19, ఫిబ్రవరి 2021, శుక్రవారం

ఎల్లక్క సమీక్ష

       " నాగరికతలో దాగిన అనాగరికతను ఎత్తి చూపే ఎల్లక్క " 
       అనాదినుండి జరుగుతున్న అన్యాయాలను ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు ఎత్తి చూపకుండా ఉండలేరు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యమే నేడు మన ముందున్న ఈ "ఎల్లక్క" సుదీర్ఘ వచనకావ్యం. ఇది పరిశోధనాత్మక, పరిశీలనా కావ్యం. ఇలాంటి సామాజిక లోపాలను ఎత్తి చూపడానికి గుండె ధైర్యంతో పాటుగా, ఓర్పు, నేర్పు కూడా చాలా అవసరం. 
       ఈ పుస్తకం నా దగ్గరకు రావడానికి ముందురోజు ప్రమెాద్ కుమార్ గారు, నేను ఫోన్ లో మాట్లాడుకుంటున్నప్పుడు ఈ ఎల్లక్క పుస్తకం గురించి ప్రస్తావన వచ్చింది. ఆ మరుసటి రోజే ఈ పుస్తకం నన్ను చేరడం అన్నది ఊహించని విషయం. దీనికి ముఖ్య కారణం సాగర్ శ్రీరామ కవచం అంకుల్. పుస్తకాన్ని నాకు పంపించమని జగదీష్ గారికి చెప్పినందుకు, పంపిన కెరె జగదీష్ గారికి వినమ్రపూర్వక ధన్యవాదాలు.
     ఈ పుస్తకం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏ పుస్తకమైనా నా దగ్గరకు రాగానే ముందుగా చదవడం మెుదలు పెడతాను. అలా కాస్త పైపైన చూసి, తర్వాత సమీక్ష రాసేటప్పుడు మెుత్తంగా చదువుతూ రాస్తాను. కాని " ఎల్లక్క " మెుదటి పేజి నుండి చివరి వరకు ఆపకుండా చదివించడమే కాకుండా, నా మెదడులో అదంతా చేరిపోయింది. ఇలా చాలా తక్కువ పుస్తకాల విషయంలోనే జరుగుతుంది. ఆనందోబ్రహ్మ, అధినేత, ఊసులాడే ఒక జాబిలట, యాతన...ఇలా కొన్ని పుస్తకాలు మాత్రమే మనసులో నిలిచిపోతాయి. ఆ కోవలోనిదే ఈ "ఎల్లక్క " కూడా.
      సమాజంలోని అనాచారాన్ని నిరసించాలంటే ఎంతో ధైర్యం కావాలి. పూర్వకాలపు రాజరికము వైభోగాలను వినిపిస్తూనే, అనాటి దేవదాసిల నుండి ఈనాటి జోగినిల వరకు, మధ్య మధ్య ప్రాంతాలకనుకూలంగా మారిన పేర్లను ఉదహరిస్తూ కావ్యాన్ని నడిపిన తీరు అద్భుతం. పేదరికంలో పుట్టిన ఆడబిడ్డల పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పడానికి ఎల్లక్కే ఉదాహరణ. 
      దురాచారం కుట్ర వెనుక జరిగిన మెాసాన్ని బసివినిగా ఎల్లక్కను మార్చడానికి పూనకం ముసుగులోని లొసుగును, బిడ్డను ఈ దుష్ట ప్రక్రియ నుండి కాపాడుకోలేని తల్లిదండ్రుల పేదరికాన్ని వాడుకున్న ఊరి పెద్దల దురాగతాన్ని కళ్ళకు కట్టినట్టుగా వివరించారు కెరె జగదీష్. ఏమి తెలియని వయసు నుండి చరమాంకం వరకు నలిగిన ఆ ఎల్లక్క మనసు గోసే ఈ ఎల్లక్క దీర్ఘకావ్యం. వయసులో ఉన్నప్పుడు వెలిగిన వెలుగులు, వయసుడిగిన తర్వాత వెలిసిన ఎల్లక్క బతుకుని చాలా హృద్యంగా చూపించారు. ఎల్లక్క అందాన్ని తనివితీరా ఆస్వాదించిన రసికులు, రోగాలతో కృసించి మరణించిన ఎల్లక్క దేహాన్ని చూడటానికి, మెాయడానికి కూడా రానప్పటి క్షణాలను కవి వర్ణించిన తీరు చదివిన ప్రతి ఒక్కరికి కన్నీరు తెప్పిస్తుంది. ఓ వెలుగు వెలిగిన బతుకు, ఆ వెలుగారిపోతే సమాజం ఏ విధంగా ప్రవర్తిస్తుందో తెలియడానికి ఎల్లక్కే సాక్ష్యం. ఇది ఒక ఎల్లక్క వ్యధ కాదు. ఈ దురాచారాలను అడ్డుకోలేని మన మానవ సమాజంలో ఎందరో ఎల్లక్కల మనసు పుస్తకం. ఈ అనాచారాలను చూస్తూ కూడా అడ్డుకోలేని నాగరిక సమాజం మనదైనందుకు సిగ్గుపడదాం. ఆధునికంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నామని భ్రమ పడుతున్న మనకు ఈ ఎల్లక్క జీవితం ఓ హెచ్చరిక. మనం ఎక్కడ ఉన్నామని తెలియజేస్తోంది. 
         సరళంగా, సున్నితంగా సమాజంలోని మూఢాచారాన్ని, హేయమైన చర్యను మూలాల నుండి పరిశోధన చేసి, సహేతుకంగా వివరిస్తూ, పరిష్కారాన్ని కూడా చూపించిన కెరె జగదీష్ గారికి హృదయపూర్వక శుభాభినందనలు. 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner