9, జులై 2020, గురువారం

భూతల స్వర్గమేనా..17

పార్ట్... 17
        పొద్దున్నే బస్ చికాగో మెయిన్ బస్ స్టేషన్ లో ఆగింది. నేను దిగాల్సింది అరోరా బస్టాండ్ లో. సెంట్రల్ స్టేషన్ లో బస్ క్లీనింగ్ కోసం ఆపారు. నేను కిందకి దిగి కాస్త అవతలగా కూర్చున్నాను. బయలుదేరేటప్పుడు ఎనౌన్స్ చేస్తారు కదా అని. నన్ను అరోరాలో రిసీవ్ చేసుకోవడానికి శరత్ గారు వస్తారని, ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఫోన్ చేసి ఇక్కడ బస్ ఆపారని చెప్పాను. తర్వాత చూస్తే బస్ లేదు. కంగారేసి ఎంక్వైరీలో అడిగితే బస్ వెళిపోయిందని చెప్పారు. నా లగేజ్ మెుత్తం బస్ లోనే ఉండిపోయింది. రెండు పెద్ద సూట్కేస్లు, ఒక చిన్న సూట్కేస్. దానిలోనే నా డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. వెంటనే ఈ బస్ స్టేషన్ లో కంప్లయింట్ చేసాను. నా లగేజ్ అరోరా బస్ స్టేషన్ లో దింపమని  చెప్పాను. శరత్ గారికి, రామస్వామి గారికి ఫోన్ చేసి చెప్తే, కాబ్ వేసుకుని అరోరా బస్ స్టేషన్ కి వచ్చేయమన్నారు. 150 డాలర్లు దండగన్నమాట. ఏం చేస్తాం తప్పదు కదా మరి, మన అజాగ్రత్తకి మూల్యం చెల్లించాలి కదా. ఇంకా నయం బస్ వాళ్ళు నా లగేజ్ జాగ్రత్తగా దించి వెళ్ళారు. నేను బస్ స్టేషన్ కి వెళ్ళేసరికి లగేజ్ దించి బస్ అప్పుడే వెళిపోయింది. శరత్ గారు నన్ను లగేజ్ తో సహా వాళ్ళింటికి తీసుకువెళ్ళారు. శరత్ గారి వైఫ్ కవితక్క చక్కగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు రడీ అయ్యారు. నేను ఫ్రెష్ అయ్యి,  రడీ అయ్యాను. కవితక్క ఆరంజ్ జూస్ ఇచ్చింది. తాగేసి ముగ్గురం రామస్వామి గారిని కలవడానికి వారి చైనీస్ రెస్టారెంట్ హ్యూనాన్ ఇన్ కి బయలుదేరాం. 
           రెస్టారెంట్ మేనేజ్మెంట్, మెంటెనెస్స్ అంతా కవితక్క చూసుకునేది. రామస్వామి గారి వైఫ్ మాధవి గారు బయట జాబ్ చేసుకుంటూనే వీటిని కూడా చూసుకునేవారు. రామస్వామి గారు అప్పటికే భారత్ మేళా అని ఇండియన్ గ్రాసరిస్టోర్ కూడా తీసుకున్నారు. శరత్ గారు అక్కడ, ఇక్కడ కావాల్సిన సరుకులు, కూరగాయలు అన్ని తేవడం చూసుకునేవారు. ఆరోజంతా కవితక్క వెనుకే ఉంటూ తను చేసేదంతా చూస్తూ వున్నాను. ఆ నైట్ కి నన్ను నేపర్ విల్ లో రామస్వామి గారింటికి తీసుకువెళ్ళారు. చాలా  పెద్ద ఇల్లు. నా లగేజ్ కూడా వచ్చేసింది. వాషింగ్ మెషీన్ ఉన్న రూమ్ లో బెడ్ ఉంది. ఆ రూమ్ నాకు ఇచ్చారు. తర్వాత 4,5 రోజులనుకుంటా నన్ను రామస్వామి గారు పొద్దున్నే ఎనిమిదింటికంతా రెస్టారెంట్ కి తీసుకువెళ్ళేవారు. కవితక్క, శరత్ గారు కూడా ఆ టైమ్ కి వచ్చేసేవారు. కవితక్క నాకు అక్కడ చేయాల్సిన పనులు బాత్ రూమ్లు కడగడం, కూరగాయలు కోయడం, టేక్ అవుట్ల ఆర్డర్ తీసుకోవడం, ఇవ్వడం మెుదలైనవి నేర్పేది. లంచ్ బఫే ఉండేది. సాయంత్రం టేక్ అవుట్లు, డిన్నర్ ఉండేది. మరో పక్క ఇండియన్ ఫుడ్ టిఫిన్స్ , డిన్నర్ కూడా సాయంత్రం పూట మెుదలు పెట్టారు. వీకెండ్ బాగా బిజీగా ఉండేది. చైనీస్ కుక్ లు, తోలు వెయిటర్స్ కూడా ఉండేవారు. హోమె చైనీస్ వెయిటర్ సరదాగా మాట్లాడేది. చిన్న చిన్న చైనీస్ పదాలు కూడా అప్పుడప్పుడూ నేర్పేది. కొన్ని రోజుల తర్వాత జాబ్ మార్కెట్ అప్పటికే బాలేని కారణంగా మాధవి గారి జాబ్ కూడా కాంట్రాక్ అయిపోయింది. మా వారి ఫ్రెండ్ మాధవి గారి తమ్ముడు. 
         తర్వాత ఓ రోజు మాధవి గారు నేను రడీ అయ్యి రెస్టారెంట్ కి బయలుదేరుతుంటే నేను తీసుకువెళతానులే నిన్ను, మనిద్దరం కలిసి కాసేపాగి వెళదామంటే సరేనని ఆగాను. వీళ్ళకి ఓ పాప, బాబు. పాప అప్పుడు ఐదో, ఆరో చదువుతుండేదనుకుంటా. బాబు బయట ఉండేవాడు అండర్ గ్రాడ్యుయేషన్ అనుకుంటా. కాఫీ తాగుతూ ఆ కబురు, ఈ కబురు చెప్తూ నేనేం చేస్తున్నానో అన్నీ కనుక్కుంది. చాలా ప్రేమగా ఉండేది నాతో అప్పటి నుండి. నా గురించి బాగా కేర్ తీసుకునేది కూడా. అప్పుడప్పుడూ ఇండియన్ గ్రాసరిస్టోర్ కి కూడా తీసుకువెళ్ళే వారు శరత్ గారు. అక్కడ విజయ అని ఒకావిడ పని చేసేవారు. వాళ్ళాయన జాబ్. ఈవిడ ఇక్కడ పని చేసేవారు. నాకేమెా ఖాళీగా కూర్చోవడం రాదు. షాప్ నీటుగా లేదని క్లీనింగ్ మెుదలుపెట్టాను. నాకు వచ్చినట్టుగా అన్నీ సర్దేసాను. బాత్ రూమ్ కూడా నీట్ గా క్లీన్ చేసాను. కవితక్క నాకు రెస్టారెంట్ లో చెప్పిన పనే ఇక్కడా చేసి విజయతో అన్నానేమెా మనమే క్లీన్ చేయాలని. నాకు సరిగా గుర్తు లేదు. ఆవిడ మరి ఎవరికి ఏం చెప్పుకుందో నాకు తెలియదు. ఆరోజో, మరుసటి రోజో రామస్వామి గారు మీటింగ్ ఉందన్నారు. అందరు ఏదేదో మాట్లాడారు. చివరికి నాకర్థమైందేంటంటే నన్ను విజయకు సారి చెప్పమన్నారని. సారి చెప్పేసాను. కాని నా తప్పు లేకుండా సారి చెప్పడమంటే నాకు చచ్చిపోవడంతో సమానం. మాధవి అక్క తన కార్ లో ఇంటికి తీసుకువచ్చారు. తనకి నా సంగతి బాగా తెలుసు. నాతోపాటే రూమ్ కి వచ్చి బాధపడవద్దని చెప్పి సముదాయించింది. చాలా సేపు బాధనిపించింది. అప్పటినుండి కాస్త మనుషుల నైజాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేదాన్ని. నాకేమెా కాస్త ఆత్మాభిమానం ఎక్కువ. ఏదీ తొందరగా రాజీ పడలేను. ఈ విషయం నుండి బయటపడటానికి నాకు చాలా సమయమే పట్టింది. 

మళ్ళీ కలుద్దాం.. 

-

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner