22, జులై 2020, బుధవారం

కాలం వెంబడి కలం...11

      అనుకున్నట్టుగానే మా EC-II  శివారెడ్డి సర్ పుణ్యమా అని ఆ లాబ్ ఉండిపోవడంతో 4వ సంవత్సరానికి ప్రమెాషన్ ఆగిపోయింది. ఫీజ్ కట్టడానికి పట్టుకెళ్ళిన డబ్బులు తిరిగి తెచ్చేసాను. అప్పటి వరకు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మాకు, ఆ డబ్బులతో రొయ్యపిల్ల చెరువులో వేయమని నాన్నకు ఇచ్చేసాను. అప్పటి నుండి అందరికి పోయినా రొయ్యల చెరువుల్లో మాకు బాగానే డబ్బులు వచ్చేవి. అంతకు ముందు కూడా రొయ్యల చెరువుల్లో నష్టం ఎప్పుడూ రాలేదు. 
         నాన్నని విజయనగరంలో ఫ్రెండ్ మెాసం చేయడంతో మా అమ్మమ్మ గారి ఊరు జయపురం వచ్చేసామని చెప్పాను కదా. తర్వాత నాన్న అంతకు ముందు చేసిన రొయ్యల వ్యాపారం మెుదలుబెట్టారు, రొయ్యల చెరువులు వేయడంతో పాటుగా. నా చదువు కోసం ఐదు ఎకరా చెరువులు అమ్మి నాకు డబ్బులు కట్టారు. వ్యాపారంలో డబ్బులు వాటా పెట్టడానికి లేక అమ్మ బంగారం 25 నవర్సలు మచిలీపట్నంలోని లీలా కోటేశ్వరరావు వద్ద పెట్టారు. నాన్నతో పాటు మరో ఇద్దరు కూడా ఉండేవారు.వాళ్ళ మాటలు ఏం విన్నాడో తెలియదు కాని లీలా కోటేశ్వరరావు మా అమ్మ బంగారం ఇవ్వలేదు. తర్వాత వైజాగ్ వాళ్ళకి రొయ్యలు వేసేవారు. ఆ దరిద్రుడు 3 లక్షలు ఎగ్గొట్టాడు. కాని మనల్ని సరుకు వేసినవారు ఊరుకోరు కదా. బయటివాళ్ళ కన్నా అయినవాళ్ళు అస్సలూరుకోరు. అర్ధరాత్రి ఇంటికి వచ్చి మీరు తినడం లేదా అని నానా మాటలు అడిగి వెళ్ళారు. కొందరైతే అంతకు ముందు వరకు బోలెడు ప్రేమ ఒలకబోసి, ఆ టైమ్ లో బయట కనబడినా, మనం పలకరించినా ముఖం తిప్పుకుని వెళిపోయారు. ఉన్న పొలం అమ్మేసి అప్పులన్నీ కట్టేసి మళ్ళీ ఉత్త మనుషులం మాత్రమే మా ఊరు నరశింహాపురం వెళిపోయాము. అయినవాళ్ళే అని ఒకరితో కలిసి మళ్ళీ చెరువులు వేస్తే కాస్త బానే వచ్చే సరికి ఆయనకు కడుపుబ్బరం పుట్టి, గొడవ పెట్టుకున్నాడు. మధ్యవర్తులుగా మా పెదనాన్న, మరొకాయన వెంకటేశ్వర్లు గారు ఉండి మాతో10,000లో 30,000లో సరిగా గుర్తు లేదు, ఆయనకు అప్పుగా ఇప్పించారు. నేనే అడిగానప్పుడు ఆయన ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి అంటే మేమిస్తామని చెప్పారు. వెంకటేశ్వర్లు గారు చనిపోయారు, అప్పు కట్టాల్సినాయనా ఈమధ్యనే పోయారు.  అదేమని మనం అడిగితే మీరు గొడవ పడుతున్నారని అలా చెప్పామన్నారు. మధ్యవర్తిత్వాలు ఇలా ఉంటాయన్నమాట. 
         రక్త సంబంధీకులు కూడా అరలీటరు పాలు పోయడానికి, మీకు కావాల్సిన పాలు ఓ పూటే తీసుకోండి, మాకు పాలకేంద్రంలో గరిటెడు పాలు పోతాయి అన్నారు. మా చేతుల్లో పెరిగిన గేద దూడను విజయనగరం నుండి వచ్చేటప్పుడు మాతోపాటు లారీలో తీసుకువచ్చాము. మా నాన్న తీసుకున్న రెండువేలు ఇవ్వలేడేమెానని ఆ దూడను ఉంచేసుకున్నారు మా రక్త సంబంధీకులు. మన దగ్గర రూపాయి లేనప్పుడు అయినవాళ్ళెవరూ అక్కరకు రారన్న సత్యం మీకందరికి కూడా బోధపడాలనే ఇదంతా చెప్పాను. మా నాన్న చేతిలో రూపాయి లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో కూడా ఏనాడు నాకు పుస్తకాలు కొనివ్వడం మానలేదు. తర్వాత  స్టేడియంలో కూర్చుని క్రికెట్ మాచ్ లు చూసిన రోజులు ఉన్నాయి. అదే టైమ్ లో చింతామణి నాటకం కింద కూర్చుని చూసిన రోజులూ ఉన్నాయి. నేను నాన్నతో అనేదాన్ని. 
" నాన్నా ఇవన్నీ నాకు అంత సంతోషమివ్వలేదు కాని నువ్వు నీ దగ్గర డబ్బులు లేనప్పుడు కూడా నాకు పుస్తకాలు కొనిపెట్టావు. అదే బోలెడు సంతోషాన్నిచ్చింది " . అని. 
ఇలాంటి కొన్ని అనుభూతులు చెప్పడానికి మాటలు కూడా చాలవు. 
         మా ఫైనలియర్ బాచ్ అందరు ఇండ్రస్టియల్ టూర్ వెళుతున్నారు రెండు బాచ్ లుగా. కొడైకెనాల్, ఊటి ఆవైపు ఒక బాచ్, హైదరాబాదు వైపు మరో బాచ్. నేను, ఫస్ట్ ఇయర్ నుండి నాతోపాటున్న తమిళ్ళమ్మాయి నా ఫ్రెండ్ ఉమారాణితో  హైదరాబాదు టూర్ కి అందరం బయలుదేరాం. అప్పటికే నేను ఖాళీగా ఉండటమెందుకని హైదరాబాదులో మా పిన్ని వాళ్ళింట్లో ఉండి లోటస్ 123, డాటాబేస్ కంప్యూటర్ ట్రైనింగ్ క్లాసులు నేర్చుకుంటున్నాను. హైదరాబాదు నుండి బళ్ళారి వెళ్ళి, మళ్ళీ బస్ లో హైదరాబాదు బయలుదేరాం అందరం. మా సీనియర్ షర్మిల యూనివర్శిటీ గోల్డ్ మెడలిస్ట్ ఫైనలియర్ కి లెక్చరర్ గా ఉన్నారప్పుడు. ఆవిడ, ఈరన్న సర్ మాతో టూర్ కి వచ్చారు. పొద్దు పొద్దున్నే ఆవిడ వెనుక సీట్ లోని నాకు గుడ్ మార్నింగ్ చెప్పారు. నేను ఓ నవ్వు నవ్వి గుడ్ మార్నింగ్ చెప్పాను. అసలు ఆవిడ నాతో మాట్లాడుతుందని ఊహించలేదు. హోటల్ లో రూమ్స్ తీసుకున్నారు. మా అమ్మాయిలకి రెండు రూమ్స్ ఇచ్చారు. మా పక్క రూమ్ షర్మిల మాడం, మరికొంత మంది అమ్మాయిలు, నేను, ఉమారాణి, యశు, అనూరాధ ఒక రూమ్. షర్మిలకు చీర కట్టుకోవడం రాక మా రూమ్ కి వచ్చింది పిన్ పెట్టమని. అలా నాకు బాగా క్లోజ్ అయిపోయింది నాలుగు రోజులలోనే. టూర్ అంతా బాగా ఎంజాయ్ చేసాము. హోటల్ లో టిఫిన్, భోజనాలప్పుడు ఎవరు ఎక్కువ సోంపు తెస్తే వారికి పార్టీ ఇస్తానని షర్మిల చెప్పారు. మెుత్తానికి నేనే ఎక్కువ సోంపు తెచ్చి చాకోబార్ ఐస్క్రీమ్, పైనాపిల్ జూస్ గెలిచాను. ఏం పార్టీ అన్నది షర్మిల ఛాయిస్ మరి. ఓరోజు సెకెండ్ షో సినిమాకి ప్లాన్ చేసారు. గాయం కాని, మేజర్ చంద్రకాంత్ కాని అన్నారు. నేను గాయం చూద్దామంటే అందరు సరేనన్నారు. కృష్ణకాంత్ వాళ్ళ బాచ్ ఈ టూర్ మెుత్తం ప్లాన్ చేసారు. చాలా బాగా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూసారు. ఆ నాలుగు రోజులు నాగార్జున సాగర్, BHEL, ECIL, బిర్లామందిర్ ఇంకా ఏవో చూసాము. మధ్యలో అనురాధ రమ్మంటే అందరం వాళ్ళింటికి కూడా వెళ్ళాము. నాకు బొమ్మలు బాగా ఇష్టం. నాగార్జున సాగర్ మ్యూజియం బోట్ లో వెళ్ళి చూసి, వచ్చేటప్పుడు వైట్ సిమ్మెంట్ తో చేసిన బొమ్మలు కనబడితే చాలా బొమ్మలు కొన్నాను అందరికని. అప్పట్లో ఎక్కడికి వెళ్ళినా ఏదోకటి కొనడం నాకు అలవాటు. షర్మిలకు, ఈరన్న సర్ కి రామన్,  అంజయ్య చౌదరి వాళ్ళు పార్టీ ఇచ్చారు. రామన్ చుడీదార్ వేసుకుని షర్మిలకు కంపెనీ ఇవ్వడం కొసమెరుపన్నమాట. లాస్ట్ రోజు కృష్ణకాంత్ వాళ్ళు డిన్నర్ పార్టీ ఇచ్చారు అమ్మాయిలందరికి. అప్పటికే నా రాతల గురించి అందరికి తెలుసు. వరకట్నం మీద కవిత చెప్పమంటే నాకు చెప్పడం రాదు, రాయడం మాత్రమే వచ్చని చెప్పాను. అలా చాలా సరదాగా టూర్ గడిచింది. నేను అటునుండి అటే ఆ రాత్రికి అనురాధ వాళ్ళింట్లో ఉండి మరుసటి రోజు మా పిన్ని వాళ్ళింటికి వెళిపోయాను.  

వచ్చే వారం మరిన్ని కబుర్లతో....

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner