25, జనవరి 2020, శనివారం

సేవ సంక్రాంతి కవితల పోటి..!!

    సేవ సంస్థ నిర్వహించిన సంక్రాంతి కవిత పోటికి నన్నో న్యాయ నిర్ణేతగా చేసిన కంచర్ల సుబ్బానాయుడు గారికి మనఃపూర్వక ధన్యవాదాలు.
    సంక్రాంతికి చక్కని కవితలతో గత జ్ఞాపకాలను గుర్తు చేసి సంకురాతిరి సంబరాలను అక్షరాల్లో చూపించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. 
   ఒకే వస్తువుపై విభిన్నమైన శైలితో ప్రతి ఒక్కరూ కవిత్వీకరించిన తీరు బాగా ఆకట్టుకుంది. న్యాయ
నిర్ణయం చేయడం చాలా కష్టతరమైంది. న్యాయ నిర్ణయం ఎవరిని వారిది విభిన్నంగా ఉంటుంది. దయచేసి తప్పుగా అనుకోకండి. ప్రతి కవితా చక్కగా ఉంది. విజేతలు కొందరే కనుక అన్నీ ఎంపిక చేయలేము. 
      నా పరిధిలో నాకనిపించిన విధంగా తృతీయస్థాన  కవితలను సంక్షిప్తంగా సమీక్షిస్తాను. 

    ఆనాటి సంక్రాంతి ఎలా మెుదలై ఎంత వైభవంగా పెద్దలు, పిన్నలు సంబరాలు చేసుకునేవారో,  ఎన్ని ముచ్చట్లు మురిపాలు పంచుకునేవారో, ఆటలో అల్లరి, పాటల సందడిని గుర్తు చేస్తూ ఆధునిక సంక్రాంతిని పోల్చుతూ..కోల్పోతున్న ఆనందాలను తిరిగి తెమ్మని కోరుతూ సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలికిన అక్షర తోరణం శ్రీ షేక్ మహమద్ రఫీ గారికి అభినందనలు. 
   సంక్రాంతి సొగసులను సొగసైన వర్ణనలతో వివరిస్తూ, తాయిలాల తీపిని రుచి చూపిస్తూ, పాడిపంటల పల్లె జీవితాలను వల్లెవేస్తూ, కలసి ఉండే కలదు సుఖమని గుర్తుచేస్తూ, రైతన్న గొప్పదనాన్ని, మన సంస్కృతీ సంప్రదాయాల విలువను తెలిపిన అందమైన కవితాఝరిని మన మనసులపై అందంగా ముద్రించిన శ్రీమతి మాధవి శ్రీనివాస్ నందిమళ్ళ గారి సొగసైన సంతకం సంక్రాంతికి అభినందనలు.   
      హేమంతపు అందాలను కనుక ముందు నిలుపుతూ, చక్కని పదాల అమరికతో, సంక్రాంతి సంబరాలను అక్షర రంగవల్లులతో అలంకరించి, మానవత్వపు మమకారాలను రుచి చూపిస్తూ, ఎప్పటెప్పటి జ్ఞాపకాలకో...మళ్ళీ తన అక్షరాలతో జీవం నింపి, అందమైన బొమ్మల కొలువుగా మన ముందుకు వచ్చిన వెలుగు తోరణం వెన్నెల కాంతి ఈ సంక్రాంతిని అందించిన ఘాలి లలిత ప్రవల్లిక గారికి అభినందనలు. 
      ఈ పోటిలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజేతలే. చదివిన ప్రతి కవితా బోలెడు జ్ఞాపకాలను గుర్తు చేసింది. అందమైన అమాయకమైన బాల్యాన్ని మరోసారి అందించింది. నాకు ఈ అవకాశానిచ్చిన కంచర్ల సుబ్బానాయుడు గారికి ధన్యవాదాలు. 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner