28, జూన్ 2021, సోమవారం

కాలం వెంబడి కలం.. 60


        పొద్దు పొద్దున్నే ఆరింటికి అనుకోకుండా అప్పటికప్పుడు విజయనగరం బయలుదేరాను రత్నాచల్ లో. నా దగ్గర ఏ సెల్ ఫోనూ లేదప్పటికి. వాసు పెళ్లికి 1996 లో అనుకుంటా గజపతినగరం వెళ్ళి వచ్చాక మళ్లీ అటువైపు వెళ్ళనేలేదు. అందులోనూ రైలు ప్రయాణం పగటిపూట. నాకు చాలా ఇష్టమైన మా విజయనగరం వెళ్ళడం అనే సరికి బోలెడు సంతోషం కూడానూ. రాజమండ్రిలో గోదావరి బ్రిడ్జ్ ని ట్రైన్ లో నుండి చూడటం ఎంత బావుంటుందో. బ్రిడ్జ్ దాటేటప్పుడు ఆ చప్పుడు భలే ఉంటుంది. అదంతా నా వెంట తెచ్చుకున్న కామ్ కాడర్ లో రికార్డ్ చేసుకున్నాను. వైజాగ్ లో ట్రైన్ దిగి బస్ స్టేషన్ కి ఆటోలో వెళ్లి విజయనగరం బస్ ఎక్కాను. గంట ప్రయాణమే కాని నాకెందుకో చాలాసేపనిపించింది. మయూరి సెంటర్ చూడగానే హమ్మయ్య వచ్చేసా అనుకున్నా. బస్ స్టాండ్ లో దిగి ఆటోనో, రిక్షానో గుర్తులేదు పాల్ నగర్ అని మాట్లాడుకుని బయలుదేరాను. చాలా మారిపోయింది విజయనగరం నేను చూసినప్పటికి, ఇప్పటికి. అప్పట్లో కంటోన్మెంట్ దాటిన తర్వాత అంతా ఖాళీగా ఉండేది. ఇప్పుడేమెా అన్నీ ఇళ్ళే.                           మెుత్తానికి ఇల్లు గుర్తు పట్టాను. హిందీ టీచర్ గారిని చూడగానే ఎంత సంతోషమెా. కొన్ని అనుభూతులకు మాటలు కూడా కరువే. బాగా చిక్కిపోయారు టీచర్ గారు. అంకుల్ కూడా ఇంట్లోనే ఉన్నారు. ఏవో నేను తీసుకెళ్లిన చిరు కానుకలు ఇచ్చాను. అరుణ ఫోటోలు నా కామ్ కాడర్ లో రికార్డ్ చేసుకున్నాను. వీళ్ళింటికి దగ్గరలోనే రాధక్క వాళ్ళ ఇల్లు. మా నాన్నను మెాసం చేసిన ఫ్రెండ్ మేనకోడలు. అలా ఆ సాయంత్రం వరకు బోలెడు కబుర్లు చెప్పుకున్నాం. లాండ్ లైన్ నుండి వాసుకి ఫోన్ చేసాను. వెంటనే టీచర్ గారింటికి వచ్చాడు. చిన్నప్పటి కబుర్లు చాలానే చెప్పుకున్నాం అందరం కలిసి. అప్పుడే వాసు వాళ్ళింటికి వెళదామంటే రేపు వస్తానని చెప్పాను. ఆ సాయంత్రం అంకుల్, నేను నాన్న ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాము. శైలక్క, అందరు కలిసారు. మామ్మ కూడా ఉందప్పుడు. కుమారి పెద్దమ్మ లేదు గుడికి వెళ్ళిందట. కాసేపు ఉండి వచ్చేసాము. 
     మరుసటి రోజు పొద్దుటే వాసు వచ్చాడు. వాసు బైక్ మీద మా ఊరు పినవేమలి లో రమా వాళ్ళింటికి ముందు వెళ్ళి అక్కడ అందరిని పలకరించి, చిన్ననాటి జ్ఞాపకాలను పలకరించడం, అక్కడ అందరు ఇంట్లో అందరిని పేరుపేరునా అడగడం చాలా సంతోషం అనిపించింది. మా ఇల్లు కొనుక్కున్న కరణం గారు ఆ పాత మిద్దె ఇల్లు పడగొట్టి అటు ఇటు రెండు ఇళ్ళుగా వేసుకున్నారు. వాళ్ళ పెద్దబ్బాయి మంగారావు మాతోనే చదివాడు. అక్కడ తను లేడప్పుడు. మిగతా ఇద్దరు పిల్లలు ఉన్నారు. సత్యవతి గారు, కరణం గారు ఉన్నారు. నా బొమ్మలాటలకు సత్యవతి గారు బొరుగులు(మరమరాలు) ఇచ్చేవారు. ఆ పక్కనే మాతో కలిసి చదువుకుని, మాతోపాటుగా పెరిగిన నరశింగరావు వాళ్ళింటికి వెళ్ళి, నరశింగరావు వాళ్ళ నాన్న సూరిరావుని కూడా పలకరించాను. బాగా తెలివిగలవాడు సూరిరావు. మా చిన్నప్పుడు భలే లాజిక్ లు అడుగుతూ ఉండేవాడు. మా బజార్లో అందరు ఎప్పుడూ సందడిగా  మా ఇంటి దగ్గరే కూర్చునేవారు. ఇంకా చాలామంది పలకరించారు. నరసింగరావుని శ్రీను అని మా ఇంటి దగ్గర ఆవిడ అప్పయమ్మ కోడలు తమ్ముడు ఫోన్ నెంబర్ కనుక్కోమని చెప్పాను. పినవేమలి నుండి వస్తూ దారిలో రాకోడు రోడ్డు దగ్గర రమణిని గుర్తు చేసుకున్నాం నేను, వాసు. రాకోడు తీసుకువెళ్ళనా అంటే రమణి ఎక్కడ ఉందో తెలియదుగా, అక్కడ ఎవరు మనకు తెలియదుగా వద్దులే అంటే, దారిలో మిల్ దగ్గర రమణి వాళ్ళ పిన్ని వాళ్ళు ఉన్నారనుకుంటా, వాళ్ళని కలిసినట్లు గుర్తు. 
     తర్వాత జొన్నవలస వచ్చాం. ఊరి మెుదట్లోనే లోపలికి జానకిరాం వాళ్ళిల్లు. సరేనని వాళ్ళింటికి వెళితే వాళ్ళింట్లో చాలామంది ఉన్నారప్పుడు. కార్తీకమాసం నోములట ఆరోజు. పిల్లలని, వాళ్ళావిడని పరిచయం చేసాడు. మరురోజు వాసు వాళ్ళింటికి రమ్మని చెప్పి, పాపం ఎందుకులే ఇబ్బంది పెట్టడమని మేం వచ్చేసాం. దారిలో కందిశీను ఇంటికి వెళితే తను లేడు, వాళ్ళావిడకు శ్రీనుని రేపు రమ్మని చెప్పి, ప్రదీప్, సుధల దగ్గరికి వెళ్ళి కాసేపు ఉండి, తనని కూడా రమ్మని చెప్పి, హిందీ టీచర్ గారి బాబు, కోడలు, పిల్లలు వస్తే వాళ్ళని కూడా కలిసి, అపర్ణ వేసిన నాకిష్టమైన తెపాళ చెక్కలు తిని, విజయనగరంలో నా ఇంటరు ఫ్రెండ్ వరలక్ష్మిని కలవడానికి వెళితే, వాళ్ళ అమ్మగారు చనిపోయిన విషయం తెలిసింది. మా వరలక్ష్మి కన్నా కూడా ఆంటి నాకు మంచి ఫ్రెండ్. అంకుల్ షాప్ లో ఉంటే అంకుల్ ని కూడా పలకరించి, మా మహరాజా మహిళా కళాశాలని చూసుకుని, ఆ రాత్రికి వాసు వాళ్ళింటికి చేరాం. వాసు భార్య సంధ్య వాసుకి మేనకోడలే. చాలా సేపు కబుర్లు చెప్పుకున్నాం. మరుసటి రోజు పొద్దుటే వాసు వాళ్ళ అక్క కూడా వచ్చారు. బొబ్బట్లు నాకు ఇష్టమని చేసారు. రాము, ప్రదీప్ వచ్చారు. మా చిన్నప్పటి కబుర్లు అన్నీ కలబోసేసుకున్నాం. సాయంత్రం వాళ్ళు వెళిపోయారు. నరసింగరావు శ్రీను ఫోన్ నెంబర్ ఇచ్చాడు. వెంటనే ఫోన్ చేసా. తన వైఫ్ మాట్లాడింది మాస్టారు లేరు బయటికి వెళ్ళారని చెప్పింది. తర్వాత మళ్లీ చేసి మాట్లాడాను. చాలా సంవత్సరాల తర్వాత కదా..మాటలు. ఇంటికి రమ్మంటే ఈసారికి కుదరదు వెళిపోతున్నానని చెప్పాను. 
        రైల్వేస్టేషన్ కి వెళ్ళి టికెట్ బుక్ చేసుకుంటుంటే శ్రీను వచ్చాడు తన పాత పద్ధతిలోనే స్వీట్ బాక్స్ తీసుకుని. టికెట్ బుక్ చేసుకుని నేను, వాసు, శ్రీను బస్ స్టాండ్ కి వచ్చాము. బస్ కనెక్షన్ డైరెక్ట్ గా రైల్వేస్టేషన్ కి. వాసు రేగ్గాయలు పెద్దవి కొనిచ్చాడు. అలా విజయనగరం చుట్టూ తిరిగి, మళ్లీ గోదావరి నదిని దాటుకుంటూ, విజయవాడ చేరానన్న మాట. 

"  ఒక్కోసారి మనసు నిండిన ఆనందాన్ని అంతా అక్షరాల్లో చూపించలేము. ఆ అనుభూతి ఆస్వాదన అలా ఉండిపోతుంది దశాబ్దాలు గడచినా.. "

వచ్చే వారం మరిన్ని కబుర్లతో..


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner