కొట్టివేత చదువుతుంటే నిజంగానే కొట్టివేతల నుంచి మళ్లి కొత్తగా పుట్టుకు రావడం నిజం అనిపిస్తూ... మాటల మడుగులో మాటలు నోటి నిండా ఒకప్పుడున్నా ఆచేతానావస్థలో ఘనీభవించిన ఎన్నో జీవితాల్లోని మాటలను చూసాను.. నన్ను నేను చూసుకున్నాను.. ప్రశ్నల గది ప్రతి ఒక్కరికి అవసరం అని చదివిన ప్రతి ఒక్కరికి అనిపించక మానదు.. చీకటి దీపాన్ని చాలా కొత్తగా అనంతాకాశం ఏకాంతరాగం ఆలపించే వేళ చీకటిలో రంగుల దృశ్యాన్ని చూపడం మెర్సికే సాధ్యమైంది.... హృదయపు మెతుకులో చిదేమేసిన ఆలి అంతరంగాన్ని బహు చక్కగా చెప్పారు.. మాట్లాడనిమ్మని భాషకు నదికి అనుసంధానం చేస్తూ , మనుష్యుల మధ్య జరుగుతున్న పైచాచికత్వాల పరాకాష్టను చూపించారు... కవులు కాగితం, మనవి వీటిలో మనసు అక్షరాలుగా కవి కాగితంపై మిగిలిపోవడం అంటూ , మాటలు మనకు మనవి చేస్తున్న విశ్రాంతి గురించి ఎంత గొప్పగా చెప్పారో... సగం కొట్టేసిన చెట్టు నుంచి వచ్చిన మొలక ఆడా.. మగా అని విత్తనపు వీర్యంలో అడగడం అర్ధవంతంగా ఉంది.. కాడంబరిలో కలను హృద్యంగా వర్ణించారు... రాతిరి పగలు గురించి తలాష్ లో అమర్త్యకేకలో అంతరించి పోతున్న ప్రకృతి గురించి... ఖాళీలు మంచివే అంటూ చక్కని భావాలను ప్రసవించడానికి ఖాళీని ఆహ్వానించడం... అమరసత్యంలో ఎందఱో కోల్పోయిన బాల్యాన్ని... వెన్నెల స్నేహితాలో తీయని చెలిమిని.. వీడ్కోలు ఎంతగా బాధిస్తుందో కళ్ళకు కట్టినట్టు చూపించారు... చిప్కోలో చెట్టు మనసుని.. తన్హాదిల్ లో ఇద్దరి మద్య దూరాన్నిఅక్షరాల వెన్నెల తాళ్ళతో ముడేసారు.. కొత్త ఆకాశంలో కవి మదిలో మెదిలే భావాన్ని.. తనతోనే నేను చదువుతున్నప్పుడు మనం కూడా ఆ భావాల్లో తాదాత్మ్యం చెందిపోతాం అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు... నాకు బాగా నచ్చిన కవిత ఇది.. మిగిలిపోయిన దారం మనం వదలి వేస్తున్న బంధాలకు సాక్ష్యంగా మిగిలి పోతుంది.. దోసిలిలో నదిని ఎంత బాగా చూపించారండి.. నవ్వులు, మాటలు,మైలురాళ్ళు, మనిషి మాయాజాలం, ముగిసే పరిచయం, అవసరం,జీవితానికి కూడికలే కాకుండా అప్పుడప్పుడు తీసివేతలతో పని ఉంటుందని, గాజు మనసు, మనం చూడలేని ఎన్నో ఎద లోతుల్ని, ఉలిక్కి పడుతున్న ఊరి తలుపుల్ని,మరణం కనిపిస్తే కబురెట్టమని, సముద్రాన్ని అంబరాన్ని కలపడంలో చాలా లోతైన భావాలు... కొన్ని సామాజిక సంఘటనలకు స్పందనలు, పాదముద్రల్లొ కొందరి కథలు, స్వగతాలు, ఓటమి గెలుపుల మధ్య, కాలాన్ని ఎలా కాల్చేస్తున్నాం అని, చెప్పకూడదు అంటూనే చెప్పిన మాటలు కొన్ని... లాలిపాడుతూ జోకొట్టిన చివరి కవిత... అన్ని వెరసి మెర్సీ మనసును అందులోని భావాక్షరాలను చూపించాయి...తప్పక చదవాల్సిన ఓ మంచి కవితా సంపుటి "మాటల మడుగు" అనడంలో ఏ మాత్రం సందేహం లేదు...
ఇంత చక్కని మాటల మడుగును గుర్తుంచుకుని నాకందించిన మెర్సికి కృతజ్ఞతలు...
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి