26, జులై 2013, శుక్రవారం

ఆ ఆలోచనే....!!

సీతమ్మలో రాముడు ఉన్నాడు కదా...!! మరి కనిపించలేదు అంటారేంటి..?? సీతమ్మ జీవితం అంతా రాముడే నిండి
ఉన్నాడు కదా...!! సీతమ్మ జీవితమే రామాయణం అయినప్పుడు రాముడు లేకపోవడమేంటి...?? అప్పుడు రామాయణానికే అర్ధం లేకుండా పోతుంది. జనం కోసం రాముడు కానీ రాముడి కోసమే సీత....అందుకే నాకు సీతమ్మ అంటేనే ఇష్టం...రాముడంటే కోపం...!! ఎంత ప్రేమ గుండెల నిండా ఉన్నా చూపలేని రామయ్య మనసులోనే దాచుకున్నాడు జనం కోసం...!! తండ్రి మాట కోసం కానలకేగిన రామయ్య అందరికి ఆదర్శమే కాని రాముని కోసం అన్ని వదిలి తన వెంట నడిచిన సీతమ్మ, లక్ష్మయ్య రాముని కన్నా ఎక్కువ నాకు. రామయ్య జీవితంలో అందరు ఉన్నారు కాని సీతమ్మకు రాముడే జీవితం...!! కానలకేగినా, కారడవుల వెంట నడిచినా, అశోకవనంలో ఉన్నా రామయ్యే సీతమ్మ లోకం...బంగరు లేడిని చూసి ముచ్చట పడినా, మునివాటికలను చూడాలని కోరినా రామయ్యతోనే ఉండాలనుకుంది కాని ఒంటరిగా కాదు...రామయ్య గొప్పతనం చూపించడానికే ఆ కోరికలు సీతమ్మ కోరింది ఆనాడు....లేక పొతే రామాయణము లేదు ఉత్తర రామాయణము లేదు...!!
రామాయణమైనా, భారతమైనా, భాగవతమైనా...ఏ పురాణమైనా, ఏ ఇతిహాసమైనా, చరిత్ర అయినా, కధలైనా, కవితలైనా, పద్యాలైనా, కావ్యాలైనా, చాణుక్యుని అర్ధ శాస్త్రమైనా, కౌటిల్యుని నీతి అయినా, మను చరిత్రయినా, శృంగార నైషధమైనా...ఇలా ఏది తీసుకున్నా మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తాయి. ప్రపంచంలో మరెక్కడా లేని ఈ పద సంపద మన భారతీయుల సొంతం. ఎంతోమంది మన సంస్కృతీ సంప్రదాయాలను, వివాహ వ్యవస్థను గౌరవిస్తుంటే మనం మాత్రం దూరపు కొండల వెంట అలుపెరగక పరుగులు తీస్తూ అదే జీవితం అనుకుంటున్నాము. బంధాలకు, కుటుంబ విలువలకు వలువలు తీసేస్తూ డాలర్ల నాగరికత కోసం పరుగులు తీస్తున్నాము....అదే జీవితం అనుకుంటున్నాము...బతకడానికి డబ్బులు కావాలి కాని బతుకే డబ్బులు అయిపోతున్నాయి ఇప్పుడు...!! వీటి ముందు ఏది సరిపోవడం లేదు....!! మనమే ఇలా ఉంటే మరి మన తరువాతి తరాలు ఇక ఎలా ఉంటాయో....!! 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner