14, డిసెంబర్ 2020, సోమవారం
ఏక్ తారలు
1. మనసు తెలుపుతోంది_మౌనాన్ని అర్థవంతంగా...!!
2. తొలగించేంత అడ్డుతెరలేమున్నాయ్ మన మధ్యన_అహాన్ని వదిలేస్తే...!!
3. పరిధి తెలియక కాదు_పర్యవసానమాలోచించనివే ఆ బంధాలు..!!
4. భ్రమత తీరదేమెా_అక్షరాలతో మనోభావాలనెంతగా అలకరించినా..!!
5. మౌనం ఆవహించాలి_మనిషిలోని మనసు తెలియాలంటే...!!
6. అలవాటైన అక్షరాలకు తెలిసిపోతుంది_సందర్భం చెప్పకుండానే...!!
7. పరాజితులమయ్యామని మర్చిపోతున్నాం_విరాజితులమన్న భ్రమలో పడి..!!
8. సంతసాలతో సందిగ్ధాలకు తెరలేయడమే_ప్రశ్నలకు తావీయక..!!
9. అమ్మంటే అంతే_తన ప్రాణాన్ని మనకోసం ఇచ్చేస్తూ..!!
10. మనసు పనే అది_మరల మరల తరచి చూసుకోమంటూ...!!
11. చీకటితో కబుర్లాడుతోంది_వెన్నెలకూ చోటిమ్మంటూ...!!
12. విడమరిచి చెప్పడానికేముంది_విషాదాన్ని విదిలించిన కా(క)లానికి..!!
13. ఎడదలో నిండినవీ ఎడబాటులే_అక్షరాలకు అలవాటుగా మారిన ఆనవాళ్ళై...!!
14. తడబడినా తప్పని పయనం_కాలం విదిల్చిన క్షణాల్లో జ్ఞాపకాలను దాచేస్తూ...!!
15. అక్షరాలు గుప్పెడే_అవి అందించే భావాలే అనంతం..!!
16. ఆవిష్కరణ అలవాటైపోయింది_అంతరంగాన్ని అదిలించాలంటే..!!
17. అనునయింపు ఆత్మాక్షరానిదే_మనోతరంగం మాటల సంద్రమైతే...!!
18. ఎన్ని నిరీక్షణలో మనసుకి_వ్యర్థమవుతున్న అనుబంధాల నడుమన...!!
19. బంధాలిప్పుడంతే_ఎప్పుడూ ఓడిపోయేది మనసే మరి..!!
20. ఇప్పటి మనిషితనం అలవాటిదే_మనసుతనాన్ని చేతగాని తనమంటూ...!!
21. మనవారనే భ్రమపడ్డానిన్నాళ్ళు_మనసు మాయలో పడి గ్రహించక...!!
22. సాంకేతిక పరిజ్ఞానం పెరిగి యంత్రాలమైపోయాం_అనుబంధాలను వదిలేస్తూ...!!
23. వొంపేయడానికేం మిగిలాయని_కడగండ్లన్నీ కన్నీళ్లతో కలిసి జారిపోయాకా...!!
24. అయిన చుట్టరికమే మరి_అక్షరాల సాంగత్యానిది...!!
25. పొంతన కుదిరితేనే కదా_అక్షరాలు కుందనంగా అమరేది...!!
26. సత్వరమే అందుతుంది సాంత్వన_అక్షరాలకు మాలిమైన మనసుకు..!!
27. అమ్మ పంచిన ఆస్తి ఈ అక్షరం_బంధాలకు లోబడిపోతామనేమెా ఇలా..!!
28. ఎదురీత తప్పని బతుకులివి_నిందలేయడం బంధాలకు నిత్యకృత్యమేగా..!!
29. అనుబంధపు రణరంగాలింతే_ఆత్మ సంబంధం అక్షరాలతో అయినప్పుడు...!!
30. చూపక చెప్పక తప్పలేదు_నా అక్షర ఖడ్గానికి రెండు వైపులా పదునేనని...!!
వర్గము
ఏక్ తార
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి