17, మార్చి 2018, శనివారం

రాయికి నోరొస్తే కథా సంపుటి సమీక్ష,,,!!

          వనజ వనమాలి బ్లాగర్ గా అందరికి సుపరిచితులైన తాతినేని వనజ కథల సంకలం "రాయికి నోరొస్తే"లో కథలను చదువుతుంటే ఆ పేరెందుకు పెట్టారో అర్ధం అయ్యింది. తన చుట్టూ ఉన్న సమాజంలోని కష్టాలు, కన్నీళ్లు చూసి రాయిలా మారిన మనసుకి మాటలొస్తే అచ్ఛం ఈ రాయికి నోరొస్తే కథల్లోని పాత్రలే మన నిజ జీవితంలోని మన అనుభవాలే అనిపించక మానవు.
         ఇక కథల్లోని వెళితే ఆనవాలు కథలోని పేరు కూడా చెప్పుకోలేని ఓ భార్య చాటు భర్త, కొడుకుగా తన తండ్రికి అవసానదశలో ఆసరా కాలేక పోవడంలో పడే వేదనను, ఆస్తులు అడగడానికి పల్లెకు వెళుతూ గుండె లోతుల్లో దాగిన జ్ఞాపకాలను తడుముకుంటూ చివరికి తన కర్తవ్యాన్ని అద్భుతంగా నిర్వహించడాన్ని హృద్యంగా చెప్పారు. కాళ్ళ చెప్పు కరుస్తాదిలో పల్లెలోని ఆచారాలు, కట్టుబాట్లను, కులాల అహంకారాలను చెప్తూనే పల్లె మనసుల అభిమానాన్ని తమ దగ్గర పని చేసిన చిన్న పిల్లాడు యజమానురాలు తనపై చూపిన అభిమానానికి గుర్తుగా మథర్స్ డే రోజున అమ్మగా భావించి చీర పెట్టి ఆశీర్వదించమనడంలోని అనుభూతిని చక్కగా చెప్పారు. వెన్నెల సాక్షిగా విషాదంలో కులాల పట్టింపులకు బలైన ప్రేమను అందమైన మనసు పాటలతో దరి చేరని లేఖలో విషాదాన్ని వినసొంపుగా వినిపించారు. కూతురైతేనేంలో ఆర్ధిక బంధాలలో పడి ఎందరో పిల్లలు దూరమౌతున్న అనుబంధాల విలువలను ఓ తల్లి మనసు తన కూతురు గొంతానమ్మకోరికలను తీర్చడానికి ఆత్మార్పణ చేసుకోవడం చదువుతుంటే మన మనసులు కంటతడి పెట్టక మానవు. జాబిలి హృదయంలో మనసులు కలసిన బంధాలకు ఏ మతాలు, కులాలు,కట్టుబాట్లు  అడ్డు రావని అద్భుతంగా చెప్పారు. ఇక ఈ సంపుటి పేరైన రాయికి నోరొస్తే కథలో నిజానికి నమ్మకానికి మూలమైన అమ్మానాన్నా బంధంలో హక్కులకు, బాధ్యతలకు మధ్య అహానికి, ఆత్మాభిమానానికి తరతరాలుగా జరుగుతున్న సంఘర్షణను చెప్పడంలో సఫలీకృతులయ్యారు. సంస్కారంలో ప్రతి మనిషికి,మతానికి  మధ్య ఉండే విభిన్న ఆలోచనాసరళిలో ఉన్న ఆంతర్యాలను గౌరవించడం ఎలానో చెప్తూ, మనుష్యులు తనువు చాలించినా వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వమని చెప్పడం చాలా బావుంది. `కంట్రీ ఉమెన్ కూతురు కథలో మన సంప్రదాయపు కట్టుబొట్టు విలువను చెప్తూ అసలైన అందం ఆత్మ విశ్వాసంతో కూడిన వ్యక్తిత్వం అని చెప్తూ నేటి యువత వేగానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసారు. స్నేహితుడా నా స్నేహితుడాలో మనసు స్నేహాలు, రహస్య స్నేహాల మధ్యన పెరుగుతున్న అంతర్జాలపు వారధి, భావాల పంపకంలో ఆత్మల బంధాన్ని, అసలైన స్నేహాన్నిఅలవోకగా చెప్పేసారు. పాట తోడులో మానవత్వానికి, తోటి మనిషికి సాయపడటానికి గొప్ప కుటుంబంలోనే పుట్టనక్కరలేదని, ఆదుకునే మనసుంటే చాలని, ఇంకెన్నాళ్ళీ కథలో గుడిసెల్లో బతుకుల బాదరబందీలు, ఆడది ప్రేమను పంచడంలోనూ అదే కోపం వస్తే, తన సహనాన్ని పరీక్షిస్తే ఆదిశక్తిగా ఎలా మారుతుందో, మారాల్సిన ఆవశ్యకతను వివరించారు. మహిన్ లో చదువుకోవాలని ఉన్న ఓ పసి మనసు కుటుంబ పరిస్థితుల మూలంగా ఆగిన తన చదువు కోసం ఏం చేయడానికి నిర్ణయించుకుందో చెప్పడంలో ఆ భావోద్వేగాలు పలికించడంలో మనం రోజు చూసే సంఘటనలే కళ్ళ ముందు కనిపించేటట్లు చేసారు. మర్మమేమిలో మతాచారాలను అడ్డు పెట్టుకుని కొందరు ముసుగు వేసుకుని ఎలా మోసం చేస్తున్నారో దానికి పర్యవసానం మంచివాళ్ళు శిక్ష అనుభవించడం గురించి చాలా బాగా చెప్పారు. ఇంటిపేరుతో ఓ అతివ మనసులోని ఆవేదన తండ్రి, భర్త, కొడుకు వంటి బంధనాల నుంచి తనకంటూ ఓ అస్థిత్వాన్ని ఏర్పరచు కోవడానికి చేసిన ప్రయత్నం కనపడుతుంది. పలుచన కానీయకే చెలీలో స్నేహం ముసుగులో ఈర్ష్యను, అసూయను బయటపడకుండా పబ్బం గడుపుకునే ఈనాటి ఎన్నోకుటిల మసస్తత్వాలను, బేగం పేట్ ప్యాలస్ ప్రక్కనలో మన హడావుడి జీవితాల్లో మనముండి, మన దగ్గర పని చేస్తున్నవారి మానసిక స్థితిని అంచనా వేయలేని పరిస్థితులను, దూరపు కొండలు నునుపన్న అమెరికా వీసా జీవితాలను ప్రత్యక్షంగా చూసిన అనుభవాన్నిచక్కగా అక్షరీకరించారు. లఘు చిత్రంలో మనం చూసే మనిషిలో మనకి తెలియని మరో కోణం ఉంటుందని తెర మీద కనిపించే జీవితాల్లో ఆ తెర వెనుక విషాదాన్ని పరిచయం చేయడం, వేశ్యల మనసు కథను వినిపించడం, ఇల్లాలి అసహనంలో పట్టణవాసంలో అపార్ట్మెంట్ జీవితాలు, అసహనపు ఘట్టాలు భరించే ఓ సగటు ఇల్లాలి మనసు ముచ్చట్లు, గడప బొట్టులో అర్ధం లేని సంప్రదాయాలకు మనం ఇచ్చే విలువల గురించి, ఇప్పుడు కూడా రావా అమ్మాలో తనలో తాను మథనపడుతున్న కూతురికి దూరమై తప్పనిసరి పరిస్థితుల్లో రెండో పెళ్లి చేసుకుని కూతురికి దగ్గర కాలేని తల్లి వేదన, బయలు నవ్విందిలో అవసరాలకు జ్ఞాపకాలను నరుక్కోవడం, నా అన్న బంధాలను తెంపుకోవడం వెనుక ఎంత విషాదం పెద్దల మనసుల్ని మెలిపెడుతుందో,  ఆమె నవ్వులో అవసరానికి ఎలా వ్యాపారం చేయాలో, పురిటిగడ్డ కూలి బతుకుల్లో కష్టాలు, మగ బిడ్డ కోసం తపనతో భార్యనే కోల్పోవడం, లాఠీకర్ర కథల్లో బంధాల విలువలు, వ్యక్తిగత, ఉద్యోగ బాధ్యతలు ఎలా ఉండాలనేది సహాజ పాత్రలతో చక్కని శైలిలో చెప్పారు.

                    ప్రతి కథలోనూ మనచుట్టూ తిరిగే పాత్రలతో, మనకు అలవాటైన, దగ్గరైన అనుభవాలను ఇవి మనం చూస్తున్నంతగా లీనమైపోయేటట్లుగా సహజంగా చెప్పడంలో రచయిత్రి కృతకృత్యులైయ్యారు. ప్రతి కథలోనూ మానవీయ దృక్పథం కనిపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ప్రతి ఒక్కరు చదవదగ్గ పుస్తకం ఈ " రాయికి నోరొస్తే ". 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner