13, ఫిబ్రవరి 2021, శనివారం
ఏక్ తారలు...!!
1. అప్పగింతల అంపకాలివి_బుుణశేషాలను అక్షరాలకిచ్చేస్తూ..!!
2. ఎడబాటు తాత్కాలికమే_ఆత్మనివేదన అక్షరాలదైతే..!!
3. మనిషిని ఏమార్చడం సుళువే_మనసుని మళ్ళించడమే కాస్త కష్టం...!!
4. మౌనమెప్పుడూ మంచిది కాదంటున్నా_తప్పొప్పులు తెలియజెప్పడం మన ధర్మమంటూ...!!
5. భారాన్ని పంచుకునే కన్నీటిచుక్కకు తెలుసు_జ్ఞాపకాల విలువెంతో...!!
6. ఓటమి నుండి నేర్చుకున్న పాఠమిది_గెలుపోటములను సమతూకమేస్తూ...!!
7. తరగని ఆత్మీయతలే ఇప్పటికీ_కాలాన్ని శాసించే డబ్బు బంధాల మధ్యన...!!
8. మమత పంచే అక్షరాలివి_మార్పులను చేర్పులను అక్కున చేర్చుకుంటూ...!!
9. మారని మనసు పాశాలివి_చెప్పుడు మాటలకు చెదరని బంధాలతో...!!
10. కొన్ని సాయంకాలాలను ఆహ్వానించా_తడిమిన జ్ఞాపకాలకు గుర్తులుగా....!!
11. కొన్ని ఓటములను గుర్తు చేసుకున్నా_విజయపు పొద్దులను స్వాగతించాలని...!!
12. వెన్నెలనూ వద్దనే ఉండమన్నా_చీకటి చుట్టానికి చోటిద్దామంటూ..!!
13. మది కన్నీరది_అక్షరం ఓదారుస్తోందంతే...!!
14. ఓటమిని భరించే తెగువుంటే చాలు_జీవితాన్ని గెలిచినట్లే...!!
15. మనిషితనం మాటల్లోనే_బంధాలను తూకమేసే తక్కెడలో మెుగ్గు ధనానిదౌతూ..!!
16. మనసు పంచుకున్న చెలిమిది_అక్షరమే అలంకారమై అమరినప్పుడు...!!
17. కొన్ని రాతలంతే_మన మనసుని చదివేసినట్టుగా...!!
18. గుర్తులను వదలివేశాననుకున్నా_నా గుర్తింపే నీవని మరచి..!!
19. సాక్ష్యాలతో పనేముంది?_చెలిమి చిరునామానే మనమైనప్పుడు...!!
20. మమతలే దగ్గర చేసాయి_సంతసాల సంతకాలే వీలునామాలంటూ...!!
21. చదువరుల గొప్పదనమది_మనసాక్షరాలను గుర్తించడంలో..!!
22. అలక తీర్చే సమయమాసన్నమైంది_పలాయన బంధాలకు ధీటుగా చెలిమినందిస్తూ...!!
23. మారిన తలరాతను అంగీకరించాలి మరి_మన చేవ్రాత బాగున్నా లేకున్నా...!!
24. శేషాలు ఎక్కువైపోయాయి_వడపోతల ఎక్కాలు సరిగా రాక..!!
25. ఏ జన్మ బంధమెా ఇది_అక్షరాలతో చేరి అక్కున చేరిందిలా...!!
26. బతుకుపాట బాగా నేర్చుకున్నాననుకున్నా_పాడటమసలేం రాదని తెలియక..!!
27. ఓటమిని ఒప్పుకోవద్దంటోంది మనసు_పోరాట పటిమను పెంచుకోమంటూ...!!
28. జ్ఞాపకాలే ఆలంబన_చేజారిన జీవితానికి...!!
29. మౌనంలోనూ మాటలే మన మధ్యన_మనసుల ఊసులు పంచుకుంటూ...!!
30. తప్పించుకునే నైజం కాదిది_నమ్మితే ఊపిరినైనా వదిలేసే చెలిమిది..!!
వర్గము
ఏక్ తార
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి