27, జులై 2020, సోమవారం

కాలం వెంబడి కలం...12

       మా బాలకృష్ణ, భాను, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి నేనో వరల్డ్ బాంక్ ని. నా మరో నిక్ నేమ్ అదే. మా జనాభా అందరికి ముసలి, మంజుబాయ్ ని. బాలుగాడికి ఓ లెక్చరర్ మీద కోపం వచ్చింది. లాబ్ ఫెయిల్ చేసాడని. ఆ కోపంలో వాడు బైక్ తో ఆ మెకానికల్ సర్ గురునాథ్ రెడ్డిని గుద్దేసాడు. మా అందరికి అప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. నాకు మధ్యాహ్నం రెండింటికి ఎగ్జామ్ ఉంది. భాను అనుకుంటా మా హాస్టల్ కి వచ్చి బాలుకి బైక్ యాక్సిడెంట్ అయ్యింది. డబ్బులు కావాలన్నాడు. ఏ హాస్పిటల్ లో ఉన్నాడంటే, ఆ హాస్పిటల్ మా హాస్టల్ కి దగ్గరలోనే ఉందన్నాడు. వాడికి డబ్బులు ఇచ్చి, నేను వెళ్ళాను చూడటానికి. వెధవ కాలు విరగ్గొట్టుకున్నాడు. ఎలా జరిగిందిరా అంటే  అప్పుడు అసలు విషయం చెప్పాడు. ఏది చేసినా, నేను తిడతానని తెలిసినా నిజం చెప్పేసేవాడు. 
      ఆ టైమ్ లోనే మాకు డబ్బులకు బాగా ఇబ్బందిగా ఉండి బాలు వాళ్ళ అమ్మ వాళ్ళను అప్పుగా అడిగితే ఇస్తామని చెప్పారు. మా మామయ్య అప్పట్లో టివియస్ ఉండేదిలెండి. అది వేసుకు వెళితే, లేవని చెప్పారు. పెట్రోల్ కూడ డబ్బులిస్తారుగా కొట్టించుకుందామనుకున్నాడట మా మామయ్య. మీకు చెప్పనేలేదు కదూ మాది ఉమ్మడి కుటుంబం. అమ్మ మేనమామనే చేసుకుంది. అమ్మమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న, నేను, మామయ్య మా ఇంట్లో. మా మామయ్య నాకన్నా ఆరు నెలలే పెద్దవాడు. అందుకే నేను మా నాన్నకు  ఒక్కదాన్నైనా ఎప్పుడూ ఒంటరితనం ఫీల్ కాలేదు. బాలుకి దెబ్బ తగిలిన మరుసటి రోజు పిన్ని వచ్చింది.నేను వెళ్ళాను వాడి రూమ్ కి. ఎలా ఉన్నాడోనని. మా ఇంట్లోవాళ్ళు పిన్నిని డబ్బులడిగిన సంగతి కాని, వీళ్ళు ఇవ్వని సంగతి కాని అప్పటికి నాకు తెలియదు. ఎందుకో పిన్ని సరిగా మాట్లాడలేదు. ఏదో ఇబ్బంది పడుతోంది అనుకున్నాను. తర్వాత అసలు సంగతి ఇంటికి వెళ్ళినప్పుడు తెలిసింది. ఈ విషయాలేవి బాలుగాడికి తెలియదు. నేనూ చెప్పలేదు. 
         నేను తరచూ ఇంటికి వెళిపోతూ ఉండేదాన్ని ఫస్ట్ ఇయర్ నుండి అంతే. కాలేజ్ కి వచ్చి ఓ పది, పదిహేను రోజులు అయ్యాక కాస్త బాలేదంటే చాలు, ఇంటికెళ్ళి చాలా రోజులయ్యిందిగా, వెళదాం పదా అని నన్ను అందరు ఆట పట్టించేవారు. బాలు, భాను మా హాస్టల్ కి నా దగ్గరికి వచ్చినప్పుడు నేనేం అనకపోతే..అక్కా పది రోజులయిపోయింది నీతో తిట్లు తిని, తిట్టేయ్ అని నవ్వేవారు. నేను తెచ్చే రొయ్యల పచ్చడి కోసం అందరు ఎదురుచూసేవారు. ఫస్ట్ ఇయర్ లో మరో తమ్ముడు రఘు వాళ్ళ అమ్మగారు నాకోసం సున్నుండలు పంపేవారు. అప్పటి ఆప్యాయతే ఇప్పటికి ఈ అక్క మీద చూపిస్తారు నా తమ్ముళ్ళు. 
      ఇల్లు, ఇంట్లోవాళ్ళను వదలి హాస్టల్ లో ఉండటం మెుదలయ్యింది ఇంజనీరింగ్ లోనే. నాకేమెా అంతా టైమ్ ప్రకారం సిస్టమాటిక్ గా ఉండాలి. నా వస్తువులన్నీ నాకు జాగ్రత్త. నేను ఎవరిది ఏదీ తీసుకునేదాన్ని కాదు. వారి ఎవరన్నా తీసుకున్నా, వాళ్ళు మళ్ళీ తెచ్చి ఇవ్వకపోయినా, నేనే వెళ్ళి అడిగి తెచ్చుకునేదాన్ని. రూమ్ కూడా నీట్ గా ఉండాలి. నా మిగతా రూమ్మేట్స్ నీలిమ, శారద, చంద్ర మేము నలుగురము నాలుగేళ్ళు కలిసే ఉన్నాము. కాకపోతే చంద్ర, శారద కజిన్స్. వాళ్ళకు నాలుగేళ్ళు ఆగకుండా అయిపోయాయి. నేను, నీలిమ నాలుగవ సంవత్సరం కలిసే చదివాము. ఇక నా లంగా ఓణిలు అన్నీ నీట్ గా సర్దుకునేదాన్ని. ఎవరికి నచ్చింది వారు షాప్ లలో మాచింగ్ చూసుకున్నట్టు చూసుకుని  తీసుకునేవారు అప్పుడప్పుడు సరదాగా. సబ్ జూనియర్స్ లో లత, నాగ మంజుల, గాయిత్రి వాళ్ళు పాటలు చాలా బాగా పాడేవారు. అప్పుడప్పుడూ ఇష్టమైన పాటలు పాడించుకునేదాన్ని. మా కజిన్ ఝాన్సీ కూడా నాకు సబ్ జూనియర్ గా మా కాలేజ్ లోనే. నన్ను కాస్త బానే విసిగించేది. అప్పుడప్పుడూ అన్నం కలిపి తినిపించమని లేదంటే తిననని నన్ను బ్లాక్ మెయిల్ చేసేది. నాకేమెా తినిపించడం ఇష్టం ఉండదు. ఆకలితో ఉంటుందని ఇష్టం లేకపోయినా తినిపించేదాన్ని. ఒక్కోసారి అడిగేది నిన్ను ఎంత విసిగించినా, నీకు కోపమే రాదా అని. అప్పట్లో చాలా శాంతమూర్తినన్నమాట. కాలేజ్ మెుత్తం మీద నన్ను బాగా ఏడిపించిన వ్యక్తి వెంకట్రావు. నా పేరుతో మరొకరి పేరు కలిపి పిలిస్తే మహాచెడ్డ కోపం నాకు. ఎందుకు మెుదలు పెట్టాడో తెలియదు ఫస్ట్ ఇయర్ లో కాస్త తక్కువ, సెకెండ్ ఇయర్ లో నుండి బాగా ఎక్కువగా ఏడిపించేవాడు. తను పిలవడమే కాకుండా బయట ఆటోవాళ్ళతో కూడా అరిపించి ఏడిపించేవాడు అంజు మంజు అని, ఆ అంజయ్య చౌదరితో నేను మాట్లాడింది చాలా తక్కువ. ఇలా పిలవడం మెుదలెట్టాక అస్సలు మాట్లాడనేలేదు. సెకెండ్ ఇయర్ లో ఓ టైమ్ లో ఈ గోల పడలేక చదువు మానేసి ఇంటికి వెళిపోదామన్నంత ఫ్రస్టేషన్ వచ్చేసింది. మళ్ళీ నాకు నేనే సర్దిచెప్పుకున్నాను. వాళ్ళు అలా అరిచి ఏడిపిస్తే నేనెందుకు చదువు మానేయాలని. వాళ్ళు సరదాగా ఏడిపించినా కాస్త చిరాకేసేది. మా సీనియర్స్ రాధారమ ట్విన్స్. నోట్సులు అడిగితే నాకు ఇచ్చేవారు. రాసుకుని మళ్ళీ తిరిగి ఇచ్చేసేదాన్ని. టెక్స్ట్ బుక్స్ అన్నీ నాగభూషణం మామయ్య విజయవాడ సిద్ధార్థ కాలేజ్ లైబ్రరీ నుండి తీసుకుని ఇచ్చేవాడు. ఆయన అక్కడ లైబ్రేరియన్ గా చేసేవారు. నా ఎమ్ సెట్ కోచింగ్ కి విజయవాడ వచ్చినప్పుడు పరిచయం పక్కింట్లో. వాళ్ళ ఇంటి ఆడపిల్లలానే చూసుకునేవారు రాణి అక్క, మామయ్య. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నాకు వార పత్రికలు మాస పత్రికలు, నవలలే కాకుండా ఆస్ట్రాలజి, పామిస్ట్రీ,    
న్యూమరాలజీ, పుస్తకాలతో పాటు కలల ఫలితాల వంటి పుస్తకాలు కూడా చదవడం అలవాటయ్యింది.అడిగిన వారికి సరదాగా విశ్లేషించి చెప్పడం అలా అలవాటైపోయి మా రూమ్ ఎప్పుడూ నిండుగా ఉండేది జనాలతో. మా గొడవకు మా వార్డెన్ అప్పుడప్పుడూ రౌండ్స్ వేయించేది అర్ధరాత్రి. మేం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆవిడకే పనిష్మెంట్ ఇచ్చేవారం. నేనంటే మంచి అభిప్రాయమే ఉండేది కాని ఆవిడ రూమ్ ముందే మా రూమ్. అందరు మా రూమ్ లో చేరి అల్లరి చేసేవారు. అందుకే పనిష్మెంట్, రూమ్ లో ఉన్న అందరికీ. 
రకరకాల మనస్తత్వాల పరిచయంతో హాస్టల్ జీవితం చాలా నేర్పింది. హాస్టల్ లో ఉన్నన్నాళ్ళూ ఎవరూ నాతో గొడవ పడలేదు కూడా. కాస్త మా నీలిమనే అప్పుడప్పుడూ రూమ్ కి అందరు వస్తున్నారని కోపం తెచ్చుకునేది. అప్పుడప్పుడు రాత్రిపూట డిన్నర్ అయ్యాక కాస్త అన్నం రూమ్ కి తెచ్చుకుని, రెండింటికి లేపమని, ఆ టైమ్ లో పచ్చడి కలుపుని అన్నం తిని నిద్రపోయేది. భలే నవ్వుకునేవాళ్ళం. బి ఎల్ థెరీజా ఎలక్ట్రికల్ ఫోర్ వాల్యూమ్స్ బుక్ తల కింద పెట్టుకుని పడుకోవడం, ఎందుకలా అంటే కాస్తయినా బుర్రలోకి పోతుందిలే మంజూ అనేది. ఇలా బోలెడు కబుర్లు హాస్టల్ జీవితంలో. 

వచ్చే వారం మరిన్ని కబుర్లతో.... 
 
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner