పూర్వీకుల తెలుగు మూలాలను మహోన్నతంగా, దేదీప్యమానంగా వెలిగించి చరిత్ర పుటల్లో ఓ నూతనాధ్యాయాన్ని లిఖించిన అద్భుతవ్యక్తి మారిషస్ నివాసి శ్రీ సంజీవ నరసింహ అప్పడు గారు. వీరి చేతిలో రూపుదిద్దుకున్న తెలుగు అక్షరాల పట్టి(ఫాంట్) త్వరలో "మారిషస్ సంజీవ తెలుగు పట్టి(ఫాంట్)గా వెలుగులోనికి రానుంది.
భరతభూమికి 5445 యెాజనాల దూరంలో గల మారిషస్ దీవుల నివాసితులయిన శ్రీ సంజీవ నరశింహ అప్పడు గారి ముత్తాతలు మన ఆంధ్రులు. సంజీవ నరశింహ అప్పడు గారికి ముత్తాతల మాతృ
భాష అన్న అంతులేని ప్రేమ. భరతభూమికి సుదూరంగా ఉన్నా తెలుగు మీద అభిమానంతో, మారిషస్ ప్రభుత్వ సహాయ, సహకారాలతో అక్కడి పిల్లలకు పాఠశాలలో తెలుగు నేర్పడము, మన భారతీయ సంస్కృతీ, సనాతన సంప్రదాయాలను వివరించడములో చాలా కృషి చేస్తున్నారు.
శ్రీ సంజీవ నరశింహ అప్పడు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. వీరికి తెలుగు భాషపై మంచి పట్టు ఉండటమే కాకుండా, దైవానుగ్రహముతో వివిధ రంగుల పెన్నులతో, 8,12,16 కలాలను ఒకేసారి ఉపయెాగిస్తూ తెలుగు లిపిని తనదైన శైలిలో అందంగా రాయగలరు. అంతేకాకుండా సొంపుగా పెద్ద పెద్ద రంగవల్లులను అత్యద్భుతంగా వేయగలరు, అదీ అతి తక్కువ సమయంలో. వీరు తెలుగు సాంస్కృతిక పసుపు ఝండాను రూపొందించారు. ప్రపంచంలోని లక్షలాది తెలుగువారికి తెలుగు వ్యాఖ్యాతగా పరిచితులై, తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను తన అద్భుత వ్యాఖ్యానంతో మన కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తున్నారు. పదివేల సార్లు భారతదేశాన్ని సందర్శించాలన్న దృడ సంకల్పం వీరిది. ఇప్పటికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 149 పుణ్య ప్రదేశాల నుండి మట్టి ప్రసాదాన్ని తమ ఇంటి దేవుని గదిలో గుట్టలు గుట్టలుగా అలంకరించారు. తాను వెళ్ళిన ప్రతి ఊరిలోని ప్రముఖులతో తెలుగు సాహిత్య కార్యక్రమాలు నిర్వహించి, అదే వేదికపై అందరి సమక్షంలో వయసులో పెద్దాయనను, ఓ యువకుడిని పిలిచి, ఆ యువకుడితో పుట్ట మట్టిని తవ్వించి, ఆ పెద్దాయన చేతుల మీదుగా మట్టిని స్వీకరించి తనతో మారిషస్ తీసుకువెళ్ళారు. తెలంగాణా ప్రభుత్వం మారిషస్ లో పెట్టబోతున్న శ్రీ పాములపర్తి వేంకట నరశింహారావు గారి విగ్రహానికి, తెలుగుతల్లి విగ్రహానికి భూమి పూజలో ముందుగా శ్రీ సంజీవ నరశింహ అప్పడు గారు ఇప్పటి వరకు సేకరించిన భరతభూమి మట్టి ప్రసాదాన్ని ముందుగా వేసి, ఆ తరువాత విగ్రహ ప్రతిష్ఠ పనులు మెదలుబెడతారు. నాకు తెలిసి ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు చేయని ఈ మట్టి సేకరణకు దక్కిన అపూర్వ గౌరవమిది. ఈ గౌరవాన్ని శ్రీ సంజీవ నరశింహ అప్పడు గారికి అందించిన తెలంగాణా ప్రభుత్వానికి శుభాభినందనలు.
తెలుగు భాషలో చిరస్థాయిగా నిలిచిపోయిన సి పి బ్రౌన్ మహాశయుని మనం నిత్యం స్మరించుకున్నట్లే, శ్రీ సంజీవ నరశింహ అప్పడు గారిని కూడా గుర్తు చేసుకోవాలి. శ్రీ సంజీవ నరశింహ అప్పడు గారి తెలుగు భాషా సేవలలో సరి కొత్త అధ్యాయం చోటు చేసుకుంది. అది ఈయన రాసిన తెలుగు అక్షరాలను మారిషస్ సంజీవ తెలుగు పట్టి(ఫాంట్)గా వాడుకలోనికి రానుంది. అను ఫాంట్, బాపు ఫాంట్ వగైరా ఫాంట్ లు మనకు అందుబాటులో ఉన్నట్లుగా ఈ "మారిషస్ సంజీవ తెలుగు పట్టి(ఫాంట్) త్వరలో వాడుకలోనికి రానుంది. ప్రవాసులలో ఈ ఘనతను అందుకున్న మెుదటి వ్యక్తి శ్రీ సంజీవ నరశింహ అప్పడు గారు. తెలుగు భాషా చరిత్రలో వీరి పేరు అజరామరంగా నిలిచిపోతుంది. ఈ మారిషస్ సంజీవ తెలుగు పట్టి తయారు చేయడానికి దాదాపుగా నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది. ఇది చాలా ఖర్చు, శ్రమతో కూడుకున్న పని. అతి తక్కువ ఖర్చుతో ఈ మారిషస్ సంజీవ తెలుగు పట్టి తయారయ్యింది. దీనికి ఆర్థిక సహాయ, సహకారాలను అందించి తమ దొడ్డ మనసును చాటుకున్న శ్రీ లయన్ విజయకుమార్ గారు, కృష్ణ వల్లభనేని గార్లకు తెలుగు భాషాభిమానులందరు బుుణపడి ఉంటారు. శ్రీ లయన్ విజయకుమార్ గారు తెలుగు సాహిత్యాభిమాని. ఎందరి పుస్తకాలకో ఆర్థిక సహాయం అందించారు. పలు సేవా కార్యక్రమాల్లో తన ధాతృత్వాన్ని చాటుకుంటున్నారు. వీరంతా శ్రీ సంజీవ నరశింహ అప్పడు గారికి ముఖ పరిచయం లేని వారే. అయినా తెలుగు భాష మీద ప్రేమతో వీరంతా ఈ మహా యజ్ఞంలో తమ వంతుగా సహాయ సహకారాలందించి భాషాభిమానాన్ని చాటుకున్నారు.
భగవదనుగ్రహం మెండుగానున్న సంజీవ నరశింహ అప్పడు గారు మరో మహతి కార్యం తలపెట్టారు. అది శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి 32000 సంకీర్తనలలో ప్రసిద్ధి పొందిన 30 సంకీర్తనలను " మారిషస్ అన్నమయ్య గీతాలు " పుస్తకంగా తీసుకురానున్నారు. దాతల సహయంతో 55 వేల పుస్తకాలు ప్రచురించి ప్రపంచవ్యాప్తంగా, ఈ పుస్తకం కావాల్సిన వారికి ఉచితముగా ఇవ్వనున్నారు. ఈ పుస్తకంలో ప్రతి కీర్తన ఐదు భాగాలుగా విభజింపబడి ఉంటుంది. మెుదటి భాగంలో సంకీర్తన తెలుగులో, రెండవ భాగంలో ఆంగ్లంలో మూడవ భాగంలో తెలుగు భావం, నాలుగవ భాగంలో ఆంగ్ల భావం, ఐదవ భాగం పుస్తకం వెనుక ఈ కీర్తనలన్ని వినడానికి వీలుగా సిడి లో పొందుపరిచి మనకు ఉచితముగా అందివ్వనున్నారు. ఈ పుస్తకం వేయడానికి ముఖ్య కారణం తెలుగుభాష తెలియని ఎంతోమంది ఈ సంకీర్తనలను రాగతాళ యుక్తంగా పాడగలుగుతున్నారు కాని భావయుక్తంగా పాడలేక పోతున్నారన్న కారణంతో ఈ అద్భుతమైన ఆలోచన చేసారు.
ఈ " మారిషస్ సంజీవ తెలుగు పట్టి " ఎవరికైనా తమ తమ గణన తంత్ర యంత్రములు(కంప్యూటర్) లేదా చర వాణి యంత్రము(సెల్ ఫోన్) ద్వారా ఎవరి అనుమతి లేకుండా వాడుకోవచ్చును. ఒక్క నయా పైసా కూడా మనం ఎవరికి ఇవ్వనవసరం లేదు.
ఇప్పటి వరకు తెలుగు పట్టీలు వెలువడ్డాయి. భారత పుణ్య భూమి లో ఉన్న తెలుగు ప్రజలు వాళ్ల వాళ్ల తెలుగు చేతిరాతల నైపుణ్యము వలన ఎన్నెన్నో తెలుగు లిపులు వివిధ శైలులలో సృష్టించబడ్డాయి.అవి అన్నీ భారతీయుల చేతిలో తయారు అయ్యాయి. కాని ఇప్పుడు భారత పుణ్య భూమి యొక్క సరిహద్దులు దాటి, మన తెలుగు కళామతల్లి వారి పరిమళమైన సుమధుర సువాసనతో సప్త సముద్రాలు దాటి ఓ చిన్ని ద్వీపములో పుట్టి పెరిగిన మారీచ మహర్షి పుణ్య భూమి అయిన మారిషస్ ద్వీపములో పుట్టి పెరిగిన సంజీవ నరసింహ అప్పడు వారి తెలుగు హస్త రేఖలతో రాసిన అన్ని తెలుగు అక్షరాలు, ద్విత్వాలు, సంఖ్యలు, చిహ్నాలు ఇప్పుడు ఈ ఆధునిక సాంకేతిక పద్ధతి లో చేయబోతున్నది. తెలుగు చరిత్రలో ఈ అద్భుత సంఘటన సువర్ణ తెలుగు అక్షరాలతో రాయబడుతున్న దేశీయ తెలుగు పట్టి ఈ " మారిషస్ సంజీవ తెలుగు పట్టి",
ఈ పట్టి తయారుచేయాలన్న సుమధుర ఆలోచన సంజివ నరశింహ అప్పడు గారికి ఎలా వచ్చిందంటే, తన తాతయ్య ఒక అతి పాత తెలుగు పెద్ద బాల శిక్ష అనే తెలుగు జాతికి " తెలుగు వేదం " లాంటి పుస్తకాన్ని ప్రసాదించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ తెలుగు పెద్ద బాలశిక్ష అందరికిచిరపరిచితమే.
సంజీవ నరశింహ అప్పడు వారి తాతయ్య " ఆంధ్ర" జనానండ సహాయ సంఘం " నడుపుతున్న దేవస్థానము మారిషస్ దేశంలో తెలుగు వాళ్ళు తొలుతగా కట్టి, విగ్రహం స్థాపించిన శ్రీ విష్ణు దేవస్థానం. వీరి తాతయ్య గారే ఆ ఆలయ అస్తానార్చకులు.
ఐదు సంవత్సరాల పసి వయస్సు నుంచి తాతయ్య సంజీవ నరశింహ అప్పడు వ్రేళ్ళను పట్టుకుని ప్రతి రోజు ఆలయానికి తీసుకుని వెళ్లేవారు. ఆలయంలోనే చాలా మంది తెలుగు యువతీ యువకులు తాతయ్య దగ్గర తెలుగు నేర్చుకునే వారు. సంజీవ నరశింహ అప్పడుకి తాతయ్య మాట్లాడే తెలుగు మరియు రాసే తెలుగు వలన అతనికి ఒక ప్రేరణ ఉత్సాహం ఉద్భవించింది.
తెలుగు యొక్క అందం మరియు తెలుగు అన్ని అక్షరాల లిపులు గుంద్రాకారంలో మాత్రమే ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఉన్న వేలాది భాషల లిపులతో పోల్చి చూస్తే తెలుగు లిపి యొక్క లిపి అన్ని అక్షరాలు తామర పువ్వులు ఉన్న దళాల ఆకారంలో మనకు దర్శనం ఇస్తాయి. శ్రీ మహా విష్ణువు, శ్రీ మహా లక్ష్మీ, శ్రీ సరస్వతీ దేవి బొమ్మలు మనకు పద్మము మీదనే దర్శనం ఇస్తాయి.ఈ కారణంగా సంజీవ నరశింహ అప్పడు గారు ఎంతో ఆసక్తితో సొంతంగా అనేక వ్యయప్రయాసలకు ఓర్చు, వినూత్న పద్ధతి సృష్టించారు పరాయి దేశంలో తెలుగు కోసం.తెలుగు మీద ప్రేమతో.
మారిషస్ ద్వీపము లో ఎప్పుడైన ఎక్కడైనా ఎవరి ఇంట్లో అయినా శుభ కార్యం ఉంటే సంజీవ నరశింహ అప్పడు గారి దగ్గరకు వచ్చి, శుభకార్యం గురించి చెప్తే ప్రత్యేక ఆహ్వాన పత్రికలు చేతితో ఉచితముగా చేసి ఇచ్చి ముద్రణాలయంలో వందలాది ప్రతులు చేస్తారు. అదే విధముగా అన్ని తరగతులలో ప్రతి సంవత్సరంలో తెలుగు విద్యార్థుల కోసం ప్రతి ఒక్కరికీ విశేష తెలుగు పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ ప్రమాణ పత్రాలు సంజీవ నరశింహ అప్పడు గారు ఉచితంగా చేసి ఇస్తారు.
అంతర్జాతీయ తెలుగు మహా సభలు 1990
సం||లో మూడవ ప్రపంచ తెలుగు మహా సభలు మరియు 1994 సం||లో ప్రథమ అంతర్జాతీయ తెలుగు ఉపాధ్యాయుల మహా సభల యొక్క అధికార చిహ్నానికి(లోగో) రూపకల్పనలు సంజీవ నరశింహ అప్పడు గారే తయారు చేసారు. ఇంకా అనేక తెలుగు సభలకు, మారిషస్ ఆలయాల సభలకు ఆహ్వాన పత్రికల రూపకల్పన వీరే చేసారు.
• రావి ఆకుల మీద చిత్రాలతో సంజీవ నరశింహ అప్పడు గారి కీర్తి ప్రపంచ స్థాయికి ఎదిగింది. గిన్నీస్ అంతర్జాతీయ ప్రసిద్ధి పుస్తకంలో ఈయన పేరు నమెాదయ్యింది. ఎందుకంటే " తెలుగు సాంస్కృతిక వారసత్వం అనే శీర్షిక తో తెలుగు తనం, తెలుగు ధనం, తెలుగు ధర్మం గురించి 1400ల బొమ్మలు రావి ఆకుల మీద గీశారు. ఎవరైనా తనని అడిగితే అవి కూడ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఎంతో సహృదయంతో తెలుగు మీద భక్తితో, అడిగిన వారికి అందిస్తారు.ముఖ పుస్తకములో సంజీవ నరశింహ అప్పడు గారి తెలుగు కళలు మనం చూడవచ్చు.
వీరిని సంప్రదించడానికి ముఖ పుస్తకము ద్వారా : Sanjiva Narasimha Appadoo
అతని వాట్సాప్ చరవాని సంఖ్య(వాట్సప్ నెంబర్):
±౨౩౦౫౭౬౯౫౬౭౬
23057695676
సంజీవ యొక్క విద్యుల్లేఖ విలాసము (ఈమెయిల్ ఐడి) :
simhasan1008@yahoo.com
• ఎవరైనా మీ పేరు పన్నెండు వివిధ రంగుల కలములతో గీయమని అడిగితే, తెలుగు మీద ప్రేమతో ఉచితముగా ఆనందంతో చేసి ఇస్తారు.
ఇంతటి మహోన్నత తెలుగు భాషాభిమానికి ఈ నాలుగు మాటలు ఉడుతాభక్తిగా సమర్పిస్తూ...యావత్ ప్రపంచ తెలుగు వారందరి తరపునా హృదయపూర్వక శుభాభినందనలు.