7, జులై 2020, మంగళవారం
రమ్య ద రోబో సమీక్ష...!!
రమ్య ద రోబో సమీక్ష...!!
మనసు ఆలోచనలకు ఆధునిక రెక్కల ఊహల ఊయల " రమ్య ద రోబో "
బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదురాలైన డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్ విశ్వపుత్రికగా తెలియని సాహితీకారులు లేరు. వీరు కవిత్వం రాయడంలోనూ, అనువాదం చేయడంలోనూ దిట్ట. తన రచనా వ్యాసంగంలో మరో ప్రక్రియ కథ చోటు చేసుకోవడం ముదావహం. అది తన చుట్టూ జరిగే సంఘటనలకు, తన మనసులో రేకెత్తిన సరికొత్త ఆలోచనలకు ఆధునికతను ఊహగా జోడించి, ఆ ఊహల చుట్టూ చక్కని కథనాన్ని నడిపించి, కథగా మలిచి " రమ్య ద రోబో " కథా సంపుటిగా మన ముందుకు తెచ్చారు.
ఆధునిక టెక్నాలజీ, అదీనూ ఓ రోబోట్ మన జీవితాల్లోకి వస్తే ఫలితాలు, పర్యవసానాలు ఎలా ఉంటాయెా తెలిపే కథ రమ్య ద రోబో. రెక్కలకు దెబ్బ తగిలి ఎగరలేక నిస్సహాయంగా వున్న పక్షి, ప్రయాణం పిల్లలు పై చదువులు చదవాలన్న కోరికను పోల్చుతూ ఓ తల్లి తీసుకున్న నిర్ణయం కలల రెక్కలు కథ. మీటూ..అమ్మా అంటూ సమస్యను తెలివిగా పరిష్కరించుకుంటూ, చదువుకోవాలన్న కోరికను తీర్చుకున్న తెలివిగల పనిపిల్ల కథ ఇది. తానధిగమించిన సమస్య డిప్రెషన్ వల్ల పాడవబోయిన ఓ జీవితానికి చక్కని దారి చూపిన ఓ లెక్చరర్, స్టూడెంట్ కథే ఈ డిప్రెషన్. చక్కని సందేశాత్మక కథ. పెరిడోలియా అన్న మానసిక లక్షణాన్ని వివరిస్తూ, మంచి కలలు జీవితానికి చూపిన మంచి బాట గురించి తెలిపిన కథ రెక్కల కొండ. మన మనసే మన ఆలోచనలు అనే బుద్ధుని ప్రభోదాన్నెరిగి జీవితాన్ని ఆనందంగా గడపడమెలాగో తెలియజెప్పే కథ మనసును విను. పెంపుడు జంతువులపై మన ప్రేమ, వాటికి మన మీదున్న ఇష్టాన్ని తెలిపే కథ లైకా. 2035 లో జరగబోయే పరిణామాల గురించి మనుమడు ఊహించి చెప్తే, రాబోయే కాలంలో ఆధునిక పరిణామక్రమం గురించి అమ్మమ్మ తన చిన్నతనంలో చదివిన కథను మనమడికి చెప్పడం చాలా బావుంది. అమ్మమ్మ చేతి ముద్ద నుండి అమ్మ పిలుపుతో వాస్తవంలోకి వచ్చినట్టుగా, జ్ఞాపకాల గోడ కథలానే మనందరి జ్ఞాపకాలు కూడా మనల్ని పలకరిస్తాయి హాయిగా. ఆత్మహత్యలకు గల కారాణాలను సహేతుకంగా వివరిస్తూ, పరిష్కార మార్గాలను కూడా సూచించిన కథ జీవన వారధులు. పిల్లలకు అమ్మ చెప్పే కథల ఆధారంగా కలిగిన అంతరిక్ష యానం వంటి గొప్ప ఆలోచనలను నిజం చేసుకున్న కథ విశ్వం పిలిచింది. తరాల అంతరాయ ఆలోచనలకు అద్దం పట్టే కథ మైండ్ సెట్.
ఆధునిక ఆలోచనలు, జ్ఞాపకాలు, మనిషి మైండ్ సెట్, వైవాహిక జీవితాల్లో కొన్ని సమస్యలు, పిల్లల ఆలోచనలు, వాటికి పెద్దల సహకారం ఇలాంటి కథలన్నీ మనకు "రమ్య ద రోబో " లో కనిపిస్తాయి. ఎక్కువగా ఫ్యూచర్ టెక్నాలజీ గురించిన ఊహల కథలున్నాయి. భవిష్యత్తులో ఈ ఊహలే నిజం కావచ్చునేమెా. సులభ శైలిలో 12 కథల సంపుటిగా వెలువడిన "రమ్య ద రోబో " కు హృదయపూర్వక అభినందనలు.
వర్గము
సమీక్ష
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి