13, జులై 2020, సోమవారం

హృదయ ఘోష..!!

నేస్తం, 
        చాలా  రోజుల తర్వాత మాట్లాడుకుంటున్నాం కదూ...ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదోక సమస్య ఉండనే ఉంటుంది. సమస్యను ఎదుర్కొన లేక చావు పరిష్కారం అనుకుంటారు చాలామంది. కాని బలవంతంగా చనిపోవడానికి చాలా ధైర్యం కావాలి. దానిలో కొద్దిపాటి ధైర్యం చాలు దివ్యంగా మన బతుకు మనం బతికేయడానికి. 
        మెున్నీమధ్య ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగిని లహరి వీడియెా ఈరోజు చూసాను. ఆ అమ్మాయి ఓ వెధవను ప్రేమించి, పెళ్ళి చేసుకున్న పాపానికి బలవంతంగా తనువు చాలించింది. ఆమె మాటలు వింటుంటే ఎందరి మనసుల్లోని ప్రశ్నలో కదా ఇవన్నీ అని అనిపించింది. మనకు తెలియకుండానే ప్రేమ ముసుగులో మెాసపోయే  అభాగ్యుల జీవితాలెన్నో. వెలికిరాని కన్నీటి కథలెన్నో.
           వాడు శారీరకంగా, మానసికంగా ఎంతగా హించించినా వాడి మీద ఆమె ప్రేమ చెక్కు చెదరలేదు. ఆమె మాత్రమే కన్నవారికి కన్నీటిని కానుకగా ఇచ్చి చనిపోయింది. ప్రేమ పేరుతో మంచివాడిగా నటించి, ఆమెను పూర్తిగా మానసికంగా చంపేసి, వీడు వేరే అమ్మాయిలతో విదేశాలు షికార్లు చేయడం, అదీ లహరి సొమ్ముతో ఎంజాయ్ చేయడం, రోజూ ఆమెను ఏదోక వంకతో గొడ్డును బాదినట్లు బాదడం, ప్రేమగా పెంచుకున్న కుక్క అడ్డం పడిన విశ్వాసం, ఇలా ఆ వీడియెాలో ఆమె హృదయ వేదన చూసాక చాలా బాధ అనిపించింది. 
           లహరి తన మనసు విప్పి చెప్పిన మాటలన్నీ ఎందరో సగటు మహిళల జీవితాలే కదా అనిపించింది. ప్రేమయినా, పెళ్ళయినా నమ్మకం మీద జరుగుతాయి. ఆ నమ్మకం మెాసపోయినప్పుడు ఇలాంటి ఆత్మహత్యలు కొన్ని జరుగుతాయి. నేరస్థులకు మాత్రం శిక్షలేం ఉండవు. దర్జాగా బయట కాలరెగరేసుకుని తిరుగుతారు. చట్టాలు, న్యాయాలు అన్నీ వారికనుకూలమే. ప్రపంచం ఎంత ముందుకెళ్ళినా మార్పు లేనిది సగటు మహిళ జీవితంలో మాత్రమే. లహరి లాంటి మహిళలెందరో సాక్ష్యాలు లేకుండానే జీవితాలు ముగిస్తున్నారు. 
          సమస్యతో పోరాడి గెలవాలి కాని సమస్యకు లొంగిపోకూడదన్న తెగింపు ప్రతి మనిషిలో రావాలి. ఎందుకోగాని లహరి మాటలు విన్నప్పుడు మనకు తెలిసిన మనసులో మాటలే తను చెప్పింది అన్నట్టుగా అనిపించింది. ఏముందిలే కాని ఈరోజు విన్నప్పుడు కాస్త బాధ పడతాం. రేపు నిద్ర లేచేసరికి ఈ సంఘటన ఆనవాళ్ళను మర్చిపోతాం. మరో విషయంతో మరో రోజు ప్రారంభం. ఇదే మన జీవితం. మన చేతకాని తనానికి బుుజువులుగా ఇలా ఎన్నో సంఘటనలు వింటూ, చూస్తూ...ఏది మనది కాదని దులిపేసుకుని బతికేద్దాం...ఏమంటారు? 
        
       

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner