అవసరాలకు అనుగుణంగా మనుష్యులు మారుతున్నారడానికి మనమే ప్రత్యక్ష సాక్షులుగా మిగిలిపోతున్నాం. రక్త సంబంధాలను కూడా అవసరార్థ అనుబంధాలుగా మార్చేస్తూ ఆదాయపు బంధాలపై మాత్రమే ప్రేమలు ఒలకబోస్తూ బతికేస్తున్నామిప్పుడు. నేను అన్న స్వార్థం ఉండడం మనిషైన ప్రతి ఒక్కరికి సహజమే, కాని ఆ స్వార్థం ఎంతగా పెరిగిపోయిందో చుట్టూ జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే మనం మానవ సమాజంలోనే ఉన్నామా అని ఓ సందేహమూ పొడచూపుతోంది. "మా ఇంటికి వస్తే ఏం తెస్తావు.. మీ ఇంటికి వస్తే ఏం పెడతావు" అన్న మనస్తత్వాలే ఇప్పుడు అన్ని. మన అవసరానికి మనం మారిపోతూ, ఆ మార్పే ఎదుటి వారిలో కలిగితే ఎదుటి వారిని తప్పు పట్టడం. పలకరింపు అనేది మనసు నుండి రావాలి కాని తెచ్చిపెట్టుకుని పలకరించడం కాదు. మనకు పలకరింపు దక్కలేదనో, గుర్తింపు దక్కలేదనో బాధ పడటం కాదు మనం ఇతరులను ఎంత వరకు గుర్తిస్తున్నామన్నది బేరీజు వేసుకోవాలి మనకంటూ ఓ మనస్సాక్షి ఏడిస్తే. మన ఇంటివాళ్ళు చేస్తే సబబు, అదే వేరే ఎవరైనా చేస్తే భరించలేని తప్పుగా చూడటం మానేసి తప్పుని తప్పుగా చెప్పగలిగే మనసు, నడవడి అలవర్చుకోవాలి. సూటిపోటి మాటలు తూలడం, అనుబంధాలను డబ్బు బంధాలుగా చూడటం కొందరికి వెన్నతో పెట్టిన విద్య. పైకి మాత్రం పూజలు, వ్రతాలు, గుళ్ళు గోపురాలు, భజనలు, సూక్తిసుధలు వినిపిస్తూ తమ లోపాయికారితనాన్ని నలుగురికి తెలియనీయకుండా తేనెల మాటలతో ముసుగులు వేసేస్తూ ఉంటారు. నటన అనేది ఎన్నో రోజులు దాగదు అని తెలిసినా భలే నటించేస్తూ బతికేస్తుంటారు. అనుబంధాలకు విలువలీయని వీళ్ళు ఎంత గొప్పగా నలుగురికి ఆత్మీయ బంధాల గురించి చెప్తారో, వీరిని పుట్టించిన ఆ బ్రహ్మ కూడా నివ్వెరపోయేలా. కోపం, ఆవేశం వస్తే అమ్మాబాబు, అక్కాచెల్లి ఎవరినైనా ఏకిపారేస్తారు. ఆ సేవలు, ఈ సేవలంటూ దేవుళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు. పిల్లలను పట్టించుకోని తల్లిదండ్రులు, తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలు, వెలవెల పోతూ వెలిసిపోతున్న మూడుముళ్ల బంధాలు ఇవే ఇప్పటి కుటుంబ వ్యవస్థలు. దూరం పెరిగిపోతూ బీటలువారుతున్న అనుబంధాలు ఎక్కువైన నేటి ఆధునిక సమాజం మనది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు దిగజారిపోతున్న మానవ అనుబంధాలకు స్వయంకృతాపరాధాలెన్నో, ఇతర కారణాలెన్నో.. మార్పు మంచికో చెడుకో అర్థం కాని ప్రస్తుత వ్యవస్థలో ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో మారలేని మనసులు కొన్ని.. ఈ జరుగుతున్న సంఘటనలకు సాక్షులుగా మిగిలిపోతూ...
ఇప్పటికి ఈ ముచ్చట్లకు సశేషం...
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి