11, జులై 2020, శనివారం

త్రిపదలు..!!

1.   పసితనమెంత మురిపెమెా
వానలో తడుస్తూ
కాలు జారి బురదలో పడినా..!!
2.  లెక్కలేసుకుంటూ బతికేయట్లా
మనసుకు మనీకి ముడి పెడుతూ
ఆస్వాదనకు అర్థం తెలియకుండా...!!
3.  ప్రతి క్షణము విలువైనదే
నిన్నటికి రేపటికి నడుమన
ఈరోజన్న జూదంలో...!!
4.  యుగాల నిరీక్షణను
మౌనం మాటాడుతుంటే
వినాలని ముచ్చట పడుతూ.. !!
5.  అరకొరగా మిగిలాయి
అనుబంధపు ఆనవాళ్ళు
చరిత్ర చెప్పలేని పాఠాలుగా...!!
6.   క్షణాలలా మరిపించేస్తున్నాయి
ముసిరిన జ్ఞాపకాల
ముచ్చట్ల నెమరువేతలతో...!!
7.   తడబాటు మనసుదని
అమాయక అక్షరాలకేం తెలుసు 
రాతెందుకు గజిబిజిగా ఉందో...!!
8.  కాలానికెంత తొందరో
క్షణాలనన్నింటిని తరుముతూ
గతాన్ని వదిలేస్తూ..!!
9.   నేను 
నీకు తెలియని
మనోగతం...!!
10.   నువ్వు 
నాకు అర్థమైన
అనుబంధం..!!
11.   లక్షణమే 
ఆభరణం అక్షరానికి
అమ్మ నేర్పినందుకేమెా...!!
12.  నిశ్శబ్ద శబ్దాలతో పనేముంది
ఏకాంతంతో సహవాసం మెుదలై
జ్ఞాపకాలు మనవైనప్పుడు...!!
13.   మలి పొద్దు 
ఆరుబయట వెన్నెల కబుర్లు 
మరలిపోని జ్ఞాపకాలే ఎప్పటికి..!!
14.  మనసు మురిసింది
చినుకుల్లో తడిసిన
బాల్యం మరోసారి తాకినట్లనిపించి..!!
15.   అనుసంధానం 
అవసరమా
మన మధ్యన...!!
16.  ఆత్మ బంధమని
అనిపించిన అనుభూతి
అక్షరంతో జత కలిసాక..!!
17.   గతజన్మ బంధాలు
మరుజన్మ పాశాలుగా
ఈ అక్షరాలే కావాలన్న దురాశ...!!
18.   గతం నుండి
తప్పించుకోవడం అలవాటే
కాలానికెప్పుడూ...!!
19.   జీవితమే నువ్వు
గతంగానో
జ్ఞాపకంగానో...!!
20.   మనంలోనే
నేను నువ్వు ఇమిడిపోయాం
ఈ విడదీయడాలెందుకటా...!!
21.   చావో ఆత్మీయం
బంధాలకు బాధ్యతలకు
విరామమిస్తూ...!!
22.   గుండె గుప్పెడే అయినా
సుళువుగా తనలో ఇమిడ్చేసుకుంది
ఓ జీవిత పుస్తకాన్ని ఆసాంతం...!!
23.   మాట పట్టింపు వచ్చినా
మరచిపోయే బంధమా అది
అనుక్షణం ఆసరానే ఇప్పటికి..ఎప్పటికి...!!
24.   అన్నిసార్లుా
మౌనం కూడదేమెా
మనసు తెలియాలంటే..!!
25.   కనుల నిండా జలపాతాలే
గుండె తడి మదికి చేరి
అక్షర తామరలు పరిచాయనుకుంటా..!!
26.  అమ్మదనమంతే
ఎన్నేళ్ళు పైబడినా ఎప్పటికీ తరిగిపోని
పసితనాన్ని జ్ఞాపకంగా మనకందిస్తూ..!!
27.  కాస్తే ఆత్మాభిమానమది
ఆత్మీయంగా పలకరించి చూడు
అనుబంధమై అల్లుకుపోతుందలా...!!
28.  గెలిచామన్న
అహంలో ఉన్నాం
ఆత్మీయతను దూరం చేసుకున్నామని తెలియక..!!
29.   శిలాక్షరాలే అన్నీ
జ్ఞాపకాల కాలం క్షణమైనా
మనసు సిరాతో లిఖించానని..!!
30.   జీవాత్మలోని
పరమాత్మే 
సర్వాంతర్యామి...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner