3, ఏప్రిల్ 2017, సోమవారం

అర్ధాంతరపు జీవితాలు..!!

కాటేయాలని ఎదురుచూస్తున్న
కాలానికి అందని అగాధపు లోతులలో
నిర్భయంగా నిలబడిన క్షణాలు

తలపుల వడపోతలో మిగిలిన
గతపు గాయాలు తడిమిన చెమ్మగింతలలో
అలసిన మదికి జ్ఞాపకాల ఆలంబనలు

అక్షరాలను అల్లిన భావాలు
విప్పిచెప్పిన కాగితాల కళాపోషణలో
వెల్లువెత్తిన అనుభవసారాలు

ఒంటరితనానికి ధీటుగానిలిచిన
ఏకాంతానికి చేరువగా చేరిన సర్దుబాట్లలో
అక్కడక్కడే తచ్చాడుతున్న ఆత్మీయతలు

పలవరింతలుగా మారిన
పలకరింతల్లో వినిపించని ప్రేమల మధ్యలో
అసంపూర్తిగా అలమటిస్తున్న అనుబంధాలు

యుగాల నిరీక్షణకు తెరదించే
అనునయాలకు ఆరాటపడుతున్న ఊసులలో
ముగిసిపోతున్న అర్ధాంతరపు జీవితాలు..!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner