22, జూన్ 2021, మంగళవారం
రెక్కలు
1. మరుపు
సహజం
మార్పు
జీవనక్రమం
కాలమే
సమాధానం అన్నింటికి..!!
2. సమాధానాలు
ప్రశ్నలతోనే
సమస్యలు
జీవితాల్లో
ఎంత చెట్టుకి
అంత గాలి మరి..!!
3. ఆరాటం
మనసుది
ఆర్తిని పంచేది
అక్షరం
అనంతాన్ని
అరచేతిలో చూపెడుతూ...!!
4. కాలం
చెప్పిన సంగతులే
కలానికి
అందిన అనుభవాలు
మనసు గమనాలే
గత చరిత్ర పుటలన్నీ..!!
5. రెప్పల చాటున
కన్నీరు
గుండెల మాటున
గునపపు పోట్లు
అనుబంధపు ఆటల్లో
అలుపెరుగని అక్షర శరాలు..!!
6. మాట
నేర్పిన వారొకరు
మౌనం
అలవాటు చేసిన వారొకరు
మార్పు
మంచిదే..!!
7. అమ్మ ఒడే
అక్షరాల బడి
మాట నేర్చినా
మౌనం వహించినా
ఆది గురువు
అందించిన ఆసరానే ఇదంతా..!!
8. నమ్మకం
ఆసరా అవుతుంది
నడత
అమ్మ నేర్పుతుంది
గెలుపోటములు
జీవితపు ఆటవిడుపులు..!!
9. భరించడం
అలవాటే
బాధ్యతలకు
బంధీగా మారి
చేతగానితనమని
చిన్నతనం చేస్తున్నా..!!
10. సరిపెట్టుకోవడం
నేర్చుకుంటే
సర్దుకుపోవడం
అలవాటవుతుంది
కొన్ని బంధాలను
భరించాలంటే తప్పదు మరి...!!
11. ఆపేక్షలు
అద్దంలో చందమామాలే
అనుబంధాలు
అంగడి సరుకులైపోయాయిప్పుడు
నోటి మాట నొసటి విరుపు
మనిషి నైజమైంది...!!
12. ధర్మం
అధర్మం
ఏది సత్యం
ఏది నిత్యం
మహా భారతం
మన కథైనప్పుడు..!!
13. మౌనం
వహించింది
మాటలు
మరచికాదు
కాలం
చెప్పే సమాధానం చేరుతుందని...!!
14. రాయి వేయడం
ఎంతసేపు
శిలాఫలకం కావడానికే
సమయమెంతన్నది తెలియదు
రాజకీయ
నటనా చాతుర్యమది...!!
15. అక్షరంతో
సాన్నిహిత్యం
అమ్మతో
సన్నితత్వం
కొన్ని బంధాలు
గతజన్మవే...!!
16. మనిషికి
ఆత్మకు
మధ్యన
అంతరమే
చీకటి వెలుగుల
రహస్యం...!!
17. ప్రయత్నమే
గెలుపు
ఫలితం
ఏదైనా
జీవితపు
అంతర్యుద్ధంలో...!!
18. వెలి
వేయాల్సిన తరుణం
అంతరంగపు
ముసుగు నైజాలను
సంఘర్షణలకు
చరమగీతం పాడాలంటే...!!
20. ఆరాటానికి
పోరాటానికి మద్యనే
మనిషి జీవిత
ప్రయాణం
నడక నడతల
సమతౌల్యమే వ్యక్తిత్వం..!!
21. సమయ పాలన
తెలియాలి
సమస్యను
తట్టుకోగలగాలి
జీవితం
పూలపానుపు కాదు..!!
22. తప్పించుకునే నైజం
కొందరిది
తప్పించుకోలేని వైనం
మరి కొందరిది
జీవితం
చీకటి వెలుగుల సయ్యాట...!!
23. అవసరానికి
ఆణిముత్యాలు
ధనప్రేమకు
అసలైన చుట్టాలు
నటించడం
నేటి మనిషి కళ..!!
24. అదుపు
అవసరమే
నోటికైనా
మనిషికైనా
మనమేంటో
మన చావు చెప్తుందట..!!
25. మౌనం చెప్పిన
మాటలు
మనసుని
అనువదించిన అక్షరాలు
కాలానికి కలానికి
జత కలిపిన సాక్షీ సంతకాలివి..!!
26. మాట
ఏమార్చడం
మనిషి
నైజమైనప్పుడు
కలమూ బదులివ్వలేనంటూ
కాలానికే వదలివేసింది..!!
27. ఉత్తములని
కొందరిని
అధములని
మరి కొందరిని అనుకుంటాం
పుట్టుకతోనే నిర్ణయించబడే
గుణాలని తెలియక..!!
28. చెదిరిపోయే
మనసు కాదు
చెరిగిపోయే
రాతలు కాదు
అంతరార్థం అర్థమయితే
ఆత్మజ్ఞాన దర్శనమే...!!
29. విలువ
తెలియని మనుష్యులు
రాత లోతు ఎరుగని
నిరక్షరాస్యులు
కలమయినా కాలమయినా
మూర్ఖునికొకటే...!!
30. మౌనాన్ని
కానుకగా చేసి
మనసుని విరిచేసిన
బంధాలు కొన్ని
దూరం తరగని
ప్రయాణమది...!!
వర్గము
రెక్కలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి