంలో చుక్కలా మెరుస్తుంటే....!!
అటు వెళ్ళ లేక ఇటు ఉండలేక
ఆ తల్లి మనసు పడే తపన
ఏ అక్షరాలకు దొరకనిది....!!
విధి ఆడే చదరంగంలో
వింత పావులం మనం....!!
ఏమి చేయలేని నిస్సహాయ జీవులం...!!

( నా చిన్నప్పటి నేస్తం పడుతున్న బాధను తీర్చలేను.... అనుకోకుండా నేను చూడకుండానే అనంత లోకాలకు తరలి వెళిపోయిన తన పాపకు ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ....తల్లడిల్లుతున్నఅమ్మ మనసు పాపకు అంకితం )


వరాల జల్లులు ఎడారి ఎండమావులు....!!

సంక్షేమ పదకాలంటూ జనాలను పిచ్చివాళ్ళను చేయడం మన నాయకులకు బాగా అలవాటు ఐపోయింది...ఎన్నిసార్లు మోసపోతున్నా గుడ్డిగా నమ్మడం మనకు మామూలై పోయింది. వృద్దులకు వృద్దాప్యపు పించనులని ఎర చూపి వారు వెళ్లి తెచ్చుకోలేని చోట డబ్బులు ఇస్తామని చెప్తే ఆశతో వెళ్ళలేక వెళ్లిన వాళ్ళకు అక్కడ కాదు ఇక్కడా అంటూ అటు ఇటు తిప్పుతూ వచ్చే రెండు వందలలో వంద ఇస్తావా అని బేరసారాలు...బస్సు సౌకర్యం లేని ఊరి వాళ్ళు ఆటోలకి  ఏభై అరవై ఇచ్చి వెళ్తే అందే ప్రభుత్వ సాయం ఇది. ఇక మిగిలేది ఎంత?
ఇక రేషన్ గురించి చెప్పనక్కర లేదు....పురుగుల బియ్యం, ఉడకని పప్పు, మట్టిలో ఉప్పు, కారమో ఏదో తెలియని చేదు పసుపు రంగు కారం....కనీసం నీరు పంటలకు లేకపోతె పోయే తాగడానికి నీటి కోసం ఎన్ని అవస్థలో....!! రైతులకు ఉచిత విద్యుత్ అంటూ అస్సలు కరంట్ అనేదే తెలియకుండా పోతోంది పల్లెలకు. ఇలా చెప్పుకుంటుపోతే చాలా ఉన్నాయి. మరి ఎవరి కోసమో ఈ పనికిరాని పధకాలు, అర్ధంలేని ఆపన్న హస్తాలు....!! వరాల జల్లులు ఎడారి ఎండమావులు....!! అని జనాలకు అర్ధం అయ్యేదేప్పుడో....!!

4, మే 2013, శనివారం

ఎన్నికలని బహిష్కరించండి......!!

అవును మీరు చూసింది నిజమే....!! సరిగానే చూశారు....ప్రస్తుతం మనం అనుభవిస్తున్న జీవితానికి ఎన్నికలు, నాయకులు, ఆ పధకాలు, ఈ పధకాలు, వాగ్దానాలు అవసరం అంటారా...!! ప్రతిసారి ఓటు వేయాలి కాబట్టి ఎవరినో ఒకరిని నమ్మాలి అని ఓటు వేసేసి మన బాధ్యత తీరిందని చేతులు దులిపేసుకోవడం...తరువాత ఎవరు ఏ పార్టిలోకి పోయినా....పనికిరాని సమ్మెలు, ఉద్యమాలు చేసి వాళ్ళ అవసరాలు తీర్చుకున్నా, తిన్నంత తిన్నా....ప్రజా ఖజానా ఖాళి చేసినా, దేవుని సొమ్ములు తిన్నా, ముఖ్యమంత్రులను మార్చినా, వాళ్ళ ఖాతాలు నింపుకోడానికి ఆ పన్నులని, ఈ పన్నులని మన మీద మోయలేని భారం వేస్తున్నా కడుతున్నామే కాని ఎదురు తిరగలేక పోతున్నాము. ఏం చేయలేక పోతున్నాము. అదేమంటే అంత శక్తి గల దేవుడే చూస్తూ ఊరుకుంటున్నాడు...సామాన్యులం మనమేం చేయగలం అంటూ చేతులెత్తేస్తున్నాం.....!!  ఎప్పుడో ఎవరో కాల్చిన కరంట్ కి మనకి సంబంధం లేక పోయినా కనపడని....పల్లెల్లో అస్సలు కనిపించని కరంట్ కి  పద్దులు కడుతూనే ఉన్నాము మాట్లాడకుండా....!! వాడెవడో తిని పోయాడు నేనేం చేయను అని ఒకడు....రామ రామ మా సొమ్మే పెడుతున్నాం...అయినా అన్యాయంగా నీలాపనిందలు మాపై వేస్తున్నారు అంటూ మరొకరు....పాదయాత్రలు, ప్రగతి పురోగమనానికి పధకాలు అంటూ వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు అవాకులు చవాకులు విసురుకుంటూ మరికొందరు...ఇలా వాళ్ళ స్వార్ధం కోసం మాత్రమే పని చేసే నాయకులతో కూడిన ప్రజాస్వామ్యం మనకు ఎంత అవసరమో ఆలోచించండి...?? మన హక్కుల కోసం మనం ఎన్నుకున్న నాయకులకు వాటాలు వడ్డీలు సమర్పించుకోవడం అవసరమా...!! వాళ్ళు వాళ్ళ లాభం కోసం, పదవుల మీద వ్యామోహంతో పార్టీలు పార్టీలు మార్చుతూ శ్రీరంగ నీతులు వల్లిస్తూ మీటింగులు చెప్తూ ఉంటె గంగిరెద్దులా తల ఊపి గొర్రెల్లా వాళ్ళ వెనుక వెన్నెముఖ లేకుండా ఉండటం, వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తడం ఎంత అవసరమో ఆలోచించండి....?? కనీస సౌకర్యాలు లేని పల్లెల్లో....ఇచ్చే రేషన్ లో కల్తి...పురుగుల బియ్యం, ఉడకని పప్పు, ఉప్పొ మన్నో తెలియని అయోమయం...పంటలకు పట్టుగొమ్మలైన పల్లెలలో ఇదండీ ఉచిత పధకాల అమలు. ఆడపిల్లకు అన్ని అని చెప్తూ కాసింత రక్షణ ఇవ్వలేని ఈ అణా కాణి ఓట్ల పధకాలు...ఇంత అభివృద్ధి చెందిన టెక్నాలజీ ఉన్నఈ రోజుల్లో కనీస బస్సు సౌకర్యం లేదంటే చాలా హాస్యాస్పదంగా ఉంది....కాని ఇది నిజం...!! తాగడానికి మంచినీరు లేక పొతే వేసవిలో ఇబ్బందులకు తట్టుకోలేక మంచినీళ్ళ టాంక్ ఊరివాళ్ళ శ్రమ దానంతో....దాతల సాయంతో నిర్మించుకుంటున్నారు. ఎంత మంది నాయకులకి ఎన్ని అర్జీలు పెట్టినా రోడ్డు కాని బస్సు కాని లేని పల్లెల్లు కోకొల్లలు మన దేశంలో. ముసలి ముతకా అయినా ఎవరైనా సరే ప్రాణం పోతున్నా... ఎండ మండి పోతున్నా...మోకాలి లోతు బురదలో అయినా మూడు కిలోమీటర్లు నడిచి వెళ్ళాల్సిన పరిస్థితి ఇప్పటికి ఉందంటే నమ్ముతారా...!! ఏ నాయకుడు ఏమి చేయనప్పుడు ప్రభుత్వం స్పందిన్చనప్పుడు ఇలాంటి పల్లెలకు ఎన్నికలెందుకు...?? రాజకీయాలెందుకు....?? పార్టిలెందుకు...?? కాల్చని కరంటుకు బిల్లులెందుకు...?? అందుకే  మీకు ఉపయోగం లేని ఎన్నికలను....రాజకీయాలను ఒక్కసారి బహిష్కరించండి....!! ఫలితం చూడండి....!!  
 

3, మే 2013, శుక్రవారం

అలుకనే మరిచా....!!

మౌనం మాటాడుతుందట
మన మధ్య మాటలు లేకపోయినా....!!
నీకు తెలుసా....!!

కోపంలో నువ్వు అలిగినా
ముద్దమందారంలా ఎర్ర బడిన నీ మోము
ఎర్రని తామరలా ఎంత బావుందో....!!

ముగ్ధలా ముడుచుకున్న మొగ్గలో
సిరి మువ్వలా సవ్వడి చేస్తూ
విచ్చుకున్న నీ చిరునవ్వు...

నా మనసు దోచి అలుకను మరిపించి
నన్ను నీతో జత కలిపింది.

2, మే 2013, గురువారం

ఏ జీవితం ఎటు వైపో....!!

జరిగి పోయిన గతం
చే...జారి పోయిన జీవితమని తెలిసినా...!!
జరుగుతున్న వాస్తవం
నిజమని తెలిసినా...!!
జరగబోయే వర్తమానంలో
చేదు నిజాలున్నాయని తెలిసినా....!!
అంతరంగపు అలల కల్లోలంలో
ఊహల్లో వాస్తవాలు భయపెడుతుంటే
జ్ఞాపకాల్లో బతకలేక
వాస్తవానికి దగ్గర కాలేక
రాజి పడలేని నిరాశాజీవి
అటు ఇటు పోలేక
ఎటు పోవాలో అన్న అయోమయంలో
అక్కడే ఆగిపోతే....!!
చే జారి పోయిన జీవితాన్ని
తిరిగి దక్కించుకునే ప్రయత్నంలో
అదరక బెదరక అవిశ్రాంతంగా 
నిరంతర పోరాటంలో ఆశాజీవి...!! 

1, మే 2013, బుధవారం

మారిపోయిన మన జీవితాలు....!!

 ఒకప్పుడు వేసవి వచ్చిందంటే బోల్డు సంబరంగా ఉండేది...ఎంత ఎండలు ఉన్నా అస్సలు ఎండ అనిపించేది కాదు.
చెట్లు చేమలు ఎక్కువగా ఉండి ఎండ తెలిసేది కాదు. పల్లెటూర్లు అంటే అచ్చం పల్లెటూర్లు లాగా పచ్చగా చల్లగా హాయిగా ఉండేది. జనాలు కూడా నిండుగానే ఊరి నిండా ఉండేవాళ్ళు. వాళ్ళ మనసులు కూడా అంతే స్వచ్చంగా ప్రేమాభిమానాలు వెదజల్లుతూ ఉండేవి. తినడానికి బోలెడు రకాల కాయలు చీమ చింతకాయలు, తాటి ముంజెలు, రకరకాల మామిడి కాయలు, గెలలు ముగ్గవేసి పండాయో లేదో అని చూసుకున్నఈతకాయలు....ఇలా ఎన్నోరకాలు దొరికేవి. అలానే ఆటలు కూడా బోలెడు...ఆరుబయట వెన్నెల్లో పడుకుని చెప్పుకున్న చందమామ కతలు, బొమ్మల కబుర్లు, కనిపించి కనిపించక ఆడిన వీరీ వీరీ గుమ్మడి పండు వీని పేరేమి? దొంగాటలు ఇలా ఎన్నో....!! ఇప్పటి పిల్లలకు తిండి తెలియదు అలానే ఆటలు కూడాను. ఎంతసేపు టి వి లో చానల్స్  లేదా వీడియో గేములకే పరిమితం అయిపోతోంది బాల్యం అంతా....!!  బంధుత్వాలు తెలియకుండా నేను...నా అన్న స్వార్ధాన్ని మనమే పిల్లలకు అలవాటు చేస్తూ మనం అన్న మాటని....మనతో పాటుగా పెంచుకున్న వరుసలను మర్చిపోయేటట్లు చేస్తున్నాము.
మన సొంత ఊరు వెళితే ఇప్పటికి మనం ఊరిలో అందరినీ మర్చిపోయినా అబ్బాయ్ ఎప్పుడు వచ్చావు? ఆరోగ్యం బాగుందా....!! పిల్లలు ఎలా ఉన్నారు...ఏం చదువుతున్నారు...?? ఇలా పరిచయం మనకి లేక పోయినా ఆప్యాయమైన పలకరింపులు మనకు వినపడుతూనే ఉంటాయి....కాదంటారా....!! ఎన్ని కోట్లు సంపాదిస్తే మాత్రం ఈ ప్రేమ పూరిత పలకరింపులు మనకు దక్కుతాయి చెప్పండి.
సాయంకాలం ఆరుబయట అరుగుల మీద కూర్చుంటే తాతయ్యలు, మామయ్యలు, మామ్మలు....ఇలా అందరు వచ్చి కాసేపు చల్లగాలికి సేదదీరుతూ ఆ కబురు ఈ కబురు చెప్తూ వాళ్ళ రోజుల్లో కబుర్లు కలగలిపి చెప్తూ ఉంటే అబ్బా....!! నిజంగా ఎంత బాగా అనిపిస్తుందో...!! చెప్పడానికి మాటలు చాలవు. అమ్మమ్మ పచ్చిపులుసు వేసుకుని అన్నం తింటే ఏ ఖరీదైనా భోజనమైనా దానిముందు దిగదుడుపే....!!
ఇప్పుడేమో చదువులు, ఉద్యోగాలు అని పొట్ట చేతపట్టుకుని ఊళ్ళమ్మట తిరుగుతూ ఇంటికి ఉన్న కాస్తో కూస్తో పోలానికో పెద్ద వాళ్ళని కాపలాగా పెట్టి కనీసం ఒక్కసారి కూడా పల్లెకు వెళ్ళి నాలుగు రోజులు కల్మషం లేని ప్రేమలని, స్వచ్చమైన వాతావరణాన్ని ఆస్వాదించలేని జీవితాలు మనవి ఈనాడు. సుమ్మర్ ట్రిప్పులని ఆ ఊరు ఈ ఊరు పోకుండా రోజుల తరబడి కాకపోయినా ఊన్న ఊరిలో... నా అన్న వారితో కనీసం నాలుగు రోజులు గడపడానికి ప్రయత్నం చేస్తే....!! బావుంటుంది కదూ...!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner