27, మార్చి 2018, మంగళవారం

ఒక్క అడుగు ముందుకు వేస్తే..!!

రాజకీయ చదరంగంలో
కార్పొరేట్ కట్టుబాట్లలో
కులాల కుమ్ములాట్లలో
కల్తీ విత్తుల మాయలో
సబ్సిడీ ఎరువుల మత్తులో
ఋణాల సుడిగుండంలో
ఆకాశాన్నంటే కూలి కొట్టంలో
ఆకలి తీర్చే వ్యవసాయ పంటల కోసం
అందీ అందని నీటి 'అ'సౌకర్యాల నడుమ
బాలారిష్టాలు దాటినా
అదును పదును లేని
అకాల వర్షాలతో
అరకొరగా చేతికందిన పంటకు
గిట్టుబాటు ధర కరవై
బీడుబారిన భూమిని చూస్తూ
చిన్నబోయిన గూడుని తల్చుకుంటూ
గుండె చెదిరిన బడుగురైతు
ఉద్యమాల బాట పడితే
గొంతెత్తి నినాదాలు చేస్తే
సగటు మధ్యతరగతి రైతుకు
న్యాయం జరుగుతుందా..
ఎందరికో ఆకలి తీర్చే అన్నార్తుడు
పండించిన పంటకు వెల కట్టలేని
దుస్థితిలో ఏకాకిగా మిగిలిపోతూ..
దళారీల దళసరి నోట్ల మధ్య
నలుగుతున్న తనవాళ్ల ఆకలి జీవితాల
రోదనలకు కడుపు మండితే..
ఏ పంటను పండించనని
ఒక్క అడుగు ముందుకు వేస్తే ...!! 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner