13, జులై 2020, సోమవారం

ఏక్ తారలు...!!

1.  పాతదనమెప్పుడూ కొత్తదనానికి నాందే_నిన్నా రేపుకు తేడా తెలుపుతూ...!!
2.  బుుజువు చూపలేని గాయాలవి_మనసునే వరిస్తూ..!!
3.   అనుబంధాలేం లేవు_బుుణ సంబంధాలు తప్ప..!!
4.  ఆత్మీయత ఆమడ దూరానే ఆగిపోయింది_బంధాల తూకానికి ఒగ్గలేక...!!
5.  భ్రమత తీరనిదే మరి_నిష్క్రమణం అనివార్యమని తెలిసినా..!!
6.   ఆశలకు ఆయువునివ్వడమే_కలవరపడే మనసుని సముదాయించమంటే..!!
7.  ఆవాహన చేసుకుంది అక్షరాన్నే _ఆత్మకు ఆనందాన్నీయడానికి..!!
8.   అక్షరానికి ఆటుపోట్లు తెలుసు_మనసుకు సాంత్వన అందిస్తుందందుకే...!!
9.    సేద దీర్చే అక్షరాల్లోనే_ఓదార్పులన్నీ...!!
10.    దాచిపెట్టుకుంది గతం_నావైన జ్ఞాపకాలనన్నింటినీ...!!
11.   బాధను భరించక తప్పదు_అక్షరానికి అమ్మతనం అద్దినందుకు..!!
12.  దగ్గరవడమే తనకు తెలిసిన ధర్మం_నమ్మిన నెయ్యంతో..!!
13.  ఆ'భరణమెందుకు అయినవారి మధ్యన_నెయ్యం నొచ్చుకుంటుందేమెా...!!
14.  మనసు వేగం అక్షరాలకెరుకే_ఏ కాలాన్నైనా తమలో కలిపేసుకుంటూ..!!
15.   రాయడమెలానో కలానికి ఎరుకే_అక్షరాలకు మనసు తెలిస్తే...!!
16.  లలాట లిఖితమది_బాధైనా ఏదైనా అక్షరంతో ఆత్మానందం పొందడమనేది..!!
17.  అక్షరాలు కొన్నే_అవి పంచే అనుభూతులే అనంతం..!!
18.   చేజారుతున్న కాలాన్ని ఒడిసిపట్టింది మనసు_అక్షరాలతో స్నేహం చేయమంటూ..!!
19.   అక్షరాలెప్పుడూ తేనెలే చిలకరిస్తాయి_మన ఆస్వాదనలోనే అంతరాలు...!!
20.   జీవన నాటకం నడుస్తూనే ఉంటుంది_కాలం కనికట్టులో..!!
21.   మలిపొద్దై మారాము చేస్తున్నా_వెన్నెలరేడు పలకరింపుల కోసం...!!
22.   శిల్పమై నిలిచింది మనసు తెలిసిన మౌనం_బాధకు భాష్యం తానౌతూ..!!
23.   చేరలేని తీరాలే కొన్ని_జవాబు దొరకని ప్రశ్నలతో..!!
24.  చేరువైన అనుబంధాలు చాలు_ప్రశ్నల పరంపరకు అడ్డకట్ట వేయడానికి..!!
25.  బతుకు పుస్తకమెప్పుడూ బరువే_బంధాలకు చుట్టుకున్న బాధ్యతలతో...!!
26.   అర్థం కాని ముడులే అన్ని_చిక్కులు విప్పే చాకచక్యం తెలియనప్పుడు...!!
27.  అక్షరమెప్పుడూ ఆర్తినే నింపుతుంది_అది తన సహజ స్వభావమనుకుంటా..!!
28.  చిరునవ్వు వెనుక విషాదాన్ని చూడు_మదిలో ఇంకిన కన్నీళ్ళెన్ని కనిపిస్తాయెా..!!
29.  లోకజ్ఞానం లేకే ఈ కన్నీళ్ళు_వేదనే వాయిద్యమైన మదిని సముదాయించలేక..!!
30.   మూగబోతున్నాయి అక్షరాలు_మది అడుగుజాడలను అనుసరించలేక...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner