8, జనవరి 2020, బుధవారం

ఒళ్ళు దగ్గర పెట్టుకోండి...!!

నేస్తం, 
         నా చిన్నప్పుడు పత్రికలన్నా, రచయితలన్నా,  జర్నలిస్ట్లన్నా చాలా గొప్పగా ఉండేది. కాని ఇప్పటి రోజుల్లో మనం ఈ ముఖపుస్తకంలో వారి వారి వృత్తి, ప్రవృత్తిని,వయసుని బట్టి ఒక అంచనాకి రావడం చాలా కష్టమనిపిస్తోంది. ప్రతి ఒక్కరిలో మంచి చెడు ఉంటాయి. ఆడవారందరు మంచివారూ కాదు, అలా అని మగవారందరూ చెడ్డవారూ కాదు. కొందరు చాలా హుందాగా వ్యవహరిస్తే, మరి కొందరు చాలా నికృష్టంగా ఉంటారు. దీనిలో పిన్నలు, పెద్దలు అనే తేడా లేదు. కొందరు కులాన్ని టార్గెట్ చేస్తే మరి కొందరు రాజకీయాలు అంటగడతారు తప్పితే నిజం ఏంటన్నది ఆలోచించరు. ఎదుటివారి అభిప్రాయం మనకు నచ్చనప్పుడు పక్కకు వెళిపోవడం పద్దతి. అంతేకాని బూతుల పురాణం వచ్చు కదా అని అది ఇదీ వాగకూడదు. మన మతం, కులం, రాష్ట్రం మనకెంత ముఖ్యమెా పక్కవారికి కూడా అంతే అభిమానముంటుందని మర్చిపోయి ప్రవర్తిస్తే, వాళ్ళు ఊరుకోరని గుర్తుంచుకోవాలి. ప్రాంతీయాభిమానం లేకుండా ఎవరూ ఉండరు. 
       ఇక పిలుపుల విషయానికి వస్తే నోటి నుండి వచ్చిందా, నాభి నుండి వచ్చిందా అని తెలుసుకోగలిగితే బావుండు. అమ్మ, అక్క, చెల్లి అని పిలుస్తారు కాని కొందరు ఆ పిలుపులను కూడా కలుషితం చేస్తూ బంధాలపై ఉన్న నమ్మకాన్ని చెడగొడుతున్నారు. అమ్మా అని పిలుస్తూ అమ్మని బ్రోకర్ గా మార్చడానికి ప్రయత్నించే వెధవలు, అక్కా అని అంటూనే అడ్డమైన వాగుడు వాగే త్రాష్టులు ఇలా నానా రకాలైన దరిద్రులు ఈ ముఖపుస్తకంలో ఉన్నారు. 
       ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే చాలు ఇక మెదలు... మనమేమెా మ్యూచువల్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారని, గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నారని యాక్సెప్ట్ చేస్తే కొందరు ఎంత ఛండాలంగా ప్రవర్తిస్తారంటే చెప్పడానికి కూడ అసహ్యంగా ఉంటుంది. అలాంటి వెధవలను బయటపెట్టడం సెకను పని. కానీ ఎందుకులే అని బ్లాక్ చేసుకునే ఆప్షన్ వాడుకుంటారు చాలామంది. ముఖపుస్తకంలో ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరితో చాటింగ్ చేయడమే పని కాదు, అందరితో స్నేహం చేయడమూ కాదు. కొందరు మన సహనాన్ని ఎంత పరీక్షిస్తారంటే..ఎందుకు చాట్ చేయవు, ఫ్రెండ్ గా ఉండొచ్చు కదా అంటూ పనికిమాలిన ప్రశ్నలు వేసి విసిగిస్తారు. 
       ఏదో నాలుగు ముక్కలు రాసుకునే మాలాంటి వారిని దయచేసి విసిగించకండి. మీకు కావాల్సిన బాపతు ఈ ముఖపుస్తకంలో చాలామంది ఉన్నారు. అందరు మీలాగా ఉండరు. కాస్త గమనించి మసలుకోండి. ఇది రిక్వెస్ట్ అనుకోండి, హెచ్చరిక అనుకోండి, ఏదనుకున్నా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించండి..!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner