30, నవంబర్ 2018, శుక్రవారం

ఎదుటివారి రాతలను...!!

నేస్తం,
        ఏ వ్యాపకం ఎలా ఉన్నా, ఏ అనుబంధం ఎటు పోతున్నా మనకంటూ మిగులుతున్న కొన్ని క్షణాలను మనకిష్టమైనట్లు గడపాలనుకోవడం కూడా అత్యాశగానే మిగిలిపోతుంటే ఏమి చేయలేని నిస్సహాయత. బాధ్యతలు, బంధాలు చివరి క్షణాల వరకు మనతోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. పలుకు నేర్వనమ్మకి  మాట కూడా బరువేనన్నట్టుగా అవుతున్న రోజులివి. మనమెవ్వరి జోలికి పోకున్నా పనిగట్టుకుని మనతో కయ్యానికి కాలుదువ్వే నైజాలు అడుగడుగునా ఎదురౌతూనే ఉన్నాయి. ఈ సామాజిక మాధ్యమాల వాడుక పెరిగిన కొలది ఒకరు బావుంటే ఒకరు ఓర్వలేనితనం ఎక్కువై ఎవరికి వారు వారు చెప్పిందే వేదం, వారి ఇష్టాలే గొప్పవి అన్నట్టుగా మరొకరిని ఎద్దేవా చేయడం పరిపాటిగా మారిపోయింది. వ్యక్తి పూజలు, పుల్లవిరుపు మాటలు, ప్రతిదానికి రాజకీయ రంగులు పూలమడాలు, కులం ముసుగు కప్పడాలు బాగా ఎక్కువై పోయాయి. మనం ఎవరిని విమర్శించక పోయినా పనిగట్టుకుని మరి మన గోడలకొచ్చి ఎవరేమిటి అన్నది తెలియకుండా ఎదో ఒక రంగు పులిమేస్తూ హమ్మయ్య అని చంకలు గుద్దుకుంటూ శునకానందం పొందడం నిత్యకృత్యమై పోయింది.
       మన చేతికున్న ఐదు వేళ్ళే ఒకలా ఉండవు అలాంటిది అందరికి ఒకే ఇష్టం ఎలా ఉంటుంది? ఒకరికి ఇగురు ఇష్టమైతే మరొకరికి పులుసు ఇష్టమౌతుంది. నా గోడ మీద కాని, నా బ్లాగులో కాని, నేను పంపే పత్రికలకు కాని ఏమి రాయాలన్నది పూర్తిగా నా ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. డబ్బులకో, మరోదానికో అమ్ముడుబోయి రాసె రాతలు నావి కాదు. రాయాలనిపించినప్పుడు మాత్రమే రాసే రాతలు నావి. నేనెప్పుడూ ఎవరి రాతలను కాని, ఇష్టాలను కాని విమర్శించలేదు. అలా అని నా జోలికి వస్తే మాత్రం ఊరుకోను అది ఎవరైనా సరే. ఏం మీకు నచ్చిన పోస్ట్లు మీరు పెట్టుకుంటున్నప్పుడు ఎదుటివారికి అదే వర్తిస్తుందన్న చిన్న ఆలోచన మీకెందుకు లేదు. మీకిష్టమైన వారిని మీరు పొగుడుకోవచ్చు కాని మరొకరు ఎవరినైనా పొగిడితే మాత్రం తట్టుకోలేరు.. ఇదెక్కడి న్యాయం? సమీక్షలు, రాజకీయ విశ్లేషణలు, కవితలు ( ఓ మన్నించండి నేను కవిని కాదు ) కాదు కాదు భావాలు అనాలి కదా ఇలా నాకు నచినవే నేను రాస్తాను. చదివితే చదవండి లేదా నిరభ్యంతరంగా వెళ్లిపొండి, అంతేకాని ఉచిత సలహాలు ఇవ్వకండి. న రాతలు పూర్తిగా నా ఇష్టం. నేనేం ఎవరిని బలవంతపెట్టో, మొహమాటపెట్టో చదివించడం లేదు. అలాగే నేను స్పందించే తీరు కూడా. ఒకరడుగుతారు పూర్తిగా చదివే స్పందించారా అని, మరొకరడుగుతారు ఎన్నిసార్లు స్పందిస్తారు అని... రాతలకు, స్పందనలకు విలువ తెలిసిన వారు అర్ధం చేసుకోండి. కొందరికేమో అసలు అక్షరాల విలువ, స్పందనల విలువ తెలియదు. మీరు గొప్పవారే, మీ రాతలు చాలా గొప్పవే అయ్యుండొచ్చు. మీకు బోలెడు అవార్డులు, రివార్డులు వచ్చి ఉండొచ్చు. స్పందనకు కనీసం ప్రతిస్పందించడం సంస్కారం అని తెలుసుకోండి. మీ రాతలే గొప్పవని, మరెవరూ మీ అంత గొప్పగా రాయలేరని అనుకుంటూ ఓ రకమైన భ్రమలో ఉండిపోతే అది మీకే నష్టం.
ఎదుటివారి రాతలను కించపరచని సంస్కారం అందరు అలవర్చుకోవాలని మనసారా కోరుకుంటూ... 

ఏక్ తారలు...!!

1.   ఆలోచనా ఎక్కువే అక్షరానికి_అర్ధవంతమైన భావమై ఇమడాలని...!!

2.  మనసులో ప్రతిష్టించుకుంది_తలపుల అక్షరాలతో చేరువౌతూ....!!

3.   సుతి మెత్తనిదే అక్షరం_చురకత్తిలా మారినా....!!

4.   వేగుచుక్కగా మారి వెన్ను తట్టింది_ఓదార్పు తానైంది అక్షరం....!!

5.   శాంతి సంద్రాన్ని కానుకిచ్చింది అక్షరం_కల్లోల కడలిని తాను హత్తుకుని..!!

6.   తీరని మెాహమే మరి_అలవాటై అల్లుకున్న అక్షరాలపై...!!

7.  ఊతమై మిగిలింది ఎందరికో_ఒంటరి అక్షరంగా తనుంటూ...!!

8.   భావదాహార్తి తీరడం లేదు_తనివితీరని అక్షరానుబంధం పెనవేసుకుని..!!

9.  రేపటి కోసం ఎదురుచూస్తున్నా_నన్ను వదిలుండలేని నీ రాకకై...!!

10.  కన్నీరు కలత చెందినట్లుంది_చెక్కిలిని అంటిపెట్టుకుని ఉండలేనని...!!

11.  కల కలత పడుతోంది_మన పరిచయం కలవరమౌతోందని...!!

12.   దగ్గర కాలేనప్పుడు తెలుస్తుంది_మనసుల మధ్యన దూరమెంతని....!!

13.   నేల రాలినా నిత్య పరిమళమే_పారిజాతమంటి నెయ్యానికి...!!

14.  మనసే లేదంటే మారాము చేసావుగా_ఇచ్చి పుచ్చుకోవడాలు మనకెందుకంటూ...!!

15.  ఆంతర్యం అలవాటైంది_నజరానాలక్కర్లేని మనసాక్షరానికి...!!

16.   అక్షరాలతో అవధానమే మరి_భావ పూరణాలనంతమైనప్పుడు...!!

17.   గతంగానే మిగిలిపోయా_నువ్వు తిరిగొస్తావన్న ఆశతో...!!

18.  ఎన్ని అక్షరాలు గుమ్మరించాలో_మది మౌనానికి మాటలద్దాలంటే...!!

19.   అక్షరారాధన అనంతమైనది_భావాలక్షయమై పొంగుతుంటే...!!

20.   భావాలన్నీ అక్షరబాట పట్టాయి_నీ మౌనమేమంత్రమేసిందో....!!

21.  గాలమేశాయి అక్షరాలు_నీ చిత్తరువే చిత్తంలో చేరినందుకనుకుంటా..!!

22.   కనికట్టు చేయలేకపోయాయి అక్షరాలు_కంటికెదురుగా నీ రూపుంటే..!!

23.   కాలమేఘం కదులుతూనే ఉంది_జీవితపు రంగులన్నీ మెాసుకెళ్తూ...!!

24.   మనసే అక్షరంగా మారింది_నా భావనలన్నింటా నువ్వేనని గుర్తెరిగి..!!

25.   అక్షర మేఘాలు అలముకున్నాయి_మది అలజడులను చిలకరించడానికి....!!

26.  మానసాలొకటిగా చేసినది ఈ అక్షరాలే_మౌనం మనదైన తరుణాన...!!

27.  సందర్భం రాలేదుగా_మేఘసందేశమివ్వడానికి...!!

28.   బంధం బలమైనదే_బలహీన క్షణాలకు తిలోదకాలిస్తూ...!!

29.  మౌనమూ బావుంది_అలవాటైన జ్ఞాపకాలను కాలంతో కట్టి పడేస్తుంటే...!!

30.   చలించేది నీ చిరునవ్వులకే_మది గాయం మానకున్నా....!!

23, నవంబర్ 2018, శుక్రవారం

అధ్యక్షా...!!

అధ్యక్షా.....!!

ఏ రాష్ట్రానికి ఎవరేం చేసారో చెప్పుకుంటే నాలుగు ఓట్లు పడతాయి, కానీ ఒకే పేరుని పగలనకా రాత్రనకా జపం చేస్తుంటే ఆ నాలుగు ఓట్లు కూడా పడవు. 100 సీట్లు వస్తాయన్న నమ్మకమున్నోడికి 13 సీట్లకు పోటి చేస్తున్నవాడంటే భయమెందుకో మరి..  నలుగురూ జపించే నారాయణ మంత్రమెుకటే....😊

18, నవంబర్ 2018, ఆదివారం

వాణి వెంకట్...!!

                              మనసు గాయాలే ఈ కన్నీటి కావ్యాలు...!! 

             గాయాలను గేయాలుగా మార్చి, గుండె తడిని అక్షరాలకద్ది తన సాహిత్యంతో అందరి మనసులను దోచుకుంటూ, తాను రాసే అక్షరాల్లో విధి దూరం చేసిన బంధాన్ని అనుక్షణం తనతోనే నింపుకున్న వాణి వెంకట్ ముఖపుస్తకంలో తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. కలత పడుతున్న మనసుని కనుల మాటున దాచేస్తూ,  చెమ్మగిల్లిన కన్నులకు బాధను  పంచుకునే  పదాలను పరిచయం చేస్తూ తనదైన భావాలతో, అక్షరాలతో ఊరట పొందుతూ అందరి మనసులను తడుముతున్న కవిత్వం అందిస్తున్న వాణి వెంకట్ అభినందనీయులు. 
         కాలం మాన్పలేని గాయాన్ని కలం ఆసరాతో తనకు తానే ఓదార్చుకుంటూ పదిమందికి చక్కని చిక్కని సాహిత్యాన్ని తెలుగు భాషలో అందిస్తున్న వారిలో వాణి వెంకట్ ఒకరు. ఇప్పటి తెలుగు సాహిత్యంలోనున్న వివిధ ప్రక్రియల్లో అందె వేసిన చేయి వాణి వెంకట్ ది. 28 అక్షరాల్లో అద్భుతమైన భావాలు ఏక్ తారలుగా పొదగాలన్నా, రెండు వాక్యాల్లో ఓ గుండె గాయాన్ని చూపాలన్నా అది వాణి వెంకట్ కే సాధ్యం. చిత్రానికి కవిత రాసినా, గజల్ రాసినా, తేటగీతి పద్యం రాసినా ఆమెదొక ప్రత్యేక శైలి. చాలామంది కవితలకు  అద్భుతమైన విశ్లేషణలు రాసి అందరి మన్ననలు పొందడం వాణి వెంకట్ కే చెల్లింది. నిరాశల్ని నిశిలో దాచేస్తూ అక్షరాలతో కనీళ్ళు తెప్పించడం అలవోకగా చేసేస్తారు. దూరమైన బిడ్డను ఎలా అపురూపంగా ఈ భావంలో దాచుకున్నారో చూడండి. 

చెరిగి పోనివ్వను గుండెల్లో గతానెప్పుడు... 
నీ రూపం అపురూపమై జ్ఞాపకాల్లో మిగిలిపోయిందని..!! 

తన అక్షరాలన్నీ తడివేనంటారు మన గుండెలను కూడా తడి చేస్తూ ... 

తడి అక్షరాలే అన్ని_గాయాలను ఆరబెట్టుకుంటూ..!!
ఎన్ని తిమిరాలను పోగేశానో...బాధలు భావాలౌతున్నాయి..!! ఇలా ఎన్నో భావాలను చక్కని పదాల అల్లికతో అందించడం వాణి వెంకట్ ప్రత్యేకత.
    ఖాళీ అధ్యాయం కవితలో వెలుగు పరదాల మాటున దాగుంటే చీకటి నిండిన వెలితిగా మిగులుతూ జీవితమంతా ఖాళీతనమేనంటారు. బంధాలెన్ని ఉన్నా అనుబంధానికి అర్ధం అర్ధమవని సందిగ్ధమే ఎప్పుడూ .. అని అనడంలో ఎంత లోతైన అర్ధం ఉందో. దుఃఖంతో మౌనం నిండిపోతే, సమాధానం దొరకని మనసుకు అలసిన ఆఖరి దశలో తెలుస్తుంది జీవితమొక ఖాళీ అధ్యాయమని అనడంతో కవితకు ముగింపునిస్తారు. 
కంటిపాప చీకటైనది కాంతి ఏమిటి చేయగలదూ
కలల ఓటమి కావ్యమైనది కాల మేమిటి చేయగలదూ.. !! అంటూ జ్ఞాపకాల దృశ్య కావ్యానికి, ఓడిపోయిన సంతసాల దుఃఖాన్ని,  అమ్మ చెప్పిన భాష్యాన్ని గుండె గుండెను కదిలిస్తూ చక్కని గజల్ లో వినిపిస్తారు. 
             అమ్మ గురించి చెప్పినా, నాన్న అందించిన అక్షరాల ఆసరా గురించి చెప్పినా, మౌనంలో మాటలను, నిశ్శబ్దంలో నిశి రాగాలను, దూరమైన పేగు బంధాన్ని చేరుకోలేని నిస్సహాయతను అక్షరాలతో పంచుకున్నా, చేదోడు వాదోడైన చెలిమికి పెద్ద పీట వేసినా, గాయం చేసిన గతాన్ని జ్ఞాపకంగా మార్చుకున్నా ఇలా ఏది రాసినా అది వాణి వెంకట్ గుప్పెడు గుండెలోని రెప్పల చాటు చప్పుడే. మనసు కడలిలో దాచుకున్న నిప్పును కన్నీటి ఉప్పెనగా చేసి అక్షరాలను కంటతడి పెట్టిస్తున్న వాణి వెంకట్ కవిత్వపు భావజాలం చదివిన ప్రతి ఒక్కరిని కొంత కాలంపాటు వెంటాడుతూనే ఉంటుంది. పదిమంది మెచ్చే కవిత్వం పది కాలాలు పదిలంగా ఉంటుందన్నట్టు వాణి వెంకట్ మనసు కవిత్వం మనల్ని వెన్నాడుతూనే ఉంటుందనడంలో ఎట్టి సందేహమూ లేదు. నొప్పింపక తానొవ్వక అన్నట్టుండే వాణి వెంకట్ తెలుగుసాహిత్యంలో తనదైన ముద్రతో సాగిపోవాలని మనసారా కోరుకుంటూ... అభినందనలు . 
 

14, నవంబర్ 2018, బుధవారం

ఏక్ తారలు...!!

1.   నవ్వులు నటించలేనంటున్నాయి_నీ నిష్క్రమణాన్ని తట్టుకోలేక...!!

2.  చేరువ కాలేని జీవితమిది_తీరమెరిగిన అలల ఆటుపోట్లకు...!!

3.  ఊతమవ్వదా నా చెలిమి_తీరమెుకటైన మన జీవితాలకు...!!

4.  సంద్రమంటి చెలిమి నీదయ్యింది_సెలఏటిని చేరని నీ చింతని మాపడానికి....!!

5.  అక్షయమే జ్ఞాపకాలు_మరుపులేని కాలపు క్షణాలకు...!!

6.   అక్షరాలకే సాధ్యమది_అశ్రువులను సైతం అందమైన భావాలుగా మార్చేస్తూ...!!

7.   పన్నీటి జల్లులుగా మారుతున్నాయి_మనసు భారాన్ని అక్షరాలు మెాస్తూ...!!

8.  లలితమైనదే మనసు సాహిత్యం_లాలిత్యం అక్షరాల సొంతమైతే...!!

9.   ఎడబాటు తప్పని మనసులు_అక్షరాలతో మమేకమౌతూ...!!

10.  సేతువుగా చేరి నిలిచింది భావం_మనసాక్షరాలనొకటిగా చేస్తూ...!!

11.   గెలుపు తథ్యం_భావనాత్మక అక్షరాలకు...!!

12.  మురిసి ముదమందలేనా_పలకరించేవి నీ తలపుల సవ్వడులైతే....!!

13.   మనసైన జీవితమైంది_నా నవ్వులన్నింటా నువ్వున్నావని...!!

14.   అంతర్ముఖీనతను ఆపాదించుకున్నా_అంతర్లోచనాలు నా మనసాక్షరాలని...!!

15.   ఆర్ద్రతకు చోటెక్కడిది_ఆత్మీయత అందరానిదై పోతుంటే...!!

16.    మనసే అక్షరంగా మారింది_వెదికిన పెన్నిధి దొరికినందుకనుకుంటా....!!

17.   గుట్టగా పోసినందుకు కాదట బెట్టు_గుట్టుగా అక్షరాన్ని దాయనందుకట...!!

18.   అక్షరాలన్నీ అక్షయమైన భావాలౌతున్నాయి_గుప్పెడు గుండెలో దాగలేక...!!

19.   మనసు భారాన్నంతా ఒంపేసా_అక్షరాలకు బాధ్యత గుర్తుజేయాలని...!!

20.   మనసు భావాలను క్రమబద్ధం చేస్తున్నా_అక్షరాల అండదండలతో....!!

21.  మౌనమెంత ముగ్ధంగా ఉందో_అలక నేర్చిన మనసు పలుకుల్లో....!!

22.   తడక్షరాలు పొడిబారుతున్నాయి_మనసెడారిగా మారిందనుకుంటా....!!

23.  విలాపమే మిగిలింది వాస్తవానికి_గత గాయాలు మిగిల్చిన ఆనవాళ్ళతో...!!

24.   మనసెప్పుడూ ఒంటరిదే_మనిషిదనపు ముసుగుకు బలౌతూ...!!

25.   అలజడిదెంత ఆరాటమెా_నీ తలపులకు వీడ్కోలివ్వలేక....!!

26.    అంతిమ క్షణాలకు ఆయువు పోస్తాయి_జీవం నింపుకున్న జ్ఞాపకాలైతే...!!

27.   వీడ్కోలుకు విషాదమెందుకట_మరో కలయికకు నాందిగా మారినప్పుడు...!!

28.   మనసు ముచ్చట్లే ఇవి_మౌనముద్రలన్నీ పద మంజీరాలైన వేళ...!! 

29.   ఆలోచనెక్కువే అక్షరానికి_మనసుని పదాల్లో మలిచేందుకు....!!

30.   తీరని దాహమే మరి_నెయ్యపు ఆనవాళ్ళ సామీప్యం...!!

11, నవంబర్ 2018, ఆదివారం

కంటిధార.....!!

పజ్రగిరి జస్టిస్ గారి అద్భుతమైన చిత్రానికి నా చిన్న ప్రయత్నంగా....

ఓపలేని భారాన్ని
వెన్నాడుతున్న గత గాయాలను
జ్ఞాపకాలుగా మార్చుతూ
మూసిన రెప్పల మాటున
వెతల వేదనను దాచేస్తూ
మది నింపుకున్న
కలల కడలి ఒంపిన
కన్నీటి చినుకులకు
తడిసిన చెక్కిలి
చెప్పిన మగువ మానసపు
విగత జీవపు మింటిధార
సెగల పొగల మెుదటిధార
ఈ కలకంఠి కంటిధార...!!

9, నవంబర్ 2018, శుక్రవారం

విధ్వంసానికి విరుగుడు...!!

పరమాణువులతో
ప్రకృతిని పరిహసిస్తూ
మానవ మేధస్సుకు గులామంటూ
అండపిండ బ్రహ్మాండాలను
అతలాకుతలం చేస్తూ
కృత్రిమ జీవితాల్లోబడి
జీవకణాలను నిర్వీర్యంగావిస్తున్న
ఆధునికత ఓ వైపు

పచ్చదనపు పరిచయాన్ని
ప్రాణాధారపు పలకరింతలను
స్వచ్ఛదనపు సాంత్వనను
కనువిందైన జీవితాన్ని
కోల్పోతున్న లోపాలనెత్తి చూపుతూ
మూలాధారాలను మరవద్దని
మాయల మత్తులో తూగొద్దని
పర్యావరణ పరిరక్షణ పరమావధి
సమాజ శ్రేయస్సుగా చెప్పాల్సిన
దుస్థితీనాడు

ఆద్యంతాల సృష్టి నడుమన
అవకతవకల అస్పష్టాకారాలకు
పరిపూర్ణతనందించే దివ్యౌషదం
కల్తీ ఎరుగని ఆకుపచ్చని అవని...!!

7, నవంబర్ 2018, బుధవారం

రెప్ప...!!

కనురెప్ప మూయని జీవితానికి
ఆ రెప్పల మాటున
మెదిలే కలలెన్నో
మదిలో కదలాడే బాసలకు
ఆలంబనగా నిలిచే
అనుబంధపు ఆసరాలెన్నో
వేవేల వర్ణాలద్దిన
ఊహలకు ప్రాణం పోసిన
స్వప్నచిత్రాల సౌందర్యాలెన్నో
గాయాలనోదార్చేందుకు
బతుకు పయనంలో
రాలిన కన్నీళ్ళెన్నో
కాలపు కనికట్టులో
దిగులు దుప్పటి దాచిన
రెప్పల చప్పుళ్ళెన్నో....!! 

6, నవంబర్ 2018, మంగళవారం

జీవన "మంజూ"ష (డిసెంబర్) ..!!

నేస్తం,
        అవసరాలకు అనుగుణంగా మనుష్యులు మారుతున్నారడానికి మనమే ప్రత్యక్ష సాక్షులుగా  మిగిలిపోతున్నాం. రక్త సంబంధాలను కూడా అవసరార్థ అనుబంధాలుగా మార్చేస్తూ ఆదాయపు బంధాలపై మాత్రమే ప్రేమలు ఒలకబోస్తూ బతికేస్తున్నామిప్పుడు. నేను అన్న స్వార్థం ఉండడం మనిషైన ప్రతి ఒక్కరికి సహజమే, కాని ఆ స్వార్థం  ఎంతగా పెరిగిపోయిందో చుట్టూ జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే మనం మానవ సమాజంలోనే ఉన్నామా అని ఓ సందేహమూ పొడచూపుతోంది. "మా ఇంటికి వస్తే ఏం తెస్తావు.. మీ ఇంటికి వస్తే ఏం పెడతావు" అన్న మనస్తత్వాలే ఇప్పుడు అన్ని. మన అవసరానికి మనం మారిపోతూ, ఆ మార్పే ఎదుటి వారిలో కలిగితే ఎదుటి వారిని తప్పు పట్టడం. పలకరింపు అనేది మనసు నుండి రావాలి కాని తెచ్చిపెట్టుకుని పలకరించడం కాదు. మనకు పలకరింపు దక్కలేదనో, గుర్తింపు దక్కలేదనో బాధ పడటం కాదు మనం ఇతరులను ఎంత వరకు గుర్తిస్తున్నామన్నది బేరీజు వేసుకోవాలి మనకంటూ ఓ మనస్సాక్షి ఏడిస్తే. మన ఇంటివాళ్ళు చేస్తే సబబు, అదే వేరే ఎవరైనా చేస్తే భరించలేని తప్పుగా చూడటం మానేసి తప్పుని తప్పుగా చెప్పగలిగే మనసు, నడవడి అలవర్చుకోవాలి. సూటిపోటి మాటలు తూలడం, అనుబంధాలను డబ్బు బంధాలుగా చూడటం కొందరికి వెన్నతో పెట్టిన విద్య. పైకి మాత్రం పూజలు, వ్రతాలు, గుళ్ళు గోపురాలు, భజనలు, సూక్తిసుధలు వినిపిస్తూ తమ లోపాయికారితనాన్ని నలుగురికి తెలియనీయకుండా తేనెల మాటలతో ముసుగులు వేసేస్తూ ఉంటారు. నటన అనేది ఎన్నో రోజులు దాగదు అని తెలిసినా భలే నటించేస్తూ బతికేస్తుంటారు. అనుబంధాలకు విలువలీయని వీళ్ళు ఎంత గొప్పగా నలుగురికి ఆత్మీయ బంధాల గురించి చెప్తారో, వీరిని పుట్టించిన ఆ  బ్రహ్మ కూడా నివ్వెరపోయేలా. కోపం, ఆవేశం వస్తే అమ్మాబాబు, అక్కాచెల్లి ఎవరినైనా ఏకిపారేస్తారు. ఆ సేవలు, ఈ సేవలంటూ దేవుళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు. పిల్లలను పట్టించుకోని తల్లిదండ్రులు, తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలు, వెలవెల పోతూ వెలిసిపోతున్న మూడుముళ్ల బంధాలు ఇవే ఇప్పటి కుటుంబ వ్యవస్థలు. దూరం పెరిగిపోతూ బీటలువారుతున్న అనుబంధాలు ఎక్కువైన నేటి ఆధునిక సమాజం మనది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు దిగజారిపోతున్న మానవ అనుబంధాలకు స్వయంకృతాపరాధాలెన్నో, ఇతర కారణాలెన్నో.. మార్పు మంచికో చెడుకో అర్థం కాని ప్రస్తుత వ్యవస్థలో ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో మారలేని మనసులు కొన్ని.. ఈ జరుగుతున్న సంఘటనలకు సాక్షులుగా మిగిలిపోతూ...

ఇప్పటికి ఈ ముచ్చట్లకు సశేషం... 
    

3, నవంబర్ 2018, శనివారం

సంతోషాల లోగిళ్ళు....!!

వజ్రగిరి జస్టిస్ గారి చిత్రాలకు ఓ చిన్న ప్రయత్నం.... ధన్యవాదాలు అండి మీ చక్కని చిత్రాలకు... 


కనుమరుగౌతున్న
సంప్రదాయపు నిధులు
గత వైభవ చిహ్నాలుగా

భట్రాజు పొగడ్తల
భజనాట్టహాసాల నడుమ
రంగరంగ వైభోగంగా

కాడెద్దుల సేద్యాల
కనువిందైన కర్షకుల హర్షాల
ఆనందాతిశయపు ఆహ్లాదాలుగా

చిరుజల్లుల సందడులు
చిట్టిపొట్టి చిన్నారుల అల్లరులతో
ప్రతి ఇంటి గడప కనుల పండుగగా

నాదస్వరాల ఆలాపనలు
హరిదాసు సంకీర్తనల గానాలతో
సిరుల సంతోషాల లోగిళ్ళు పల్లె జీవితాలు ఆనాడు

బోసిబోయిన ముంగిళ్ళు
బావురుమంటున్న అనుబంధాలతో
అతి అనావృష్టి పాలబడి బిక్కుబిక్కుమంటున్న బతుకులీనాడు...!! 

2, నవంబర్ 2018, శుక్రవారం

ద్విపదలు...!!

1.  అదే మాట
మన మనసులను పరిచయం చేస్తూ...!!

2.  మౌనమెప్పడూ మాటల్లోనే
మనసు పారేసుకున్న క్షణాల్లో దొర్లిపోతూ....!!

3.   ఆరాధనకర్ధం ఇదేనేమెా
నిరీక్షణనూ ఆస్వాదిస్తూ...!!

4.  అక్షరాలూ తొందర పడుతున్నాయి
పదాల ప్రవాహంలో కలవాలని...!!

5.   విడలేని అక్షర బంధమది
పదాలన్నీ నీతోనే ముడిబడినందుకనుకుంటా...!!

6.    వినిపించిన శబ్దమేదో వెంటాడుతోంది
గతజన్మ జ్ఞాపకాన్ని తలపిస్తూ...!!

7.   మనసెప్పుడూ ఇంతేనేమెా
మౌనాన్ని నీతో నింపి మాట్లాడించేస్తూ...!!

8.   చీకట్లో నక్షత్రాల వెలుగు
తప్పిపోయిన అనుబంధం వెదుకులాడుతూ...!!

9.   మనసు పుస్తకమింతే
మౌనపు ముచ్చట్లను అక్షరాల్లోనికి ఒంపేస్తూ...!!

10.   మనసు పడినందుకే ఈ మరులు
మరపు సాధ్యం కాదని తెలియక...!!

11.   అక్షరం మౌనవ్రతం వీడింది
మదిలోని మాటల వెల్లువకు...!!

12.   నిశ్శబ్దం ఇష్టంగా ఉంది
స్తబ్ధత నిండా నువ్వున్నావని...!!

13.   అలరించింది నీ రాగమే
అలవోకగా నిరీక్షణ గమకాలై....!!

14.   నిరీక్షణ ఓ రాగమైంది
నీ మదినలరించే మలయమారుతంగా...!!

15.   గెలిచింది అక్షరాలే
పడుతూ లేస్తున్న జీవితాన్ని అందుకుని...!!

16.   చదువుతోంది నిన్నే
గెలిచిన మనసుని అక్షరాలుగా మలుస్తూ....!!

17.   కలలే ప్రియం
నిన్నే చూపిస్తాయని...!!

18.   కథలే నయం
కబుర్లు పంచుతుంటాయలా....!!

19.   మనసాకలి అక్షరానికెరికయ్యింది
భావాల విందుకు సమాయత్తమౌతోంది అందుకే...
!!

20.   నిశ్శబ్దం నిష్క్రమించడం మర్చిపోయింది
నీతో నిండిన జ్ఞాపకాల క్షణాలను కాలానికి అప్పగించలేక...!!

21.  చేయందుకున్న క్షణాలివేగా
గుర్తెరిగిన మనసు గమనించి దగ్గరైనప్పుడు...!!

22.  కదిలిపోయేది కాలమే
కలిసిన క్షణాలను మనకు వదిలేసి....!!

23.   కన్నీటి వెచ్చదనం తాకింది
వేడిమి గుండె మంటదైనందుకేమెా...!!

24.  అక్షరాలతో గెలుపుబాటలు వేసుకుంటున్నా
అవమానాలను ఆయుధాలుగా చేసుకుని....!!

25.   పాతబడినా కొత్తదనమే ఎప్పుడూ
మనసు పడిన మాటైనందుకేమెా...!!

26.   మంత్రమూ లేదు తంత్రమూ లేదు
మనసు మైమరచి నవ్వుగా చేరిందంతే....!!

27.   పలుకులు పదిలమయ్యాయి
నీ మది సవ్వడి కలిసినందుకనుకుంటా...!!

28.   అక్షరమెుక శరం
సూటిగా తాకితే అణ్వాయుధమై జ్వలిస్తూ....!!

29.   మనసు రంగే అక్షరానిది
మమేకమైన భావాలకు రూపానిస్తూ...!!

30.   కథలెలా అల్లాలో మర్చిపోయా
కతే మనదని తెలిసాక..!!

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner