25, జనవరి 2020, శనివారం
ఆత్మీయులు పుస్తక సమీక్ష..!!
" అనుబంధాలకు వారధి ఆత్మీయత "
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తుల్లో డాక్టర్ లక్ష్మీ రాఘవ ఒకరు. ఈవిడ కథలు నేల విడిచి సాము చేయవు. మన చుట్టూ ఉండే సమస్యలనే కథా వస్తువులుగా తీసుకుని ఏక బిగిన చదివించే శైలి ఈమె సొంతం. ఎన్నో పురస్కారాలు అందుకున్న కథలు మరో కథా సంపుటి "ఆత్మీయులు" గా రావడం ముదావహం.
అవయువదానం గొప్పదనం తెలిపే కథ ఆత్మీయులు. ఎదుగుదల ఉన్న ప్రతిచోట మార్పు అవసరమంటూ ఆధునికను అందిపుచ్చుకోవాలని చెప్పే కథ ఆచరణ. అందరూ ఉండి అనాథల్లా మిగిలిపోతున్న ఎందరో తల్లీబిడ్డల కథ ఒక అమ్మ కథ. ఆపదలో ఉన్నప్పుడు మానవత్వం, మంచితనంతో చేసే సాయం విలువ తెలిపే కథ సహాయం. కొత్తవారి మాటలు నమ్మి ఎలా మెాసపోతామెా తెలిపే కథ చీరలు. అమ్మ అవసరమైతే దుష్ట శిక్షణకు అపరకాళిగా మారుతుందని కన్న కొడుకును కూడా క్షమించదని ఆమె ఒక శక్తి కథ బుుజువు చేస్తుంది. ఒకరి సాహిత్యం గురించి విమర్శ చేసేటప్పుడు, వారు ఆ విమర్శకు సమాధానం చెప్పే విధం అభిప్రాయం కథలో చదువుతున్నప్పుడు నాకు ఎదురైన విమర్శలు గుర్తులు వచ్చాయి. చాలీచాలని బతుకుల్లో కష్టాలు చెప్పకుండా వస్తే ఆదుకునే అనుబంధాలను చూపించి కథ ఆటో. నూటికి తొంభైతొమ్మిది మంది అమ్మలకు ఎదురయ్యే సమస్యే అమ్మ ప్రేమలో తేడా కథ. పుస్తకం మనసు తెలిపిన కథ నేను. రైలు పట్టాలు చెప్పిన జీవిత సత్యాలు విప్పి చెప్పిన కథ ఇదేమి న్యాయం. తోటలో ఒక రోజుంటే పూల మనసు తెలుస్తుంది. కన్నవారి మీదే కాకుండా పుట్టిన గడ్డ మీద మమకారంతో ఓ ఆడపిల్ల చెప్పిన మాటల ముత్యాలే ఆడపిల్ల ఆలోచన కథ. అమాయకులతో ఆడుకున్న అవయువదానాల బడాబాబుల కత దానం. ముక్కుపుడక మనసు తెలిపే కథ ముక్కుపుడక. మన ఇష్టాలు, అభిప్రాయాలు బలవంతంగా ఎదుటివారిపై రుద్దకూడదని సున్నితంగా చెప్పిన కథ బోధన. పెద్దావిడను మలి వయసులో బాగా చూసుకోవాలన్న కొడుకు, కోడలు, మనుమరాలికి ఎదురైన చేదు అనుభవం ఏమిటో నానమ్మ కథలో తెలుస్తుంది. అవసరానికి వాడుకొనే మనుషులు కొందరైతే అడగకుండానే సాయం చేసే మానవతామూర్తులు మరికొందరని చెప్పే కథే టెంపరరీ. ఇల్లాలు కథలో ఇంటి ఇల్లాలి ఉద్యోగ బాధ్యతలు, జీత బత్యాల గురించి ఇంటాయన చెప్పడం చాలా బావుంది. కొన్ని సమస్యలకు దేవుడు చూపించే పరిష్కారాలు మానవ మేధస్సుకు అందవని దేవుడిచ్చిన తోడు కథ బుుజువు చేస్తుంది. డబ్బు మాయలో బతుకుతున్న ఈరోజుల్లో రక్త సంబంధానికి, బాధ్యతలకు విలువనిచ్చిన అన్నదమ్ముల కథ ఆలోచన. కూటి కోసం కోటి తిప్పలన్నట్టు జానెడు పొట్టకు ముద్ద కోసం వేసే వేషాలు, చేసే వ్యాపారాల గురించి తెలిపే కథ గాంధీగారు గాయపడ్డారు. ఓ అమ్మ బిడ్డల మధ్యే వయసు తారతమ్యం ఎన్ని చిక్కులను తెస్తుందో తెలిపే కథ ఎడం.
తేలిక పదాలతో, వర్ణన అవసరం లేని ఇతివృత్తాలతో సూటిగా చదువరుల మనసును తాకేటట్లుగా కథలు రాయడం డాక్టర్ లక్ష్మీ రాఘవ ప్రత్యేకత. సమాజంలో సమస్యలను సున్నితంగా చెప్తూ, తనదైన రీతిలో పరిష్కారం చూపిస్తూ ఎన్నో సమస్యలను తన కోణంలో విశ్లేషిస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. మనసు పెట్టి వింటే పూలు, పక్షులు, జంతువులు, చెట్లు చేమలు కూడా కథలు చెప్తాయని డాక్టర్ లక్ష్మీ రాఘవ నిరూపించారు తన కథా సంపుటాలతో. చక్కని కథలను అందించిన డాక్టర్ లక్ష్మీ రాఘవకు హృదయపూర్వక అభినందనలు.
వర్గము
సమీక్ష
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి