3, మార్చి 2018, శనివారం

ఆలోచించాల్సిన విషయం....!!

నేస్తం,
         స్నేహం అంటే ఓ ఆత్మానుబంధపు చుట్టరికం. ఈ వర్చ్యువల్ ప్రపంచంలో స్నేహం అంటే చాలావరకు అవసరార్ధం అనుబంధమై పోయింది. ఎదుటివారు మనకు నచ్చినట్లు ఉండాలనుకోవడం, మనం చెప్పినట్లు వినాలనుకోవడం సంస్కారం అనిపించుకోదు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. విలువ ఇచ్చిపుచ్చుకోవడం తెలిస్తేనే ఏ బంధమైనా కలకాలం నిలబడుతుంది. అది స్నేహం కావచ్చు, ప్రేమ, పెళ్లి ఏదైనా కావచ్చు నమ్మకం, నిజాయితీ, నైతికత అనేవి ఈ సభ్య సమాజంలో చాలా ముఖ్యమైనవి. వ్యక్తిగతంగా మన వ్యక్తిత్వాన్ని తక్కువ చేసే అనాగరిక, అనైతిక సంబంధాలు అనేవి ఎంతవరకు మనకి అవసరం అనేది అందరు ఆలోచించాల్సిన విషయం.
         క్రమం తప్పుతున్న మూడుముళ్ల బంధాలు ఎన్నో ఈరోజుల్లో మనం చూస్తున్నాం. రాహిత్యం అనేది ఇద్దరి మధ్యన లోపిస్తోన్న అనుబంధానికి ప్రతీక. మొగుడు అమ్మాయిలతో తిరుగుతున్నాడని వాపోయే ఇల్లాళ్లు వారు తిరిగేది కూడా వేరేవాళ్ళ మొగుళ్ళతో అని ఎలా మర్చిపోతున్నారో నాకు అర్ధం కాని ప్రశ్నగానే మిగిలిపోతోంది. మొగుడు / పెళ్ళాం పిల్లలు ఉన్నవాళ్లే ఇతర అనుబంధాలకు ప్రాకులాడుతూ నైతిక విలువలు లేకుండా చేస్తుంటే మనం చూస్తూ ఊరుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. ప్రేమ రాహిత్యంలో ఉన్నవాళ్లకు, ఒంరటితనంతో బాధ పడుతున్నవాళ్లకు ఈ అక్రమ అనుబంధాలు ఎడారిలో ఒయాసిస్సుల్లా అనిపించడంలో వింతేమీ లేదు. కాని మన ఈ అర్ధంలేని అక్రమ సంబంధం వలన మరో కుటుంబం చిన్నాభిన్నమై పోతోందని, మనం పడే బాధే ఎదుటివారు కూడా పడుతున్నారని తెలుసుకుంటే, ఎక్కడో బయట ఆత్మీయతను వెదుక్కోవడానికి అర్రులు చాచే మనసును మన అనుకున్న అనుబంధం కోసం ప్రయత్నం చేస్తే ప్రేమ రాహిత్యం కానీ, ఒంటరితనం కానీ లేకుండా పోతాయేమో. ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న ఎందరో ఒకరు కాదు ఇద్దరు కాదు ఇలా అర్ధం పర్ధం లేని క్షణిక సుఖాల కోసం వెంపర్లాడటం చూస్తుంటే మాటల్లో చెప్పలేని ఏహ్య భావం కలుగుతోంది. ఎంతో ఉన్నత విలువలున్న మన సమాజంలో ఈ అసహజ మార్పు గొడ్డలిపెట్టులాంటిది. చదువుకున్న విజ్ఞులు, పెద్దలు ఆలోచించి ఈ జాడ్యానికి చరమగీతం పాడాలి.
మరోసారికలుద్దాం మరో విషయంతో.
        

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner