12, ఫిబ్రవరి 2021, శుక్రవారం
కానుక...!!
నేస్తం,
రాసే అలవాటున్న వారిని కొన్ని పదాలో లేక కొన్ని భావాలో రాసే వరకు వదలవన్నది సత్యం. అవి భూగోళం చుట్టూ ఆవరించుకున్న నీరులా నిరంతరం పలకరిస్తూనే ఉంటాయి. గాయాలు గతానివైనా ఆ ఫలితం వర్తమాన, భవిష్యత్ కాలాలను ప్రభావితం చేయక మానదు. మన ఒంటరితనానికి ఎవరినో బాధ్యులను చేయడం సబబు కాదు. అలా అని మనకు నచ్చినవారిని అతిగా విసిగించడమూ కరక్ట్ కాదు. పలకరింపు అనేది మనసుకు ఆహ్లాదాన్ని పంచాలి కాని జీవితం మీద విసుగును కలిగించకూడదు. ఎంతసేపూ మన కోణంలో ఆలోచించడం, ప్రతి రాతను మనకు అన్వయించుకోవడం లేదా రాసిన వారికి అంటగట్టడం, మన అభిప్రాయాలను, ఇష్టాలను ఎదుటివారి మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయడం...ఇలాంటి మానసిక లక్షణాలను ఎంత తర్వగా వీలైతే అంత త్వరగా వదిలేయడానికి ప్రయత్నించాలి. ప్రపంచంలో ఉన్న అందరికన్నా మనదే పెద్ద సమస్య అని అనుకోవడమెా మానసిక జాడ్యం.
మాట తూలితే వెనుకకు తీసుకోవడం కుదరదని తెలిసి కూడా, మన లోపాలను కప్పిపుచ్చుకోవడానికి ఎదుటివారి మీద నిందలు వేసేస్తాం చాలా తేలికగా. వయసు పెరుగుతున్న కొద్ది మానసిక పరిణితి మందగించడం బాధాకరం. అన్నీ తెలిసిన మనం మన అతి ప్రవర్తనతో ఎదుటివారిని ఇబ్బంది పెడుతున్నామని తెలుసుకోలేక పోతున్నాం. ఏదైనా మితంగా ఉంటేనే విలువని గుర్తించలేక పోతున్నాం. ఓ తెగ ప్రేమని చూపించేయడం, అంతలోనే మనసును కష్టపెట్టే మాటలనడం, మళ్లీ పలకరించడం...ఇవన్నీ అవసరమా! అతిగా ప్రవర్తిస్తున్నామని మనకనిపించక పోవడం నిజంగా బాధాకరమైన విషయమే. ముందు మన మానసిక స్థితిని తెలుసుకోవడం అవసరం. తర్వాత పక్కవారి తప్పులను ఎత్తిచూపుదాం.
ఎవరైనా ఓ విషయం గుర్తుంచుకోవాలి. మన సమయం మనకెంత ముఖ్యమెా ఎదుటివారి సమయం కూడా వారికంతేనని. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూడటం మానేసి, కాస్త మనసుతో ఆలోచించ గలిగితే అంతా బావుంటుంది. మన మాటలతో ఎదుటివారిని బాధపెట్టి, రాక్షసానందం పొందటం సమంజసం కాదని తెలుసుకుంటే చాలు. బతికి నాలుగు రోజులు ప్రశాంతంగా మనముంటూ మన చుట్టూ ఉన్న వారిని కూడా ప్రశాంతంగా ఉంచగలుగుతాం. ఇదే మనం వారికిచ్చే విలువైన కానుక.
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి