29, జనవరి 2020, బుధవారం

మరోసారి చెప్పించుకోవద్దు..!!

నేస్తాలూ,  
      పాపం తెలంగాణా నాయకులందరు హరిశ్చంద్రుడి చుట్టాలట..ఆంధ్రాలో వాడు భూదందాలో కోట్లు సంపాదించాడు, వీడు తరతరాలు తిన్నా తరగని సంపద సంపాదించేసాడని ఏడవడం కాదు...మా ఏడుపేదో మేమేడుస్తాం...గతంతో పోల్చుకుంటే ఈ ఆరేళ్ళలో ఆడపిల్లల మీద...ముసలి, ముతకా, పసిపిల్లల మీద ఎన్ని అఘాయిత్యాలు జరిగాయెా లెక్కలేసుకోండి.. పక్కోడి ఇల్లు కాలుతోంటే ఎకిలి నవ్వులు నవ్వటం కాదు గురువిందలూ. ఓ నాయకుడి ఇంట్లో కోడలు, పిల్లల సజీవ దహనం కేస్, డ్రగ్స్ కేస్, ఎమ్ సెట్ పేపర్ లీకేజ్ కేసులో ప్రధాన నిందితులను జైల్ లోనే హత్యలు చేయించి ఆత్మహత్యలుగా మార్చిన వైనం, మార్కుల అవకతవకలతో పిల్లల ప్రాణాలతో ఆటలాడిన వైనం...వీటికి కనీసం నైతిక బాధ్యత వహించని మంత్రులు...ఇవి మచ్చుకు కొన్ని...ఇలా చెప్పుకుంటూపోతే బోలెడు పురాణాలు... 
      కనుక చుట్టాలు.. 
మా పురాణాల సంగతి మేం చూసుకుంటాం.. ముందు మీ కొంపలు సక్కబెట్టుకునేడవండి. ఈ సందర్భంగా ఓ ముతక సామెత గుర్తు సేయక తప్పడం లేదు. " ఒకడికి పడి ఏడిస్తే ఓ కన్ను పోయిందట.. ఇద్దరికి పడి ఏడిస్తే .... ". అప్పనంగా వచ్చాయని అనుభవించడం కాదు. కష్టంలో ఎదుటివాడికి సాయం చేయకపోయినా పర్లేదు... ఎద్దేవా చేయకండి. రాయడం మెుదలెడితే మీకన్నా బాగా రాయగలం. ముందు మీ.. చూసుకోండి.తర్వాత తీరికగా మాగురించి విశ్లేషణ చేద్దురు. 

 

ఏ'కాంతా'క్షరాల సమీక్ష ఆంధ్రభూమిలో..!!

నా ఏ'కాంతా'క్షరాలు ఏక్ తారల పుస్తకంపై రాజా చంద్రశేఖర్ మానాపురం గారు ఆంధ్రభూమి వార్తా పత్రికలో రాసిన సమీక్షకు వారికి, ఆంధ్రభూమి యాజమాన్యానికి నా మనఃపూర్వక ధన్యవాదాలు...
  ఏకార్త అని అచ్చు తప్పుగా పడినందుకు, అది తెలియజేసినవారికి వినమ్రపూర్వక కృతజ్ఞతలు.  సృజనకర్త అని కాకుండా సృష్టి కర్తగా పొరపాటుగా అచ్చయింది. గమనించ మనవి. 

ఏక్తారల  ఏ'కాంతా'క్షరాలే ఈ చిరు కవితలు

                           - మానాపురం రాజా చంద్రశేఖర్
                                                  9440593910

     వర్తమాన కవిత్వం అనేక సాహితీ ప్రక్రియలకు ఊపిరి పోసి పలు లఘు కవితా రూపాలకు ప్రాణప్రతిష్ఠ చేసింది. వీటిలో అత్యాధునిక కవితా రూపమే " ఏక్తార ".దీని సృజనకర్త కవయిత్రి ' మంజు యనమదల '. 28 అక్షరాల పరిమితికి లోబడి, ఏక వాక్య కవితా ప్రయోగంతో వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.రెండు వాక్యాలను ఏక నిడివితో కలుపుతూ చిరు కవితలుగా మలిచి 'ఏక్ తారల'గా ఆవిష్కరించారు.గాఢత, స్పష్టత, సరళతలు వీటి ప్రత్యేకతలు. షడ్రుచులుగా చెప్పబడే తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు శీర్షికలతో ఈ లఘు కవితా ప్రక్రియను పరిపుష్టం చెయ్యగలిగారు.ఇవి రాశిలో కన్నా వాసిలో మిన్నగా అనిపిస్తాయి.అనుభవసారం నిండిన కవితాత్మక తాత్విక సత్యాల్ని తార్కికబద్ధంగా ధ్వనింపచేస్తాయి. నర్మగర్భితమైన జీవన సందేశాల్ని కళాత్మకంగా,  సున్నితంగా, సహజంగా, సాహిత్యపరంగా విప్పి కప్పి లోతైన భావాలతో ప్రతిఫలింపచేస్తాయి. మార్మికత పొడసూపే విభిన్న మానసిక సంఘర్షణల భావోద్వేగాలను, అనుభూతులను, సందర్భాలను ఒకచోట కుప్పగా పోసి, పాఠకులను అలరించి రసార్ద్రభరితం చేస్తాయి. స్వతహాగా భావుకురాలైన మంజు యనమదల వీటిని " ఏ'కాంతా'క్షరాలు " శీర్షికతో కవితాసంపుటిగా తీర్చిదిద్ది అందించారు.
     " నిరాశకు చరమగీతం - నిశిలో సైతం వెలుగు పూల వర్షం " అని చెబుతున్నప్పుడు- ఒక రకమైన ఆశావహ దృక్పథం తొణికిసలాడుతుంది. నిరాశను నిశికి ప్రతీకగా చేసి, వెలుగును ఆశావాదానికి ప్రతిబింబంగా నిలుపుతుంది ఈ ఏక వాక్య కవిత. ఈ కాంతి పూల వర్షం వెల్లువలో చైతన్యం వెల్లివిరిసి, చీకటిని పోలిన నిరాశకు చరమగీతం పాడవచ్చనే భావన ఈ స్వల్ప అక్షరాల్లో ధ్వనిస్తుంది. ఇదే ఈ వచనరచన పరమార్థం. ఇందులో తాత్వికత అంతర్లీనంగా ప్రవహిస్తుంది.
     " అమాయకత్వంలో ఆహ్లాదం - విడువలేని పసితనపు ఛాయలు " అంటూ మరోచోట కవిత్వీక రిస్తారు మంజు యనమదల. బాల్యం అంటేనే అమాయకత్వానికి ప్రతిరూపం. ఎలాంటి కల్మషత్వం ఎరగని సున్నితమైన పసిమనసుల నిర్మల మనోభావాలు ఇందులో ప్రతిఫలిస్తాయి. ఇలాంటి ఆహ్లాదకరమైన సన్నివేశాలు ఒక్క చిరుప్రాయంలోనే పసితనపు జ్ఞాపకాలుగా ఊగిసలాడుతూ కడదాకా వెంటాడతాయి. ఈ సందర్భాన్నే ఇక్కడ కవయిత్రి కవిత్వమయం చేసింది. దీనిలో సజీవ శాశ్వత జీవ లక్షణం ఉట్టిపడుతుంది.
     " స్వప్నమూ మెలకువలోనే - గాయాలను నిదురపుచ్చలేక " అని వాపోతున్నప్పుడు నిలువెల్లా గూడుకట్టిన మానసిక జీవ సంఘర్షణతో సుడులు తిరుగుతున్న వేదన అడుగడుగునా వర్ణనాతీతంగా మిగిలిపోతుంది. ఈ రంపపుకోతలో స్వప్నం కూడా నిద్రాణ స్థితిలాంటి మెలకువలోనే ఊగిసలాడుతూ గాయాల సమస్యలకు పాదు కడుతున్న సందర్భంలోనివి ఈ కవిత్వపంక్తులు. కాబట్టే క్షణక్షణ నరకయాతన మౌన సందిగ్ధ మూగ మానసిక స్థితికి ఇది దర్పణం పడుతుంది. 
     " చుక్కల సందడితో - గగనమంతా నవ్వులే " అంటున్నపుడు భావుకత పరాకాష్టకు చేరుకుని వెన్నెలనవ్వుల్ని కురిపిస్తాయి. వెన్నెల ఆహ్లాదానికి సంకేతం. చల్లదనానికి ప్రతిబింబం. ఇది ఆకాశంలో పరుచుకుని చుక్కల మధ్య కాంతివంతంగా మెరిసి పోతుంటుంది. ఈ తారల మెరుపుల సందడికి గగనమంతా విచ్చుకున్న నవ్వుల విశ్వంగా మారిపోతుంది. ఈ దృశ్యం చూపరులకి కనువిందుగా మారి అనుభూతితో మమేకం చేస్తుంది. దీనినే సందర్భోచితంగా సౌందర్యారాధనా దృష్టితో కవయిత్రి చిత్రిస్తారు.
     " ముక్కలైన మనసులో - ఎక్కడ చూసినా నీ ప్రతిబింబమే " అంటారు ఇంకోచోట మంజు. ఈ పలుకుల్లోని అంతరార్థాన్ని గ్రహిస్తే, తునాతునకలైన మనసు బీభత్సాన్ని ఉద్వేగభరితంగా కళ్ళకి కట్టిస్తారు ఈమె. గాయపడి ఛిద్రమైన సన్నివేశాల్ని విఫలమైన సంఘటనల కోవలోంచి ఎత్తిచూపి అవతలివారిని దోషిగా, మూలకారకులుగా సందర్భీకరించే ప్రయత్నంలోనిది ఇది. చాలా హృదయవిదారకంగా కవిత్వీకరిస్తారు.
     ఇంకో చోట- " నిలబడే ఉంది - నీడలో నిజం " అనడం వెనుక సజీవమైన ఒక భౌతికసత్యాన్ని తర్కబద్ధమైన కోణంలో ఆవిష్కరిస్తారు. నిప్పు లాంటి నిజం నిలబడే నీడలో దాగివుందనే స్పృహను తేటతెల్లం చేస్తారు. ఇది పైకి కనీ కనిపించని వాస్తవమే అయినా అంతర్లీనంగా ధ్వనించే అర్థాన్ని చాలా నర్మగర్భితంగా మార్మికతతో విడమర్చి చెబుతారు కవయిత్రి.
     " ఒక్కో చినుకే - వేల జీవాలకు ప్రాణాధారంగా " అంటూ చెప్పినపుడు జీవకోటి మనుగడకి ఆధారభూతమైన చినుకుచుక్క ఉనికి ఈ లోకానికి ఎంతవసరమో స్పష్టంగా విపులీకరిస్తారు. తాగడానికీ, జీవజాలం మొలకెత్తడానికీ, శుభ్రపరుచుకోవడానికీ నీటి ఆవశ్యకత ప్రాధాన్యతను తెలియజేస్తారు. జలం లేనిదే ప్రాణి బతికి బట్టకట్టలేదు. ఈ విషయాన్ని నొక్కి చెప్పడానికి దీనిని ఒక సందర్భ ప్రయోజనంగా భావించాలి.
     వీటితోపాటు కవితాత్మక వాక్యప్రయోగాలు ఈ సంపుటిలో కోకొల్లలుగా దర్శనమిచ్చి సృజనాత్మకతకు గీటురాయిగా నిలుస్తాయి. మచ్చుకు వీటిలో కొన్నింటిని రుచి చూద్దాం. ' చుక్కల దుప్పటి ఎగిరిపోయింది ' , ' కాలం రాల్చిన కలలు ' , ' మౌనం మాటలు పరిచింది ' , ' వెన్నెలకే వర్ణాలన్నీ ' , ' అసూయ నల్లపూసైoది' , ' సరిగమలు ఒలికి పోయాయి ' , ' నిరీక్షణ ఓ రాగమైంది ' , ' ఒళ్ళంతా కళ్ళుగా మారిన క్షణాలు ' , ' వెన్నెల ఆరబెట్టుకుంటోంది ' , ' గాయపడ్డ వేణువు గానం ' , ' రెప్పచాటు స్వప్నాలు ' , ' చీకటి చిరునామా చెరిగిపోయింది ' , ' రాలుతున్న పూల రాగాలు ' , ' వాలిపోతున్న పొద్దులో వర్ణాలు ' , ' మనసు చెమ్మ మదిని తాకింది ' , ' పగిలింది నిశ్శబ్దం ' , ' చిరు స్పర్శే విశ్వమంతగా మారింది ' , ' పిలుపు పిల్లనగ్రోవిలో సాగి ' , ' వెన్నెల దోసిళ్ళలో ఒదిగిపోయింది ' , ' పెదవి అంచున చిరునవ్వవుతావా ' , ' మౌనమూ మాటలు కలిపింది ' , ' నీ నవ్వుల్లో రాలిన ముత్యాలు ' , ' తూరుపు సిందూరమై మెరుస్తోంది ' , ' అనంతమై నన్ను చుట్టేశావు ' , ' సంతోషం ఉప్పెనయ్యింది ' , ' హృదయం చేజారిపోయి ' , ' తాకినది మది మౌన తరంగం ' , ' గుండె గొంతు విప్పింది ' , ' చిరునవ్వుల మౌనాన్ని నేను ' , ' నేల రాలినా నిత్య పరిమళమే ' , ' కలం కాలాన్ని సిరాగా ఒంపుకుంటుంది ' , ' గెలిచిన మనసుని అక్షరాలుగా మలుస్తూ ' , ' గువ్వల్లా ఒదిగిన జ్ఞాపకాలు ' , ' మువ్వలా ముడుచుకుంది ' , ' నిశిని చుట్టేసిన వెన్నెల' , ' మంచులా నీ మనసెంత చల్లన ' , ' పున్నమి వెన్నెలే చెలి సింగారాలు ' , ' అక్షర సంచారమే జీవితం ' వంటి కవిత్వ పరిమళాలు సహజంగానే మనసుని హత్తుకుంటాయి. ఇలా బహుముఖ అంశాల వెల్లువలో సేదతీరిన ఈమె కవిత్వం ' ఏక్తారల ఏ'కాంతా'క్షరాలుగా కొలువుదీరి సామాజిక చైతన్యాన్ని ఉద్దీపింపచేస్తుంది. లోతైన భావజాలంతో పలు పార్శ్వాలకు అక్షరాలతో ఊపిరి పోసిన కవయిత్రి మంజు యనమదలకు సాదర ఆహ్వానం పలుకుతూ పాఠకలోకంలోకి స్వాగతిద్దాం.

25, జనవరి 2020, శనివారం

సేవ సంక్రాంతి కవితల పోటి..!!

    సేవ సంస్థ నిర్వహించిన సంక్రాంతి కవిత పోటికి నన్నో న్యాయ నిర్ణేతగా చేసిన కంచర్ల సుబ్బానాయుడు గారికి మనఃపూర్వక ధన్యవాదాలు.
    సంక్రాంతికి చక్కని కవితలతో గత జ్ఞాపకాలను గుర్తు చేసి సంకురాతిరి సంబరాలను అక్షరాల్లో చూపించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. 
   ఒకే వస్తువుపై విభిన్నమైన శైలితో ప్రతి ఒక్కరూ కవిత్వీకరించిన తీరు బాగా ఆకట్టుకుంది. న్యాయ
నిర్ణయం చేయడం చాలా కష్టతరమైంది. న్యాయ నిర్ణయం ఎవరిని వారిది విభిన్నంగా ఉంటుంది. దయచేసి తప్పుగా అనుకోకండి. ప్రతి కవితా చక్కగా ఉంది. విజేతలు కొందరే కనుక అన్నీ ఎంపిక చేయలేము. 
      నా పరిధిలో నాకనిపించిన విధంగా తృతీయస్థాన  కవితలను సంక్షిప్తంగా సమీక్షిస్తాను. 

    ఆనాటి సంక్రాంతి ఎలా మెుదలై ఎంత వైభవంగా పెద్దలు, పిన్నలు సంబరాలు చేసుకునేవారో,  ఎన్ని ముచ్చట్లు మురిపాలు పంచుకునేవారో, ఆటలో అల్లరి, పాటల సందడిని గుర్తు చేస్తూ ఆధునిక సంక్రాంతిని పోల్చుతూ..కోల్పోతున్న ఆనందాలను తిరిగి తెమ్మని కోరుతూ సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలికిన అక్షర తోరణం శ్రీ షేక్ మహమద్ రఫీ గారికి అభినందనలు. 
   సంక్రాంతి సొగసులను సొగసైన వర్ణనలతో వివరిస్తూ, తాయిలాల తీపిని రుచి చూపిస్తూ, పాడిపంటల పల్లె జీవితాలను వల్లెవేస్తూ, కలసి ఉండే కలదు సుఖమని గుర్తుచేస్తూ, రైతన్న గొప్పదనాన్ని, మన సంస్కృతీ సంప్రదాయాల విలువను తెలిపిన అందమైన కవితాఝరిని మన మనసులపై అందంగా ముద్రించిన శ్రీమతి మాధవి శ్రీనివాస్ నందిమళ్ళ గారి సొగసైన సంతకం సంక్రాంతికి అభినందనలు.   
      హేమంతపు అందాలను కనుక ముందు నిలుపుతూ, చక్కని పదాల అమరికతో, సంక్రాంతి సంబరాలను అక్షర రంగవల్లులతో అలంకరించి, మానవత్వపు మమకారాలను రుచి చూపిస్తూ, ఎప్పటెప్పటి జ్ఞాపకాలకో...మళ్ళీ తన అక్షరాలతో జీవం నింపి, అందమైన బొమ్మల కొలువుగా మన ముందుకు వచ్చిన వెలుగు తోరణం వెన్నెల కాంతి ఈ సంక్రాంతిని అందించిన ఘాలి లలిత ప్రవల్లిక గారికి అభినందనలు. 
      ఈ పోటిలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజేతలే. చదివిన ప్రతి కవితా బోలెడు జ్ఞాపకాలను గుర్తు చేసింది. అందమైన అమాయకమైన బాల్యాన్ని మరోసారి అందించింది. నాకు ఈ అవకాశానిచ్చిన కంచర్ల సుబ్బానాయుడు గారికి ధన్యవాదాలు. 

ఆత్మీయులు పుస్తక సమీక్ష..!!

      " అనుబంధాలకు వారధి ఆత్మీయత "
   ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తుల్లో డాక్టర్ లక్ష్మీ రాఘవ ఒకరు. ఈవిడ కథలు నేల విడిచి సాము చేయవు. మన చుట్టూ ఉండే సమస్యలనే కథా వస్తువులుగా తీసుకుని ఏక బిగిన చదివించే శైలి ఈమె సొంతం. ఎన్నో పురస్కారాలు అందుకున్న కథలు మరో కథా సంపుటి "ఆత్మీయులు" గా రావడం ముదావహం. 
            అవయువదానం గొప్పదనం తెలిపే కథ ఆత్మీయులు. ఎదుగుదల ఉన్న ప్రతిచోట మార్పు అవసరమంటూ ఆధునికను అందిపుచ్చుకోవాలని చెప్పే కథ ఆచరణ. అందరూ ఉండి అనాథల్లా మిగిలిపోతున్న ఎందరో తల్లీబిడ్డల కథ ఒక అమ్మ కథ. ఆపదలో ఉన్నప్పుడు మానవత్వం, మంచితనంతో చేసే సాయం విలువ తెలిపే కథ సహాయం. కొత్తవారి మాటలు నమ్మి ఎలా మెాసపోతామెా తెలిపే కథ చీరలు. అమ్మ అవసరమైతే దుష్ట శిక్షణకు అపరకాళిగా మారుతుందని కన్న కొడుకును కూడా క్షమించదని ఆమె ఒక శక్తి కథ బుుజువు చేస్తుంది. ఒకరి సాహిత్యం గురించి విమర్శ చేసేటప్పుడు, వారు ఆ విమర్శకు సమాధానం చెప్పే విధం అభిప్రాయం కథలో చదువుతున్నప్పుడు నాకు ఎదురైన విమర్శలు గుర్తులు వచ్చాయి. చాలీచాలని బతుకుల్లో కష్టాలు చెప్పకుండా వస్తే ఆదుకునే అనుబంధాలను చూపించి కథ ఆటో. నూటికి తొంభైతొమ్మిది మంది అమ్మలకు ఎదురయ్యే సమస్యే అమ్మ ప్రేమలో తేడా కథ. పుస్తకం మనసు తెలిపిన కథ నేను. రైలు పట్టాలు చెప్పిన జీవిత సత్యాలు విప్పి చెప్పిన కథ ఇదేమి న్యాయం. తోటలో ఒక రోజుంటే పూల మనసు తెలుస్తుంది. కన్నవారి మీదే కాకుండా పుట్టిన గడ్డ మీద మమకారంతో ఓ ఆడపిల్ల చెప్పిన మాటల ముత్యాలే ఆడపిల్ల ఆలోచన కథ. అమాయకులతో ఆడుకున్న అవయువదానాల బడాబాబుల కత దానం. ముక్కుపుడక మనసు తెలిపే కథ ముక్కుపుడక. మన ఇష్టాలు, అభిప్రాయాలు బలవంతంగా ఎదుటివారిపై రుద్దకూడదని సున్నితంగా చెప్పిన కథ బోధన. పెద్దావిడను మలి వయసులో బాగా చూసుకోవాలన్న కొడుకు, కోడలు, మనుమరాలికి ఎదురైన చేదు అనుభవం ఏమిటో నానమ్మ కథలో తెలుస్తుంది. అవసరానికి వాడుకొనే మనుషులు కొందరైతే అడగకుండానే సాయం చేసే మానవతామూర్తులు మరికొందరని చెప్పే కథే టెంపరరీ. ఇల్లాలు కథలో ఇంటి ఇల్లాలి ఉద్యోగ బాధ్యతలు, జీత బత్యాల గురించి ఇంటాయన చెప్పడం చాలా బావుంది. కొన్ని సమస్యలకు దేవుడు చూపించే పరిష్కారాలు మానవ మేధస్సుకు అందవని దేవుడిచ్చిన తోడు కథ బుుజువు చేస్తుంది. డబ్బు మాయలో బతుకుతున్న ఈరోజుల్లో రక్త సంబంధానికి, బాధ్యతలకు విలువనిచ్చిన అన్నదమ్ముల కథ ఆలోచన. కూటి కోసం కోటి తిప్పలన్నట్టు జానెడు పొట్టకు ముద్ద కోసం వేసే వేషాలు, చేసే వ్యాపారాల గురించి తెలిపే కథ గాంధీగారు గాయపడ్డారు. ఓ అమ్మ బిడ్డల మధ్యే వయసు తారతమ్యం ఎన్ని చిక్కులను తెస్తుందో తెలిపే కథ ఎడం. 
       తేలిక పదాలతో, వర్ణన అవసరం లేని ఇతివృత్తాలతో సూటిగా చదువరుల మనసును తాకేటట్లుగా కథలు రాయడం డాక్టర్ లక్ష్మీ రాఘవ ప్రత్యేకత. సమాజంలో సమస్యలను సున్నితంగా చెప్తూ, తనదైన రీతిలో పరిష్కారం చూపిస్తూ ఎన్నో సమస్యలను తన కోణంలో విశ్లేషిస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. మనసు పెట్టి వింటే పూలు, పక్షులు, జంతువులు, చెట్లు చేమలు కూడా కథలు చెప్తాయని డాక్టర్ లక్ష్మీ రాఘవ  నిరూపించారు తన కథా సంపుటాలతో. చక్కని కథలను అందించిన డాక్టర్ లక్ష్మీ రాఘవకు హృదయపూర్వక అభినందనలు. 

22, జనవరి 2020, బుధవారం

మీ బాధేంటి తమ్ముళ్ళు...!!


      అక్కయ్యా అంటూ ఎంత పద్ధతిగా చెప్పారు తమ్ముళ్ళు. కృతజ్ఞతలు మీ ఓర్పుకి, సహనానికి. స్త్రీల పట్ల మీకూ, మీ నాయకులకు ఉన్న గౌరవాన్ని ప్రపంచం యావత్తు చూశారు, చూస్తున్నారు. హుందాతనం అనేది జాతి లక్షణం. వెకిలితనం అనేది  పెరిగిన పరిసరాల, వ్యక్తుల ప్రభావం. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా ప్రపంచమంతా చూసారు.            
      ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మునుముందుకి దూసుకుపోతోందని యావత్ ప్రపంచం గుర్తించేసింది. మన పొరుగు దొర రాష్ట్రం పాకిస్తాన్ మన పురోగమనానికి అసూయతో కుళ్ళి పోతోంది. వ్యక్తిపూజలు, పార్టీ పూజలు వ్యక్తిగతాలు. వాటిని కాదనే హక్కు ఎవరికి లేదు. కానీ కళ్ళ ముందు కనబడుతున్న నిజాలను దాయడం ఎంతో కష్టం. మీరు నిజంగా ఆంధ్రులే అయితే వాస్తవాన్ని ఒప్పుకోండి. 

      ఒకే ఒక్క నిజాన్ని ఫార్వర్డ్ చేసినందుకు సమస్త స్త్రీ జాతి మీద మీకున్న గౌరవాన్ని ప్రత్యక్షంగా అనుభవించినదాన్ని. మీ మాట తీసేయగలనా వై చీప్ తమ్ముళ్ళు. నేను మీలాగా కోడికత్తి బాచ్ కాదు... మీ బెదిరింపులకు భయపడటానికి. ఏం చేస్తారు మహా అయితే నాలుగు చెత్త వీడియెాలు, బూతులు ఇంతేగా మీ పేటియం బతుకులు. నాలుగు ముక్కలు రాస్తేనే తట్టుకోలేకపోతున్నారు, మరి మీ ప్రవర్తన ఎలా ఉందో చూసుకోండి తమ్ముళ్ళు.

20, జనవరి 2020, సోమవారం

వెలుగు రేఖలు..!!

1.  అంతే 
అహంకారం 
మిడిసిపాటూనూ

క్షణం వెనుక కనబడితేనే గుర్తులేదు
ఇక నిన్నటి సంగతేంటబ్బా..!!

2.  పెళ్ళాం
మారినప్పుడల్లా
మెుగుడి పేరు మారినట్టు

అధికారం తల్చుకుంటే
కానిదేముంది మరి...!!

3.   సమయం
ఎప్పుడూ 
ఒకరిదే కాదు

లెక్కల పద్దు
సరి చూసేవాడు పైవాడు...!!

4.    బుద్ధి 
ఉంటేనే కదా
మంచి చెడు తెలిసేది

మనిషిజన్మ
ఎత్తిన వాడైతేగా..!!

పారదర్శక పాలన..!!

ఎన్నికల ముందు హామీలేమైనా అడిగితే మేనిఫెస్టోలో లేవన్న సదరు గౌరవనీయులు మూడు రాజధానుల ముచ్చట జెప్పి ఓట్లు అడగలేదెందుకో.. ఒక సామాజిక వర్గం మీద జల్లుతున్న బురద నీకే అంటుకుంటుంది.. లెక్కలు పైవాడు సరి చేస్తాడు గౌరవనీయా.. కేంద్రం సపోర్టుతో దొరవారి బంటు పాలన ఇదే... ఓట్లు అమ్ముకున్న ఫలితమిది కృష్ణాగుంటూరు వారికి జరిగిన సన్మానమిది...

19, జనవరి 2020, ఆదివారం

నా బ్లాగు పుట్టినరోజు...!!

      2009 జనవరిలో రాయడం మెుదలై..నేటికి 1818 పోస్టులతో పాటు...ముఖపుస్తకంలో దశాబ్దం కూడా పూర్తి చేసుకున్న నా బ్లాగు " కబుర్లు కాకరకాయలు " కాస్త చేదుగానే ఉంటుందని నేను ఒప్పుకుంటున్నా. 

    మా ట్రస్ట్ ఉప్పల రాజ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ కోసం వెతుకుతూ నేను ఈ బ్లాగుల గురించి తెలుసుకున్నా. ట్రస్ట్ బ్లాగ్ తో పాటు ఈ కబుర్లు కాకరకాయలు బ్లాగ్ కూడా మెుదలెట్టాను. చిన్నప్పటి నుండి పుస్తకాల పురుగునైన నాకు అనిపించిన ప్రతిదీ రాయడం అలవాటైంది.
     ముఖపుస్తకంలోనికి నా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ కోసం వచ్చిన నాకు వాళ్ళతో పాటుగా ఎందరో ఆత్మీయులు, స్నేహితులు, కొద్దిమంది శత్రువులు దొరికారు. అభిప్రాయ బేధాలున్నంత మాత్రాన శత్రువులం కాదు. స్నేహంగా నటించి ద్రోహం చేయడం మెాసం. ఎదుటివారి ఆలోచనలను అపహాస్యం చేయడం.. అది కుల, మత, ప్రాంతీయత, రాజకీయంగా, జాతి పరంగా విద్వేషాన్ని వెళ్ళగక్కడం మన నీచత్వం.
     నన్ను నా రాతలను అభిమానించే ప్రతి ఒక్కరికి నా మనఃపూర్వక కృతజ్ఞతలు🙏.

పరిధి..!!

నేస్తం, 
        నాకు తెలిసి జీవితంలో సమస్య లేకపోవడము కూడా ఓ పెద్ద సమస్యే. ఒక్కోసారి మన ఆలోచనా ధోరణి ఎంత విపరీతంగా ఉంటుందంటే...ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూడటం, మన కోణంలో మాత్రమే ఆలోచించడము పరిపాటై పోయింది. మన ఒంటరితనం మరొకరికి శాపం కాకూడదు. ఎదుటివారి సమయాన్ని మనం శాసించే హక్కు లేదు. ప్రేమ, విరహం, విరసం, కోపం ఇలా ప్రతి అనుభూతి ఆహ్లాదంగా ఉండాలి కాని వన్ వే లో ఉంటే భరించడం కష్టం. కాస్త వెగటుగా కూడా ఉంటుంది. పలకరింపు అనేది బాధను మర్చిపోయేదిగా ఉండాలి కాని బాధించేదిగా, భయపెట్టేదిగా ఉండకూడదు. 
       అక్కా అని, అమ్మా అని పిలుస్తూనే విషం కక్కే వెధవలు కోకొల్లలు. స్నేహాన్ని నమ్మి ఇంటి మనిషిగా అందరికి పరిచయం చేస్తే ఆ ఇంటినే అల్లరిపాలు చేసిన ఓ సూక్తిసుధ. స్నేహం, అభిమానం హద్దులు దాటకుండా ఎవరి పరిధిలో వారుంటే అందరికి మంచిది, తర్వాత బాధ పడాల్సిన అవసరం ఉండదు. ఇప్పటి అమరావతిలా. 😊

17, జనవరి 2020, శుక్రవారం

మధుర జ్ఞాపకం...!!

పసిడి మనసుల 
పండు వెన్నెల నవ్వుల
ఆడీపాడే ఆకతాయి వయసది

కడలి హోరులా
కలల జలతారులా
కడు రమ్యమైనది

తారతమ్యాలెరుగని
తేనెలూరు పలుకుల
తప్పటడుగుల లేబ్రాయమది

మరల రానిది
మరపు రానిది
మధుర జ్ఞాపకమీ బాల్యం...!! 




9, జనవరి 2020, గురువారం

ఏక్ తారలు..!!

1.   అహమూ అలంకారమే_అతిశయం పోయే అక్షరానికి...!!

2.    మనసుకెంత మెామాటమెా_మౌనాన్ని విప్పి చెప్పడానికి..!!

3.   ఇష్టంగా ఇష్టపదులు లిఖిస్తున్నాయి_అక్షరాలు అష్టపదులతో అలసిపోయి...!!

4.  మాట కూడా మౌనమైంది_నీ అలికిడి లేకేమెా..!!

5.   రాయకుండా ఎలా ఉండను_ఊపిరే అక్షరంతో ముడిబడితే...!!

6.   కాలాన్ని మాయం చేసే మంత్రం_అక్షరాల అనుబంధంలోనే...!!

7.   కాలానికెంత ఉక్రోషమెా_పరుగులెత్తే క్షణాలను పట్టుకోలేక...!!

8.   ఘడియలకెంత అనురాగమెా_నిరంతరం క్షణాలతోనే గడిపేస్తూ..!!

9.   వెనుకబడిందో మనసు_అక్షరంతో పోటి పడలేక..!!

10.   మౌనానికేం పని_గుండె గోడులన్నీ వినడానికి...!!

11.   అల్లరి అక్షరాలది కాదు_మనసును ఉసిగొలిపే భావాలది..!!

12.  మనసుకి మౌనానికి లంకె కుదరటం లేదట_గుండె గుబులుకి తల్లడిల్లి..!!

13.  సశేషమెప్పడూ చెప్పాలనుకున్న కథకు నాంది_విశేషంగా వివరించడానికి...!!

14.   గతాన్ని గుర్తెరుగని జన్మ  ఇది_అహంతో ఆధిపత్యం నాదేనంటూ...!!

15.   పరిపాటయ్యింది ఏకాంతం కాదు_నాతో నువ్వుంటావన్న అశతో..!!

16.    మనోవేదన తెలిపేది కనులే_అక్షరాలకది ఎరుకే...!!

17.   చేరాల్సిన గమ్యమెుకటే_ఏ దారెటు పోయినా...!!

18.    సందేహమే మనసుకి_ఏ స్నేహం ఎటుపోతుందోనని..!!

19.   మనసు తెలిపే మాటే ఇది_మౌనాన్ని అక్షరాల్లో వొంపేస్తూ..!!

20.   మనసు మిగిలిపోయిందిలా_అక్షరం అలిగెళ్ళాక..!!

21.   పేదరికం పెదవులది కాదట_విప్పి చెప్పనివ్వని మనసుదట...!!

22.   తలవని క్షణమే లేదు_కన్నీరుగానో పన్నీరుగానో..!!

23.   మజిలీకి స్థానమెక్కడ_నా గమ్యమే నీవైతే..!!

24.  మరేజన్మకయినా మన చెలిమింతే_చెల్లుబాటు చెల్లదంటూ..!!

25.   క్షణాలకు తీరికెక్కడా_నిలువని కాలంతో పరుగులిడితూ...!!

26.   సర్దుబాటులోనే సంతోషమంతా_ దిద్దుబాటుతో దిగులును దిద్దేస్తూ..!!

27.     నాతో ఉన్న నీ జ్ఞాపకాలకు తెలియదట_మరుపెలా ఉంటుందో...!!

28.   జ్ఞాపకాలను దాయడానికి మది పుష్పక విమానమే_గుండె గుప్పెడయినా..!!

29.   మలిసందెకు మరులయ్యిందట_వేకువరాగాన్ని బుజ్జగించమంటోది...!!

30.   తడిమేదెప్పుడూ నీవేగా_కలతగానో కలగానో మిగులుతూ..!!

అనితరసాధ్యుడు.. !!

            అసాధ్యాన్ని సుసాధ్యం కొందరే చేసుకోగలరు. ఆ కొందరిలో అగ్రగణ్యుడు ఎమ్ ఎన్ ఆర్ గుప్త. అకుంఠిత దీక్షతో అతి పిన్న వయసులోనే 40 ఏళ్ళకు 80 ఇంటర్నేషనల్ అవార్డులు సాధించి ప్రపంచానికి తన ఉనికిని పరిచయం చేసిన అనితరసాధ్యుడు ఎమ్ ఎన్ ఆర్ గుప్త.
    క్రియేటివ్ ఇండియా - పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2019 గా ఓ తెలుగోడు, అదీ వెనుక ఏ అండా, అధికారం లేని అతి సామాన్యుడు తనకున్న అపారమైన తెలివితేటలతో, వాగ్దేవి ఆశీస్సులతో గెలుచుకుని తెలుగువాడి ఖ్యాతిని దిగంతాలకు వ్యాపింపజేసారు. ప్రతిభకు కొలమానం గుర్తింపు అయితే ఆ గుర్తింపు మెండుగా ఉన్న సరస్వతీ మానసపుత్రుడీయన. తన ప్రతిభతో ప్రపంచ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో పది ప్రపంచ రికార్డులను తిరగరాసి జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ (లండన్). వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ లలో స్థానం సంపాదించుకున్న ఏకైక తెలుగు ఇంజనీర్, జూనియర్ మెాక్షగుండం విశ్వేశ్వరయ్య,
అపర మేధావి అన్న పదానికి సరైన అర్థం ఎమ్ ఎన్ ఆర్ గుప్త.
           అమెరికా, దుబాయ్, యూరప్, కువైట్, ఒమన్, భారతదేశాలలో గడచిన 15 ఏళ్ళలో 80 ఇంటర్నేషనల్ అవార్డులను గెలుచుని చరిత్ర సృష్టించడమే కాకుండా యుకే కి చెందిన ఐటిపి గ్రూప్ కంపెనీస్ నుండి వెలువడే ప్రపంచ ప్రఖ్యాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్్ట్రక్షన్ వీక్ వారు ప్రతి ఏటా అందించే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో అన్ని కేటగిరీలలో 2012 నుండి  2016 వరకు కన్ స్ట్రక్షన్ ఇంజనీర్  ఆఫ్ ది ఇయర్, ప్రాజెక్ట్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ 195 దేశాల ఇంజనీర్స్ తో పోటి పడి వరుసగా గెలుచుకోవడం ప్రపంచ చరిత్రలో ఏ ఇంజనీర్కి సాధ్యం కాలేదు. ఆ ఘనత మన తెలుగువాడు భీమవరం బుల్లోడు అయిన ఎమ్ ఎన్ ఆర్ గుప్త సాధించడం తెలుగుజాతికి గర్వ కారణం.
     ఎక్కడో తెనాలిలో పుట్టి ఈనాడు ప్రపంచంలో గుర్తింపు పొందిన అతి కొద్ది మంది మేధావుల్లో ఒకరు శ్రీ ఎమ్ ఎన్ ఆర్ గుప్త. మిడిల్ ఈస్ట్ దేశాల్లో లెక్కకు మించి పురస్కారాలు.. ఆ దేశపు రాజరికపు అధికారుల మెప్పును పొందిన ఏకైక వ్యక్తి... ఈ పురస్కారాల రికార్డుల వెనుక ఓ జీవితపు ఆటు పోట్లు ఎలా విజయానికి సోపానాలుగా మారాయో... నేటి యువ తరానికి స్పూర్తిదాయకంగా నిలిచిన యువ మేధావి శ్రీ ఎమ్ ఎన్ ఆర్ గుప్త గారి గురించి...సామాన్య కుటుంబం నుంచి వచ్చి, చిన్నతనం నుంచి చదువులో మేటిగా ఎదిగి ఉన్నత విద్యను NIT Warangal MTech( Transportation) లో అభ్యసించి స్వదేశంలో కొన్ని రోజులు పని చేసి తరువాత తన ప్రతిభకు తగిన గుర్తింపు కోసం ఒమన్ దేశంలో Dec 2003 లో తన ప్రస్థానాన్ని పెట్రోలియం ప్రాజెక్టులో ప్రాజెక్ట్ ఇంజనీరుగా మొదలు పెట్టి ఒమన్ లో ఇన్ ప్రాస్ట్రక్చర్ రంగంలో రెసిడెంట్ ఇంజనీరుగా పనిచేస్తూ అనుకున్నది సాధించి ఈ రోజున ఎమ్ ఎన్ ఆర్ గుప్త ఆంటే తెలియనివారు లేరని నిరుపించుకున్న ఘనులు...సమస్యకు భయపడక మీ సమస్యను నాకొదిలేయండి... పరిష్కారం నేను చూపిస్తా అన్న ఆత్మ విశ్వాసం ముందు ఎంతటి సమస్యైనా తలను వంచక తప్పలేదు... అది ఎమ్ ఎన్ ఆర్ గారి ఆత్మ విశ్వాసం....  
         ఎప్పటికైనా భారత దేశం సూపర్ పవర్ గా ఎదగాలని నిరంతరం కష్టపడి పదిహేడు ఏళ్ళు అనేక ప్రపోజల్స్(సిద్దాంతాలు) రూపొందించి సమాజం అభివృద్ధి చెందటానికి అత్యంత కీలకమైన రంగం మౌలిక సదుపాయాలు అందించడం అని బలమైన వాదన వినిపిస్తూ..." Development of Transportation sector to reach vision 2020"  ప్రత్యేక ప్రపోజల్ రూపొందించి... అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి 2002లో అందచేశారు. చంద్రబాబు ఆనాడు చాలా ఘనంగా ప్రచారం సాగించుకున్న విజన్ 2020 ప్రోగ్రాంలో గుప్త ప్రతిపాదించిన సిద్ధాంతాలను యధాతథంగా వినియోగించుకున్నారు.ఇవే కాకుండా 2003లో కర్నాటక ముఖ్యమంత్రిగా ఎస్ ఎం కృష్ణ ఉన్నప్పుడు,   ఆయన స్వయంగా గుప్తను ఆహ్వానించి రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి సలహాలు, సూచనలు తీసుకున్నారు.తరువాత 2008లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మరియు ఆర్ధిక మంత్రి రోశయ్య గారు infrastructure development మరియు project management కోసం సలహాలు సూచనలు తీసుకున్నారు...
ఈ గుర్తింపులతో సరి పెట్టుకొనక  దేశ ఆర్ధిక పురోభివృద్ధికి ఐటి రంగం చాలా చేయూతనిస్తుందని చెబుతూనే దానికంటే ఎక్కవ ప్రాధాన్యం ఇవ్వాల్సిన రంగం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అని ఖచ్చితంగా తన వాదన వినిపిస్తూ దానికి తగిన గుర్తింపు ప్రభుత్వం ఇవ్వాలి అన్న తన ఆలోచనను అంతర్జాతీయ, జాతీయ వేదికలపై కీ నోడ్ స్పీకర్ గా వ్యక్త పరుస్తూ.... గడచిన అరవై ఏళ్ళ కాలమంతా అభివృద్ధికి బాటలు వేయాల్సిన ఈ రంగం నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేస్తూ... అభివృద్దికి బాటలు వేసే ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి రహదారుల వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తే దేశ ఆర్ధిక పురోగతికి స్థిరమైన ప్రగతికి బాటలు వేస్తుందని... దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంథానం చేస్తూ విశాలమైన రహదారులు, అంతర్జాతీయ, జాతీయ విమానాశ్రయాల నిర్మాణం, నౌకాశ్రయాలు, నీటి ప్రాజెక్టులు, నీటి పారుదల వ్యవస్థ, రైలు మార్గాలు ఇలాంటి మౌలిక సదుపాయాల కల్పనే దేశ భవితకు తిరుగులేని రాచమార్గాలని సోదాహరణంగా వివరిస్తున్నారు...ఇన్ ఫ్రాస్ట్రక్చర్ గురించి అభివృద్ధి చెందిన 160 దేశాల్లోని స్థితిగతులను అధ్యయనంచేసిన అనుభవాన్ని మేళవిస్తూ... భారతదేశ సహజ ఒనరులను, మానవ ఒనరులను, చక్కని ప్రతిభ ఉన్న యువతను కాస్త సానపట్టి, రాజకీయ, విద్యా రంగాలలో మార్పులు చేస్తూ సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తూ....ఆంధ్ర రాష్ట్ర రాజధాని నిర్మాణానికి తాను ఓ సమిధగా మారి నిరంతరంగా కృషి చేస్తున్న శ్రీ ఎమ్  ఎన్ ఆర్ గుప్త గారు ఈనాటి యువతకు రేపటి నవతకు దిశా నిర్దేశకులు అనడంలో అతిశయోక్తి ఏమి లేదు...
భీమవరంలో అతి సామాన్య కుటుంబంలో పుట్టి కష్టనష్టాలను భరించి చదువులో మెండుగా రాణించి ఉన్నత శిఖరాలను అందుకుని ఈనాడు ప్రపంచ మేధావులతో శబాష్ అనిపించుకున్న ఈ అతి పిన్న వయసు అపర మేధావి మనోగతంలో తన దేశం, తన రాష్ట్రం ప్రపంచంలో ప్ర ప్రధమ స్థానంలో ఉండాలన్న చిన్న కోరిక  పెరిగి పెరిగి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా బలీయమై తను ఎన్నో పరిశోధనలు చేసిన infrastructure project management రంగంలో మెళకువలు తనవారికే ఉపయోగపడాలన్న బలీయమైన కోరికతో స్వదేశానికి తన సేవలను అందించడానికి ముందుకు వచ్చిన ఈ తెలుగు తేజం... ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండటం అన్న నడవడితోవిదేశాల్లో సైతం తెలుగు వారికి అజాత శత్రువై తన అండ దండలు అందిస్తూ... అందరి అభివృద్ధితో పాటుగా తన దేశం, రాష్ట్రం అభివృద్ధి పధంలో ముందుండాలని ఆరాటపడుతూ... ప్రపంచానికి తెలుగువాడి సత్తా ఏంటోనిరూపించిన శ్రీ ఎం ఎన్ ఆర్ గుప్త గారు చరిత్రలో చిరస్మరణీయులు... రాబోయే రోజుల్లో infrastructure రంగంలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర సృష్టిస్తారనడంలో ఏమాత్రము సందేహం లేదు...
            ఎన్నోఅత్యంత ప్రతిష్టాత్మక అవార్డులు, సత్కారాలు విదేశీయుల చేతుల మీదుగా పొంది స్వదేశ కీర్తిని ప్రపంచానికి తెలియజెప్పి భారతీయత విలువతో పాటు తెలుగు'వాడి' మేధోసంపత్తిని తేటతెల్లం చేసి పిన్న వయసులోనేఎంతో ఎత్తుకు ఎదిగిన ఈ తెలివితేటల భాండాగారం మన తెలుగు వారిదే అని.. తెలుగు నేల పులకరిస్తోంది సంతోషంతో....ఈనాటి యువతకు రేపటి నవతకు దిశా నిర్దేశకులు, స్పూర్తిదాయకులు అయిన శ్రీ ఎం ఎన్ ఆర్ గుప్త గారు దేశ విదేశాల్లో ప్రాజెక్ట్ మానేజ్మెంట్ పై అందుకున్న ప్రశంసలు, అవార్డుల, రివార్డుల జాబితాలు పరిశీలిస్తే వారి ప్రతిభ గురించే చెప్పడానికి మాటలు చాలని పరిస్థితి...నిజంగా చెప్పాలంటే మన దేశంలో కన్నా విదేశాల్లో ఆయన చూపిన ప్రతిభకు ఒక తెలుగు వాడిగా ఎవరికి దక్కని ప్రతిష్టాత్మక గుర్తింపు విదేశీయులు ఇచ్చారంటే వారి మేధకు మరియు 20 సంవత్సరాల అవిశ్రాంత కృషికి కొలమానం ఏమిటో మనకు తెలుస్తుంది...ఒమన్‌ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2200 కిలో మీటర్ల రైల్వే నెట్ వర్క్ ప్రాజెక్ట్ విజయవంతంగా నిర్వహించడం కోసం ఆగష్టు 2014 లోఅంతర్జాతీయ నిపుణులతో మస్కట్ లో జరిగిన సమావేశంలో దేశ విదేశ ప్రముఖులతో పాటు భారత దేశం నుంచి అతి చిన్న వయసులో proactive project maangement , Integrated Transportation Planning కి సంబంధించిన టెక్నికల్ key note presentation మరియు పానల్ డిస్కషన్ మెంబర్ గా అమెరికా, లండన్ నిపులులతో పాటు గుప్త గారు ఇచ్చిన సలహాలు విశేష ప్రశంసలు అందుకున్నాయి. అంతర్జాతీయ నిపుణులలో అద్వితీయ ప్రతిభను కనబరిచి అందరి మెప్పును పొంది ప్రత్యేక పురస్కారాన్ని అందుకున్న ఏకైక భారతీయుడు ఈ తెలుగు తేజం.  

1961 నుంచి ఇప్పటి వరకు చదువుకున్న విద్యార్ధుల్లో NIT వరంగల్ వారు గత రెండు సంవత్సరాలుగా ప్రకటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డ్ Distinguished Young Alumni Professional Achievement award 2015ఈ సంవత్సరం  అతి పిన్న వయస్సులో గెలుచుకున్న ఘనత ఎమ్ ఎన్ ఆర్ గుప్త గారికి దక్కింది. వారి అవార్డుల ఖాతాలో మరో ఆణిముత్యం చేరింది.
          ఈ అవార్డ్ ఎంపికకు ఒక కమిటి, వారు ఎన్నుకునే విధానం చాలా విలక్షణంగా ఉంటుంది.. ఎన్నో వడపోతల తరువాత ఆచి తూచి ఎన్నుకుంటారు...ప్రపంచ వ్యాప్తంగా ఉన్న NIT విద్యార్ధుల్లో అత్యంత ప్రతిభావంతులను ఎన్నుకోవడంలో ప్రతిభకు పట్టం కట్టడంలో ఈ కమిటి ప్రతిభ గుర్తించ తగినది.. అందుకే ఈ అవార్డ్ కు ఇంతటి విలువ.  ఎందఱో కలలు కనే ఈ ప్రతిభా పురస్కారం ఎమ్ ఎన్ ఆర్ గుప్త గారిని వరించడం ఆ అవార్డ్ కే వన్నెను తెచ్చింది.. ఇది తెలుగు వారికి, ఆంధ్రులకు గర్వకారణం.
         ఒమన్ రాజు నుండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్లెన్నీ అవార్డ్ తీసుకున్న ఏకైక వ్యక్తి. ఇదే కాకుండా ఇండియాలో మెుట్టమెుదటి యూరోపియన్ ప్రీ స్కూల్ రిడ్జి గ్రూప్ కి సిఈఓ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తెలంగాణాలో ఎంపిక చేసిన 50 మంది
స్వేరో సర్కిల్స్ కమాండర్స్ ను AK47 మిషన్ గన్ బులెట్స్ లాగా తయారుచేస్తూ తన నాయకత్వ లక్షణాలను నిరూపించుకుంటున్నారు.
      ఒమన్ లో పదిమందితో స్థాపించిన WAM NRI VIBHG ఇప్పుడు దాదాపు 33 దేశాలలో తెలుగువారికి అన్ని రకాలుగా తమ సహాయ, సహకారాలు అందిస్తోంది.
         మన దౌర్భాగ్యం ఏమిటంటే క్రీడలకు ఉన్న గుర్తింపు మేధస్సుకు లేకపోవడమే.. అందుకే మేధావులు అందరు వలసలు వెళ్ళిపోయారు... కాని గుప్తా గారి లాంటి కొందరు మాతృ దేశంపై మమకారాన్ని చంపుకోలేక ఎక్కడ ఉన్నా పురిటి గడ్డ గొప్పగా ఉండాలని కోరుకుంటూ తమ సాయాన్ని అందిస్తూ ముందుకి రావడం మరింత మందికి ఆదర్శప్రాయం....!!

ఇదేం న్యాయమదెచ్చా...!!

ప్రజా ప్రతినిధులకన్నీ వెసులుబాట్లే... ప్రజలకు మాత్రమే ఆంక్షల వెతలు, శిక్షలు... 
పరీక్షలకు ఓ నిమిషం ఆలశ్యం అనుమతించని దొర..తన సమావేశానికి ఆలశ్యంగా వస్తున్నారని కోపం చేసుకుంటే సరిపోతుందా..మరి అసెంబ్లీ సమావేశాలకు ఆలశ్యంగా వచ్చే వారిపై ఏ చర్యలు ఉండవా అదెచ్చా..!!

జీవన 'మంజూ'ష (జనవరి2020)

నేస్తం,
     హింస మానసికమైనా, శారీరకమైనా ఫలితం మాత్రం మరణమే అవుతోంది. ఆ మరణం బలవన్మరణం కావడానికి వ్యవస్థ, వ్యవస్థలోని మనం ఎంత వరకు కారణమన్నది ఆలోచించాలి. ఒంటరితనం, ఆర్థిక అవసరాలు, అధికారిక వేధింపులు, ప్రేమ వైఫల్యాలు, కోపతాపాలు ఇలాంటి మరెన్నో కారణాలు పేదా గొప్ప తేడా లేకుండా ఆత్మహత్యలకు కారణాలవుతున్నాయి. క్షణాల నిర్ణయాలు ఎన్నో జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. అధికార దాహం, ఆర్థిక అవసరాలు, కులమత విభేదాల వంటి సవాలక్ష కారణాలు హత్యలకు కారణాలౌతూ ఎన్నో ప్రాణాలను అవలీలగా తీసేస్తున్నాయి. లింగ వివక్ష భ్రూణ హత్యలకు మరో కారణం.
        పైశాచిక, పాశవిక హత్యలకు ఎన్ కౌంటర్లు సమాధానం కాదు, తాత్కాలిక ఊరట మాత్రమే. ఈ ఎన్ కౌంటర్లు హైలీ రెస్పెక్టెడ్ దోషులకు మినహాయింపుగా ఉన్నాయి. చట్టం దృష్టిలో అందరు సమానమయినప్పుడే సమ న్యాయం జరుగుతుంది సామాన్యులకు. సమస్య మూలాలను నాశనం చేయగలిగినప్పుడే వ్యవస్థలో నేరాలు తగ్గుతాయి. తప్పు చేయాలంటే చట్టం వేసే శిక్ష ముందు గుర్తు రావాలి. చట్టం, న్యాయం అధికారానికి తలొగ్గినప్పుడు సామాన్యులకు న్యాయం అందని ద్రాక్షే అవుతుంది.
      చనిపోవడానికి కావాల్సిన ధైర్యంలో ఓ వంతు ధైర్యం చాలు దివ్యంగా బతికేయడానికి. సమస్య జీవితకాలం మన జీవితకాలంతో పోల్చుకుంటే చాలా చిన్నది. సమస్యలు వస్తూపోతూ ఉంటాయి. క్షణికావేశంలో తీసుకునే ఈ ఆత్మహత్యల నిర్ణయాల వలన ఎన్ని అవమానాలు కుటుంబానికి ఎదురౌతాయెా అని ఓ క్షణం ఆలోచిస్తే ఈ నిర్ణయం తీసుకోరు. సమస్యను అధిగమించడానికి చావు పరిష్కారమనుకుంటే ఈ ప్రపంచంలో మనిషి మనుగడే ఉండకూడదు. ఏ సమస్యా లేని మనిషి ఒక్కడు కూడా ఉండడు. సమస్యకు భయపడుతూ బతకకూడదు. సమస్యను భయపెడుతూ బతకాలి.
      చావు పుట్టుకలు సహజం. అలాగే మనిషన్నాక ప్రతి వారికి సమస్యలూ సహజమే. సమస్యను అధిగమించడానికి ప్రయత్నించాలి కాని చావు పరిష్కారమని మన తరువాతి తరాలను తప్పు దోవ పట్టించకూడదు. చావు సహజ మరణం కావాలి కాని కారణమేదైనా బలవన్మరణం కాకూడదు.  మరో మనిషికి బతకడానికి ఆదర్శం కావాలి మన జీవితం. అంతేకాని అర్ధాంతర ముగింపుకి అంకురం కాకూడదు. గొప్పదనం చావుతో రాదు. బతకడంలో వస్తుంది. బతికించడంలో వస్తుంది...!!

8, జనవరి 2020, బుధవారం

ఒళ్ళు దగ్గర పెట్టుకోండి...!!

నేస్తం, 
         నా చిన్నప్పుడు పత్రికలన్నా, రచయితలన్నా,  జర్నలిస్ట్లన్నా చాలా గొప్పగా ఉండేది. కాని ఇప్పటి రోజుల్లో మనం ఈ ముఖపుస్తకంలో వారి వారి వృత్తి, ప్రవృత్తిని,వయసుని బట్టి ఒక అంచనాకి రావడం చాలా కష్టమనిపిస్తోంది. ప్రతి ఒక్కరిలో మంచి చెడు ఉంటాయి. ఆడవారందరు మంచివారూ కాదు, అలా అని మగవారందరూ చెడ్డవారూ కాదు. కొందరు చాలా హుందాగా వ్యవహరిస్తే, మరి కొందరు చాలా నికృష్టంగా ఉంటారు. దీనిలో పిన్నలు, పెద్దలు అనే తేడా లేదు. కొందరు కులాన్ని టార్గెట్ చేస్తే మరి కొందరు రాజకీయాలు అంటగడతారు తప్పితే నిజం ఏంటన్నది ఆలోచించరు. ఎదుటివారి అభిప్రాయం మనకు నచ్చనప్పుడు పక్కకు వెళిపోవడం పద్దతి. అంతేకాని బూతుల పురాణం వచ్చు కదా అని అది ఇదీ వాగకూడదు. మన మతం, కులం, రాష్ట్రం మనకెంత ముఖ్యమెా పక్కవారికి కూడా అంతే అభిమానముంటుందని మర్చిపోయి ప్రవర్తిస్తే, వాళ్ళు ఊరుకోరని గుర్తుంచుకోవాలి. ప్రాంతీయాభిమానం లేకుండా ఎవరూ ఉండరు. 
       ఇక పిలుపుల విషయానికి వస్తే నోటి నుండి వచ్చిందా, నాభి నుండి వచ్చిందా అని తెలుసుకోగలిగితే బావుండు. అమ్మ, అక్క, చెల్లి అని పిలుస్తారు కాని కొందరు ఆ పిలుపులను కూడా కలుషితం చేస్తూ బంధాలపై ఉన్న నమ్మకాన్ని చెడగొడుతున్నారు. అమ్మా అని పిలుస్తూ అమ్మని బ్రోకర్ గా మార్చడానికి ప్రయత్నించే వెధవలు, అక్కా అని అంటూనే అడ్డమైన వాగుడు వాగే త్రాష్టులు ఇలా నానా రకాలైన దరిద్రులు ఈ ముఖపుస్తకంలో ఉన్నారు. 
       ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే చాలు ఇక మెదలు... మనమేమెా మ్యూచువల్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారని, గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నారని యాక్సెప్ట్ చేస్తే కొందరు ఎంత ఛండాలంగా ప్రవర్తిస్తారంటే చెప్పడానికి కూడ అసహ్యంగా ఉంటుంది. అలాంటి వెధవలను బయటపెట్టడం సెకను పని. కానీ ఎందుకులే అని బ్లాక్ చేసుకునే ఆప్షన్ వాడుకుంటారు చాలామంది. ముఖపుస్తకంలో ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరితో చాటింగ్ చేయడమే పని కాదు, అందరితో స్నేహం చేయడమూ కాదు. కొందరు మన సహనాన్ని ఎంత పరీక్షిస్తారంటే..ఎందుకు చాట్ చేయవు, ఫ్రెండ్ గా ఉండొచ్చు కదా అంటూ పనికిమాలిన ప్రశ్నలు వేసి విసిగిస్తారు. 
       ఏదో నాలుగు ముక్కలు రాసుకునే మాలాంటి వారిని దయచేసి విసిగించకండి. మీకు కావాల్సిన బాపతు ఈ ముఖపుస్తకంలో చాలామంది ఉన్నారు. అందరు మీలాగా ఉండరు. కాస్త గమనించి మసలుకోండి. ఇది రిక్వెస్ట్ అనుకోండి, హెచ్చరిక అనుకోండి, ఏదనుకున్నా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించండి..!!

1, జనవరి 2020, బుధవారం

అమ్మవొడి.!!

రెక్కల చాటున
రెప్పల తడి
మౌనం మాటున
మనసు అలజడి

కలల పక్కన
కలతల ఉరవడి
అలలతో కలిసిన
కన్నీటి చిత్తడి

చుక్కల పక్కన
ఆశల హడావిడి
పెదవి అంచున
మాటల గారడి

జ్ఞాపకాలతో నిండిన
గతపు గుప్పిడి
జీవితపు అంచున
అనుభవాల రాపిడి

పదాలకు అందిన
భావాల సందడి
అక్షరాలకు దక్కిన
అరుదైన అమ్మవొడి ..!!


 
 


దశాబ్ది శుభాకాంక్షలు..!!

నా చిన్ననాటి నేస్తం అన్నట్టుగా.. అవును ఎందుకనకూడదూ... నూతన దశాబ్ది అని.. 
అందుకే ముందుగా శత్రువులతో మెుదలుబెట్టి అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటుగా నూతన దశాబ్ది శుభాకాంక్షలు కూడా.. 
😍
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner