12, మార్చి 2018, సోమవారం

ఎనిమిదో రంగు పుస్తక సమీక్ష....!!

                మన అందరికి తెలిసిన ఏడురంగుల ఇంద్రధనస్సే కాకుండా ఎనిమిదో రంగును మనకు పరిచయం చేయడానికి అనిల్ డ్యాని తన కవితలతో మన ముందుకు వచ్చేసారు. ముఖ చిత్రంలోనే ఆ రంగు ఏమిటన్నది చెప్పకనే చెప్పేసారు. యథాలాపంగా చెప్పడం మొదలు పెట్టినా సమాజపు తీరు తెన్నులు ఏమిటనేది ఈరోజు గాయపడ్డ సూరీడుతో రేపటి ప్రభాతమైనా ఆంక్షలు లేకుండా రావాలన్న కాంక్షని, ధర్మస్థలిలో వెలివాడల ఒంటరి కేకల ఆర్తనాదాన్ని,  ఆమె - రాత్రి చందమామలో చీకటిలో మేల్కొన్న ప్రపంచంలో నిన్నటికి నేటి మధ్యనున్న ఓ శూన్య కాలంలో బీద గొప్పల అంతరాన్ని గ్రహణం పట్టిన చీకటికి వెలుగులు పూస్తున్న సందడి హడావిడిలో పెళ్లి ఊరేగింపులో పెట్రోమాక్స్ లైట్ పట్టుకున్న ఓ అమ్మ చీర చిరుగుని దాచడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మనసుకు హత్తుకునేటట్లు చెప్పడం అభినందించదగ్గ విషయం. మరణ వాంగ్మూలంలో మృతదేహం ఎప్పుడు మరణించిందో మనకు స్పష్టంగా విప్పి చెప్పారు. నీకు నువ్వుగా నీతో నువ్వుమాట్లాడే సమయాన్ని నీకు కేటాయించుకో అని ఈ మౌనం మంచిది కాదు అని ఓ చురక వేశారు. జండాపై కపిరాజులో తెలిసిన నిజం జనం చప్పట్ల మధ్య నలిగిపోతోందని ఙివిత నాటకంలో గెలుపెవరిదో చెప్పని ముగిసిన నాటకం పాత్రలో ఎక్కడ వాలాలో తెలియని పావురం ఆసరా కోసం మనిషి భుజాన్ని వెదుక్కోవడం, వ్యూహంలో వీరుని తుపాకిని ముద్దాడే సీతాకోక చిలుక, ఆమెతనంలో ఇసుక రేణువులో దాగిన సంద్రం,అణచబడినా మొలకెత్తే మరో వసంతం, తెల్లారొచ్చిన సూర్యుడి వెలుగంతా ప్రపంచ తల్లులు స్రవించిన రక్తమంటూ అహాలకు, అధికారాలకు అంగడిబొమ్మగా మారిన అతివ మనసును ఆవిష్కరించారు. ఆలింగనం మతాల మానవత్వాన్ని చాటి చెప్తోంది. ఇదిగో పొలం నుంచే వస్తున్నాను గత జ్ఞాపకాల గుర్తులను తడమడం, ఇక్కడ ఏడుపు నిషేధంలో మూర్ఖుల మారణకాండకు బలైపోతున్న అన్నెం పున్నెం ఎరుగని పసి ప్రాణాలను, అతని పాటలో మనసు రాగాన్ని, ఓ ధిక్కార స్వరాన్ని కొత్తగా వినిపించారు. వలస వాన అవసరానికి అందని చినుకు పల్లెలకు మొఖం చాటేయడాన్ని అద్భుతంగా అందించారు. జనరల్ బోగీలో మనిషితనం కాస్త మనసులకు అంటడానికి సహజత్వాన్ని కోల్పోవద్దని సూచించారు. ప్రవాహం, వాన రాత్రి, ఒంటి రెక్క పక్షులు, గ్రేటర్ దెన్ వంటి కవితల్లో కవిత్వం వినబడడాన్ని, సంఘర్షణల చిత్తాలను చూపించారు. కొన్ని మాటలంతే అంటూ మనం పోగేసుకున్నంత కాలం మిగిలేది మాటలు రాల్చిన మౌన గాయాల కబుర్లే అంటారు. ప్రతీకలుగా నిలిచేది కొన్ని పొద్దులు, సాయంత్రాలు కలిపి మిగిల్చిన కాసిన్ని నిజాలు, అబద్దాలని చెప్పడం, భలే మంచి చౌక బేరములో దేశ రాజకీయంపై విసుర్లు, వెలుతురూ విరుగుతున్న శబ్దం, పంజరం చిలుక,పిల్లలారా వంటి చక్కని సందేశాత్మక కవితలు, వెకెటింగ్ కవితలో వెలయాలి గుండెకోతను, కాటి సీను పద్యంలో మనిషిగా మనలేని మన బతుకుల్ని, గాయపడ్డవాడాలో ఓ ఆశావహ దృక్పధాన్ని, మనుషుల మధ్యలో దూరమౌతున్న అనుబంధాలను చూపించారు. ఇక చివరిదైన ఈ కవితా సంపుటి పేరైన ఎనిమిదో రంగు గురించి చెప్పడం అనిల్ మాటల్లోనే .. అన్ని రంగులను తనలో ఇముడ్చుకునే నలుపు వర్ణం . అదే "ప్రేమ".
నిజరూప దర్శనం, గాజు దేహాలు, నివేదన, మాయ తెర, పహారా, ఆ ఇంటి ముందు వంటి చక్కని ఆలోచింప చేసి కవితలు, మరో రెండు ఆంగ్లానువాద కవితలతో ఎనిమిదో రంగు ఓ కొత్త సోయగాన్ని అందుకుంది.

  అద్భుతమైన 35 కవితలను ఎనిమిదో రంగుగా ఆవిష్కరించిన అనిల్ డ్యానికి అభినందనల శుభాశీస్సులు...

మంజు యనమదల. 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner