15, ఫిబ్రవరి 2021, సోమవారం

కాలం వెంబడి కలం..41


           మన తెలుగు పండుగలన్నీ కూడా అందరం కలిసి బాగా చేసుకునేవాళ్ళం. ఎక్కువగా శ్రీను సంధ్య వాళ్ళింట్లోనే అందరం కలిసేవాళ్ళం. ఓ రెండు నెలలు గడిచే సరికి నేను కాలే దంపతులతో కలిసి ఉండలేక వేరే మెాటల్ చూసుకుంటుంటే సంపత్ మారిన ఫర్నిష్డ్ అపార్ట్మెంట్స్ ఉన్న చోటే రూమ్ ఉందంటే అక్కడ చూసుకుని మారిపోదామని అనుకున్నా. ఆఫీస్ అయ్యాక శ్రీను, అబ్బు బయటకు వస్తామంటే నా లగేజ్ తీసుకుని వాళ్ళు రాకముందే బయటకు వచ్చి నిలుచున్నా. కాసేపటికి వాళ్ళు వచ్చి లగేజ్ కార్ లో సర్ది నా కొత్త రూమ్ కి తీసుకువెళ్ళారు. నేను తీసుకున్న మెాటల్ రూమ్ లో బెడ్, టివి, చిన్న టేబుల్, చైర్, కాసిని వంట సామాన్లు ఉండేవి. బట్టలకు వాషర్, డ్రయర్ వేరే చోట ఉండేవి. రోజు మధ్యాహ్నం లంచ్ సంపత్ కి, అబ్బుకి మా ఇంట్లోనే. సాయంత్రం ఎవరి తిండి వారిది. నన్ను, అబ్బుని సంపత్ రోజూ ఆఫీస్ కి తీసుకువెళ్ళడం, తీసుకురావడం, ఎవరి పనుల్లో వాళ్ళు అలా జరిగిపోతోంది. ఓ రోజు మా మేనేజర్ క్రిష్ జాబ్ మానేస్తున్నానని చెప్పాడు. మా కంపెనీ ఓనర్ పేరు కూడా బాబ్. మా ప్రాజెక్టు పేరు చెప్పలేదు కదా లోయస్ట్ బిడ్స్ డాట్ కాం. బిడ్ బార్ డిజైనింగ్, ASP పేజ్ లింక్స్ బిడ్ బార్ లో పెట్టడం నా పని. బిడ్ బార్ డిజైనింగ్ అంతా క్లయింట్ సైడ్ VC++ లోనే. సర్వర్ సైడ్ సాకెట్ ప్రోగ్రామింగ్ అంతా క్రిష్ ఫ్రెండ్ పేరు సరిగా గుర్తు లేదు మైక్ అనుకుంటా తను చేసేవాడు. మిగతావాళ్ళంతా ASP, Administration, testing చేసేవారు. ప్రాజెక్ట్ లైవ్ అంతా చూసుకునేవారు. ఇష్యూష్ వస్తే ఎవరిది వారు సాల్వ్ చేసేవారు. అలాంటిది సడన్ గా క్రిష్ కి, బాబ్ కి క్లాష్ వచ్చి క్రిష్, క్రిష్ ఫ్రెండ్ జాబ్ కి రిజైన్ చేసేసారు. బాబ్ మీటింగ్ పెట్టి మా అందరికి జాబ్ పర్మెనెంట్ చేసి తన కంపెనీ నుండి వర్క్ పర్మిట్ స్పాన్సర్ చేస్తానని చెప్పారు. 
      మేం ఆలోచించుకుని చెప్తామని చెప్పాము.సాకెట్ ప్రోగ్రామింగ్ గురించి నన్ను చూడమని నాకు మైక్ సిస్టమ్, కాబిన్ ఇచ్చారు. కంపెనీ ఆఫర్ పర్మెనెంట్ తీసుకుంటే మనకున్న H1 కాన్సిల్ అవుతుంది. వీళ్ళు పర్మెనెంట్ అని కూడ తర్వాత జాబ్ తీసేస్తే మనకు స్టేటస్ ఉండదు. కొంత టైమ్ ఉంటుంది. ఆ టైమ్ లోపల H1 ఫైల్ చేయించుకోవాలి లేదంటే ఇల్లీగల్ అయిపోతాము. 
ఇలా పర్మెనెంట్ ఆఫర్ తీసుకుంటే మధ్యలో వేరే ఎవరు ఉండరు. డైరెక్ట్ క్లయింట్ తో మనకు లావాదేవీలుంటాయి. మధ్యలో వెండర్స్ ఉండరన్న మాట. నాలుగు రోజులయ్యాక అందరం సరేనని మా పని మేం చేసుకుంటున్నాం. ఈ మధ్యలో శ్యామ్ ఫ్రెండ్ కూడా మా ప్రాజెక్ట్ లోనికే వచ్చాడు వెంకట్ ఎంప్లాయర్ ద్వారా. నాకు కాస్త తమిళ్ కూడా అర్థమవుతుంది. శ్యామ్ అతన్ని తీసుకురావడానికి ఇక్కడ ఉన్నవారిలో ఎవరినైనా తీసేయించాలని ట్రై చేయడం, నాకు తమిళ్ తెలియదని తను తమిళ్ లో మాట్లాడటం, నేను వీళ్ళకు చెప్పడం జరిగింది. అసలే ప్రాజెక్ట్ ఉంటుందో, పోతుందో అన్న టెన్షన్ మాది. మధ్యలో ఈ గోల. అంటే అన్నానంటారు కానండి మన ఆంధ్రా వాళ్ళు మనవాళ్ళకి అసలు హెల్ప్ చేయరు. మిగతావాళ్ళు అలా కాదు. ఎంతయినా ఒక్క ఆంధ్రా వాళ్ళకు లేనిది మిగతావారికందరికి ఉన్న యూనిటితో శ్యామ్ తన ఫ్రెండ్ ని కూడా మా ప్రాజెక్ట్ లోనికి తెచ్చేసాడు సాకెట్ ప్రోగ్రామింగ్ మీద. 
3 నెలలు నాకు సాలరి పే చేసిన HNC కంపెని తర్వాత పే చేయడం మానేసింది. అడుగుతుంటే క్లయింట్ దగ్గర నుండి రాలేదని చెప్పడం మెుదలుబెట్టారు. మనకి క్లయింట్ తో సంబంధం లేదు, క్లయింట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా మన ఎంప్లాయర్ మనకి పే చేయాలి. సరే ఇస్తారులే అని మరో 3 నెలలు ఊరుకున్నాను. ఈ క్లయింట్ పని చేయించుకుంటున్నాడు కాని మా పేపర్స్ అడగడం  లేదు ఫైలింగ్ కి. ఎనిమిది నెలలు చూసాక ఇక మానేద్దామని నిర్ణయించుకుని, ఎంప్లాయర్ బాబ్ ని అడిగితే సమాధానం చెప్పడం లేదు. వినయ్ గారికి ఫోన్ చేస్తే అడగండి అంటారే కాని ఉపయెాగం లేదు. ఓ నెల రోజులు అలానే ఉన్నా. అబ్బు వాళ్ళ అన్నయ్య దగ్గరకి అప్పుడే వెళ్ళనంటే, సరేనని నాతో ఉండమన్నా. షణ్ముఖ్ కూడ ఫోన్ చేసేవాడు అప్పుడప్పుడు. ఈ విషయం చెప్తే ఇక్కడికి వచ్చేయండి, ఏదైనా జాబ్ చూసుకోవచ్చు అని చెప్పాడు. అప్పటికే తర్వాత నెలకు కూడా మనీ పే చేసేసా. అబ్బు ఉంటానంటే తనకి అప్పజెప్పి, బస్ లో రెండునర్ర రోజులు నెవెడా స్టేట్  కార్సన్ సిటీ నుండి చికాగోలోని అరోరా HNC కంపెనీ గెస్ట్ హౌస్ కి వచ్చాను. అక్కడ విజయ్ అనే అతను ఉన్నాడు. తను ఇండియాకి వెళిపోతున్నాడు. ఓ వారం, పది రోజులున్నాక బాబ్ ఇండియా టికెట్ ఇస్తాను, ఇండియాకి వెళ్ళమన్నాడు. నాకు H1 కూడా వీళ్ళ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయలేదు. నేను పక్కన షాప్ కి వెళితే అక్కడ కనబడిన కాప్(పోలీస్ ని కాప్ అంటారు) కి జరిగిన విషయం అంతా చెప్పాను. కాప్ బాబ్ నంబర్ అడిగితే ఇచ్చాను. బాబ్ కి కాల్ చేసి తిట్టాడనుకుంటా. ఆ సాయంత్రం బాబ్ గెస్ట్ హౌస్ కి వచ్చి వాడిష్టం వచ్చినట్టు తిట్టి, గెస్ట్ హౌస్ నుండి వెళిపొమ్మన్నాడు. ఆ విజయ్ బాగా భయపడిపోయాడు. రావాల్సిన డబ్బులు ఇమ్మన్నాను నేను. ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. షణ్ముఖ్ కి కాల్ చేసి చెప్పాను జరిగింది. వాళ్ళ రూమ్ లో పూజారి గారు, తనతో పాటు ఉండమని చెప్పాడు. నేను కార్సన్ సిటిలో ఉన్నప్పుడు మా స్కూల్ అల్యూమిని వెబ్ సైట్ లో నేను యాడ్ అయ్యాను. గోవర్ధన్ బొబ్బా అని అవనిగడ్డ అతను, చిన్నప్పుడు మా స్కూల్ లోనే తను కూడా, కాకపోతే నా పేరు తెలుసు కాని నన్ను చూడలేదెప్పుడూ. తను ఓ రోజు కాల్ చేసాడు. తన వివరాలు చెప్పి అప్పటి నుండి అప్పుడప్పుడూ మాట్లాడేవాడు. ఇలా నా ప్రాజెక్ట్ అయిపోయిందని, కంపెని వాడు బెదిరించాడని చెప్పాను. గోవర్ధన్ ఇండియానా లో ఎమ్ ఎస్ చేస్తున్నాడు. వాళ్ళ దగ్గరకు రమ్మని చెప్పాడు. మరుసటి రోజు విజయ్ ఇండియా వెళిపోయాడు. షణ్ముఖ్ వాళ్ళ రూమ్ లో ఉన్నాను ఆ రోజు. రెండు మూడు గాస్ స్టేషన్స్ కి జాబ్ అడగడానికి కూడ తీసుకువెళ్ళాడు. మన పరిస్థితి ఏంటా అని దిగులుతో ఆ రాత్రంతా నిద్ర పోలేదు. మరుసటి రోజు గోవర్ధన్ ఫోన్ చేసి తన ఫ్రెండ్స్ తో వచ్చానని, నన్ను వాళ్ళతో రమ్మని చెప్పాడు. అడ్రస్ చెప్తే వచ్చి ఇండియానా నన్ను కూడా తీసుకువెళ్ళారు. ఓ సూట్కేస్ ఇక్కడే వదిలేసాను తర్వాత తీసుకోవచ్చని. 
              ఇండియానా యూనివర్శిటీలో MS చేసే పిల్లలు అందరు కలివిడిగానే ఉండేవారప్పుడు. గోవర్థన్ రూమ్ లో విజయ్, ఇంకో అతను ఉండేవారు. వీళ్ళ క్లాస్మేట్ ఓ అమ్మాయి పేరు శ్వేత అనుకుంటా. తను చాలా మంచి అమ్మాయి. నాతో ఎక్కువ క్లోజ్ గా ఉండేది. పిల్లలు అందరు నన్ను బాగా చూసుకున్నారు. గోవర్థన్ కి నా చిన్నప్పటి క్లాస్మేట్స్ తెలుసు. బాబి అని  మా చిన్నప్పటి క్లాస్మేట్ అమెరికాలోనే ఉన్నాడని, తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఎప్పుడో 88 లో చూసాను. సరే కానీ..గుర్తు పడితే మాట్లాడదాం లేదంటే లేదని ఫోన్ చేసా. హమ్మయ్య గుర్తు పట్టాడు బాబి. తన కబుర్లు చెప్పి, నా గురించి అడిగాడు. అలా మా చిన్నప్పటి స్నేహం మళ్ళీ కలిసిందన్నమాట. ఇండియానా లో వీళ్ళున్నది టెర్రాహట్ అన్న ఊరు. ఇక్కడ ఏమైనా జాబ్స్ ఉంటాయేమెానని చూశాను. ఈ HNC వాడు నాకు H1B వీడి కంపెనీకి మార్చలేదు. నరసరాజు అంకుల్ నేను జాబ్ లో ఉన్నప్పుడు GIS వాళ్ళు వాళ్ళ H1B కాన్సిల్ చేసుకోవచ్చా అని అడిగితే వీడు ట్రాన్స్ఫర్ చేసుకుంటానన్నాడని చెప్తే GIS వాళ్ళు ఆ H1B కాన్సిల్ చేసుకున్నారు. అందుకని నాకిప్పుడు స్టేటస్ కూడా పోతుంది. వెంటనే వేరే ఎవరితోనైనా H1B ఫైల్ చేయించుకోవాలి. ఫ్రెండ్స్ అందరిని అడగడం మెుదలు పెట్టాను. మెుత్తానికి ఎవరి వల్లా కాలేదు. అప్పటికే అమెరికాలో ఉద్యోగాలు తగ్గిపోయాయి. నా క్లాస్మేట్, మద్రాస్ లో నా కొలీగ్ అయిన సుబ్బారెడ్డికి మెసేజ్ చేస్తే, తను మా జూనియర్ శ్రీనివాస చౌదరికి చెప్పాడట. వాళ్ళ ఫ్రెండ్ కంపెనీ ఉందని వాళ్ళతో మాట్లాడమని నెంబర్ ఇచ్చారు. అమెరికన్ సొల్యూషన్స్ సుబ్బరాజు ఇందుకూరికి ఫోన్ చేసి మాట్లాడాను. H1B చేస్తామని, మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పారు. ఈ లోపల మా ఆయనకు తెలిసిన వారు ఉన్నారని వాళ్ళతో మాట్లాడమంటే, వాళ్ళేమెా MS చెయ్యి ఓ సెమిస్టర్ వరకు నేను చూసుకుంటానన్నారు. లేదండి H1B చేయించుకుంటానని చెప్తే, ఆ డబ్బులు తను పంపిస్తానని చెప్పారు. ఆయన పేరు రామస్వామి యనమదల. నేను ఈయనను ఇండియాలో ఓసారి కలిసాను జాబ్ కోసం. రఘుబాబు పోతిని పేరుతో పాటు ఈ ఇందుకూరి సుబ్బరాజు, రామస్వామి యనమదల పేర్లు బాగా గుర్తుంచుకోండి. 
           నాకేమెా ఖాళీగా ఉండటానికి ఇష్టంగా అనిపించలేదు. నా ఫ్రెండ్ వినికి ఫోన్ చేసి మాట్లాడుతుంటే తను వేరే జాబ్స్ ఉంటాయేమెా చూస్తానని, బేబి సిట్టింగ్ జాబ్స్ ఉన్నాయని ఆ వివరాలు చెప్పడం, వాటిలో ఓ రెండు నెంబర్లకి కాల్ చేయడం, నార్త్ ఇండియన్ వారు 1500 డాలర్లు ఇస్తాం రమ్మని చెప్పారు. మరొకావిడ తెలుగావిడ,డాక్టర్. రెసిడెన్సీ చేస్తున్నారు. వాళ్ళ పిల్లలను చూసుకోవడానికి అడిగారు. వాళ్ళాయన కూడా డాక్టర్. వేరే చోట ఉంటారు. లండన్ నుండి వచ్చారనుకుంటా. 1200 డాలర్లు ఇస్తానన్నారు. సరే అని ఉమతోనూ, వినితోనూ ఆలోచించి డాక్టర్ గారి దగ్గరకు వెళడానికి సిద్ధపడ్డాను. గోవర్థన్ కి చెప్పాను ఇదంతా. తనకి కార్ లేదు, కార్ రెంట్ కి తీసుకుని తను,  విజయ్ వచ్చి పంపిస్తామన్నారు. మర్చిపోయా నేను వెళ్ళాల్సిన ఊరు పిట్స్బర్గ్. పెన్సల్వేనియా స్టేట్. అదేనండి అమెరికాలో బాగా ఫేమస్ అయిన మన వేంకటేశ్వర స్వామి గుడి ఉన్న ఊరన్నమాట. ఉమా వాళ్ళు ఉండేది ఒహాయెాలో. వాళ్ళు పిట్స్బర్గ్ మేము పంపిస్తాము, గోవర్థన్ వాళ్ళను ఇక్కడకు తీసుకువచ్చేయమని చెప్పమన్నారు. పాపం పిల్లలు ఉమావాళ్ళ దగ్గర దిగబెట్టారు. అక్కడ ఓ వారం రోజులున్నాక, ఉమ, సురేష్ పిట్స్బర్గ్ వచ్చి, నన్ను గుడికి తీసుకువెళ్ళారు. అక్కడ మా గోపాలరావు అన్నయ్యా, వదిన కనిపించారు. నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసిన వదిన మేనమామ కొడుకు శీను అన్న కూడా కనిపించాడు. తర్వాత నన్ను డాక్టర్ గారి ఇంటిలో వదిలేసి, ఉమావాళ్ళు వెళుతుంటే బాగా ఏడుపు వచ్చేసింది. వాళ్ళిద్దరు వెంటనే " నీకెప్పుడు ఉండాలనిపించకపోతే అప్పుడు చెప్పు. మేం వచ్చి తీసుకువెళిపోతాం " అని, డాక్టర్ గారికి కూడా జాగ్రత్తగా చూసుకోండని చెప్పి వెళిపోయారు. డాక్టర్ గారికి పాప, బాబు. పాప 4, బాబు కిండర్ గార్డెన్. పాప స్కూల్ మేం ఉంటున్న అపార్ట్మెంట్ కి ఎదురుగానే. బాబు స్కూల్ కొద్దిగా పక్కన. డాక్టర్ గారు 6 గంటలకు డ్యూటీకి వెళిపోవాలి. పాపకి  8 కి, బాబుకి 11కి స్కూల్. స్కూల్ కి పంపడం, తీసుకురావడం, వాళ్ళను డాక్టర్ గారు వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోవడం నా పని. నాకో రూమ్, వాళ్ళ ముగ్గురికి ఓ రూమ్. 

వచ్చే వారం మరిన్ని కబుర్లతో...  

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner