16, ఫిబ్రవరి 2021, మంగళవారం

రాజీనామా...!!

ఓటమితో రాజీ పడలేని మనసుతో
ప్రతి క్షణం పోరు సలుపుతూ
గెలుపుకై నిర్విరామంగా పయనిస్తూనే ఉన్నా

బిడ్డగా బంధాలనల్లుకుని
ఈ భూమి మీద పడింది మెుదలు
నవ్వులతో, కన్నీళ్ళతో ఆటలాడుతునే ఉన్నా

పసితనాన్ని వదులుకోలేదు 
నడిమి వయసునూ కాదనుకోలేదు
రాబోయే పండుతనాన్ని రావద్దనుకుంటున్నా

నలుగురి సంతోషం కోసం
సర్ధుకుపోవడాలను సమర్థిస్తూనే
సరిపెట్టుకోవడం అలవాటు చేసుకుంటున్నా 

నాకంటూ మిగలని కాలాన్ని
ఆలింగనం చేసుకోవాలన్న తాపత్రయాన్ని
బంధించాలనుకుంటూనే బంధనాలను ఆశ్రయిస్తున్నా

బతుకు బావుటానెగరేయలేక
బాధ్యతల బరువును మెాయలేక
జీవితంలో నా పాత్రలకు రాజీనామా లేఖ సమర్పించాలనుకుంటున్నా...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner